Tuesday, April 19, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౨౪(524)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1114-వ.
ఇట్లు మహనీయతేజోనిధియైన మాధవు దయాపరిలబ్ధనిఖిల వస్తువిస్తారుం డయ్యును, నిజాధికారశుద్ధికొఱకు మరలఁ గన్యారత్నంబును, వినూత్నరత్నవ్రాతంబును సమర్పించె; నని భూసుర విసరంబులు వినుతింప మా తండ్రియైన బృహత్సేనుండు నన్నును సమస్త వస్తువులను గృష్ణునకు సమర్పించి, క్రమంబున సకల యాదవులనుం బూజించి మరలి నిజపురంబునకుం జనియె” నని చెప్పినఁ గుంతియు గాంధారియుఁ గృష్ణయు, నఖిల నృపాలకాంతాజనంబులును, గోపికలుం దమతమ మనంబుల సర్వభూతాంతర్యామియు, లీలామానుష విగ్రహుండును నైన పుండరీకాక్ష చరణారవింద స్మరణానంద పరవశలై కృష్ణుం బ్రశంసించి; రంత.

భావము:
మహా తేజోనిథి అయిన శ్రీకృష్ణుని అనుగ్రహం వలననే గొప్ప వైభవ సంపత్తులు మా నాన్నగారికి ప్రాప్తించాయి. అయినా తన అధికారానికి అనుగుణంగా కన్యారత్నంతోపాటు అనేక అనర్ఘరత్నాలను మాతండ్రి శ్రీకృష్ణుడికి సమర్పించాడు. బ్రాహ్మణోత్తములు ఆశీస్సులతో కొనియాడుతుండగా, మా తండ్రి బృహత్సేనుడు యథోచితంగా యాదవ ప్రముఖులను పూజించి తన నగరానికి తిరిగి వెళ్ళాడు." అంటూ లక్షణ తన పరిణయ వృత్తాంతాన్ని ద్రౌపదికి తెలిపింది. అంతట, గాంధారీ, కుంతీ, ద్రౌపదీ, తక్కిన రాజపత్నులూ గోపికలూ తమ తమ హృదయాలలో సర్వాంతర్యామి, లీలామానుష రూపుడు అయిన శ్రీకృష్ణుడి పాదపద్మాలను స్మరిస్తూ ఆనందంతో పరవశించారు. వాసుదేవుని ప్రస్తుతించారు. అటు పిమ్మట కొంతకాలానికి....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=78&Padyam=1114

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: