Tuesday, January 29, 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 103

10.1-619-క.
మఱియును దనుజుఁడు రామునిఁ
గఱవఁగ గమకించి తెఱపిఁ గానక యతనిం
జుఱచుఱఁ జూచుచు శౌర్యము
పఱిబోవఁగ నింత నంతఁ బదమలఁ దన్నెన్
10.1-620-వ.
అంత బలభద్రుండు రౌద్రాకారంబున గర్దభాసురుపదంబులు నాలుగు నొక్క కేల నంటంబట్టి బెట్టుదట్టించి త్రిప్పి విగతజీవునిం జేసి.

భావము:
తన్నడంతో ఊరుకోకుండా ఆ రాక్షసుడు బలరాముడిని కరవడానికి ప్రయత్నించాడు. కానీ బలరాముడు అంద లేదు. ఇంక చేసేదిలేక ఆ రాక్షసుడు చుర చుర చూస్తూ ఇటు అటు తన్నులు తన్నసాగాడు. అయితే అందులో అతని బలం క్షీణించినట్లు తెలిసిపోతూ ఉంది. అప్పుడు బలరాముడు రౌద్రాకారం ధరించాడు. ఆ గాడిద రాక్షసుడి నాలుగు కాళ్ళు కలిపి ఒక్క చేత్తో ఒడిసి పట్టుకుని మహావేగంగా గిర గిరా త్రిప్పికొట్టి వాణ్ణి మట్టుపెట్టాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=79&padyam=619

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: