10.2-1109-ఉ.
ఆ తఱి భూరిబాహుబలులైన విరోధి నరేశ్వరుల్ మృగ
వ్రాతము లొక్కపెట్ట మృగరాజకిశోరముపై నెదిర్చి న
ట్లాతురులై చతుర్విధ సమగ్ర బలంబులతోడఁ గూడి ని
ర్ధూత కళంకుఁడైన నవతోయజనేత్రునిఁ జుట్టు ముట్టినన్.
10.2-1110-చ.
అలిగి మురాంతకుండు కులిశాభశరంబుల నూత్నరత్నకుం
డలములతో శిరంబులు, రణన్మణినూపురరాజితోఁ బదం
బులుఁ, గటకాంగుళీయక విభూషణచాప శరాలితోడఁ జే
తులు, నిలఁగూలఁగా విజయదోహలియై తునుమాడె వెండియున్
భావము:
ఆ తరుణంలో మహా బాహుబల విక్రములు అయిన ఆ రాజులందరూ చతురంగబలాలతో కూడి ఒక్కపెట్టున వనమృగాలు మృగేంద్రుని ఎదిరించిన రీతిగా నిర్మలుడు అయిన శ్రీకృష్ణుడిని చుట్టుముట్టారు. అది చూసి కృష్ణునికి మిక్కిలి ఆగ్రహం కలిగింది. ఆయన వజ్రాయుధానికి సాటివచ్చే వాడిబాణాలను ప్రయోగించాడు. కర్ణకుండలాలతో కూడిన శత్రురాజుల శిరస్సులూ, నూపురాలతో పాటూ పాదాలూ కంకణాలతో పాటు చేతులూ తెగి నేలపై కూలేలా చేసి శత్రువు లయిన సకల రాజులను నిర్మూలించాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=78&Padyam=1110
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment