10.1-597-వ.
అయ్యెడఁ గృష్ణుం డొక్కనాడు రేపకడ లేచి, వేణువు పూరించి బలభద్ర సహితుండై గోపకుమారులు దన్ను బహువారంబులు గైవారంబులు జేయ, మ్రోల నాలకదుపుల నిడుకొని నిరంతర ఫల కిసలయ కుసుమంబులును, కుసుమ మకరంద నిష్యంద పానానంద దిందింర కదంబంబును, గదంబాది నానాతరులతా గుల్మ సంకులంబును, గులవిరోధరహిత మృగపక్షిభరితంబును, భరితసరస్సరోరుహపరిమళమిళిత పవనంబును నైన వనంబుఁ గని యందు వేడుకం గ్రీడింప నిశ్చయించి వెన్నుం డన్న కిట్లనియె.
భావము:
ఇలా ఉండగా ఒక రోజు, కృష్ణుడు సూర్యోదయానికి ముందే మేల్కొని వేణుగానం చేసాడు. గోపకుమారులు అందరూ వెంటనే మేలుకుని లేగల మందలను తోలుకుని కృష్ణుడి వద్దకు చేరారు. బలరాముడు, కృష్ణులతో కలసి గోపబాలకులు తనను పదేపదే పొగడుతూ ఉండగా ఆవుల మందలను తోలుకుంటూ అడవికి బయలుదేరాడు. ఆ అడవిలో అవ్ని ఋతువులలోనూ పళ్ళు పూలు చిగుళ్ళు లభిస్తాయి. పూవులలో తేనెలు పొంగిపొరలుతూ ఉంటే ఆ తీయతేనెలను త్రాగడానికి వచ్చి జుమ్ము జుమ్మని ధ్వనులు చేసే తుమ్మెదల గుంపులు ఆనందం కలిగిస్తూ ఉన్నాయి. కడిమి మొదలైన అనేక రకాల చెట్లు, తీగలు, పొదరిళ్ళు, ఆ అడవి నిండా అడుగడుగునా ఉన్నాయి. అక్కడి జంతువులు పక్షులు తమ తమ జాతి సహజములైన శత్రుత్వాలను మరచిపోయి ప్రవర్తిస్తూ ఉన్నాయి. అక్కడి సరస్సుల లోని నీళ్ళు చక్కని తామర పూల పుప్పొడి పరిమళం వెదజల్లుతూ ఉన్నాయి. ఆ అడవిలో ఉత్సాహంగా ఆడుకోవాలని కృష్ణుడు నిశ్చయించుకున్నాడు. అన్నగారు అయిన బలరాముడితో ఇలా అన్నాడు.
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment