Friday, April 29, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౨౯(529)

( వసుదేవుని గ్రతువు ) 

10.2-1121-సీ.
"ఆదిత్య, చంద్రాగ్ని, మేదినీ, తారాంబు-
  మారుతాకాశ, వాఙ్మనము లోలిఁ
బరికింపఁ దత్తదుపాసనంబులఁ బవి-
  త్రములుసేయఁగ సమర్థములు గావు;
సకలార్థగోచరజ్ఞానంబు గల మహా-
  త్మకులు దారు ముహూర్తమాత్ర సేవఁ
జేసి పావనములు సేయుదు; రదియు న-
  ట్లుండె ధాతుత్రయ యుక్తమైన
10.2-1121.1-తే.
కాయమం దాత్మబుద్ధియుఁ, గామినీ కు
మారులందు స్వకీయాభిమానములునుఁ,
దివిరి జలమునఁ దీర్థబుద్ధియునుఁ జేయు
నట్టి మూఢుండు పశుమార్గుఁ డనఁగఁ బరఁగు."

భావము:
తరచిచూస్తే, సూర్యచంద్రులు, భూమి, నక్షత్రాలు నీరు, గాలి, ఆకాశములను పూజించినా, అవి మానవుడిని పవిత్రం చేయలేవు. సమస్త విషయాలూ తెలిసిన విజ్ఞానులైన మహాత్ములు ముహుర్తమాత్రం సేవచేతనే మానవులను పవిత్రం చేస్తారు. వాటి మాటకేం గాని. వాతపిత్తశ్లేష్మ అనే త్రిధాతువుల మయమైన శరీరాన్ని ఆత్మ అనుకోవడం; భార్యాపుత్రులు ఆత్మీయులు అని భావించడం; సాధారణ నీటి వనరుని పుణ్యతీర్ధ మని భావించడం మూర్ఖుల లక్షణం. అట్టి మూర్ఖుడిని పశుమార్గంలో ప్రవర్తించేవా డని చెప్పవచ్చు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=79&Padyam=1121

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: