Sunday, January 6, 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 87

10.1-592-సీ.
“అఖిల జంతువులకు నాత్మవల్లభమైన; 
భంగి బిడ్డలు నిండ్లుఁ బసిఁడి మొదలు
వస్తువు లెవ్వియు వల్లభంబులు గావు; 
సకలాత్మకుండైన జలజనేత్రు
డఖిల జంతువులకు నాత్మ గావున ఘోష; 
వాసుల కెల్లను వల్లభత్వ
మున మిక్కిలొప్పెను మూడులోకములకు; 
హితము చేయఁగ జలజేక్షణుండు
10.1-592.1-ఆ.
మాయతోడ మూర్తిమంతుడై యొప్పారు; 
గలఁ డతండు నిఖిల గణము లందు
భవతిధాతు వెట్లు భావార్థమై సర్వ
ధాతు గణమునందుఁ దనరు నట్లు.

భావము:
జీవరాసులు అన్నింటికి “తనకు తాను ఇష్టమైనంత” బిడ్డలు గాని, ఇండ్లు గాని, బంగారం మొదలైన వస్తువులు గాని ప్రియమైనవి కావు. అన్నిటి యందు ఆత్మగా ఉన్న విష్ణువు అన్ని జీవరాసులలో “ఆత్మస్వరూపుడుగా” ఉన్నాడు. కనుకనే గోకుల నివాసులకు అందరికి ప్రియుడై చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాడు. పద్మముల వంటి కన్నులు ఉన్న విష్ణుమూర్తి మాయతో కూడిన రూపం ధరించి ప్రకాశిస్తున్నాడు. ఇదంతా మూడు లోకాలకూ మేలు చేయడానికే. క్రియలను తెలిపే అన్ని ధాతువులకూ “భవతి” అనే ధాతువు భావంగా అంతర్లీనమై ఉంటుంది. అలాగే చరాచర సృష్టి లోని అన్నిటి యందూ విష్ణువు ఉన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=76&padyam=592

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: