Wednesday, June 28, 2017

దక్ష యాగము - 75:

4-164-చ.
సలలిత శంఖ చక్ర జలజాత గదా శర చాప ఖడ్గ ని
ర్మల రుచులున్ సువర్ణ రుచిమన్మణి కంకణ ముద్రికా ప్రభా
వళులును దేజరిల్లు భుజవర్గ మనర్గళ కాంతియుక్తమై
విలసిత కర్ణికార పృథివీరుహముం బురుడింపఁ బిట్టుగన్.
4-165-క.
సరసోదార సమంచిత
దరహాస విలోకనములఁ దగ లోకములం
బరితోషము నొందించుచుఁ
బరమోత్సవ మొప్ప విశ్వబంధుం డగుచున్.

టీకా:
సలలిత = అందమైన; శంఖ = శంఖము; చక్ర = చక్రము; జలజాత = పద్మము; గదా = గద; శర = విల్లు; చాప = బాణము; ఖడ్గ = ఖడ్గములయొక్క; నిర్మల = నిర్మలమైన; రుచులున్ = కాంతులు; సువర్ణ = బంగారు; రుచిమత్ = ప్రకాశవంతమైన; మణి = రత్నములు తాపిన; కంకణ = చేతికి ధరించు కంకణములు; ముద్రికా = ఉంగరముల; ప్రభా = కాంతుల; ఆవళులును = పుంజములు; తేజరిల్లు = విలసిల్లు; భుజ = భుజముల; వర్గము = సమూహము; అనర్గళ = సాటిలేని; కాంతి = కాంతులతో; యుక్తము = కూడినది; ఐ = అయ్యి; విలసిత = అందమగు, పుష్పించిన; కర్ణికార = కొండగోగు; పృథివీరుహమున్ = చెట్టును; పురుడింపన్ = పోలియుండెను; బిట్టుగన్ = అధికముగ. సరస = సరసమైన; ఉదార = ఔదార్యముతో; సమంచిత = చక్కగకూడిన; దరహాస = చిరునవ్వుల; విలోకనములన్ = చూపులు; తగన్ = తగి; లోకములన్ = లోకములను; పరితోషమున్ = సంతోషమును; ఒందించుచున్ = కలిగిస్తూ; పరమ = అత్యధికమైన; ఉత్సవము = వైభవము; ఒప్పన్ = ఒప్పియుండగ; = విశ్వబంధుండు = విశ్వమునకు బంధువు; అగుచున్ = అవుతూ.

భావము:
అందమైన శంఖం, చక్రం, పద్మం, గద, విల్లమ్ములు, ఖడ్గం మొదలైనవాటి నిర్మల కాంతులతోను, మణులు పొదిగిన బంగారు కంకణం, ఉంగరాల కాంతులతోను ప్రకాశించే భుజసమూహంతో తన శరీరం పూచిన కొండగోగుచెట్టు వలె అలరారుతుండగా (విష్ణువు సాక్షాత్కరించాడు). సరసమైన ఔదార్యంతో కూడిన చిరునవ్వుతో, చూపులతో లోకాలకు సంతోషాన్ని కలిగిస్తూ కన్నుల పండుగగా లోకబంధువౌతు (విష్ణువు సాక్షాత్కరించాడు).

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=165

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Tuesday, June 27, 2017

దక్ష యాగము - 74:

4-162-వ.
అని యిట్లు రుద్రక్షమాపణంబు గావించి పద్మసంభవుచేత ననుజ్ఞాతుండై దక్షుం డుపాధ్యాయ ఋత్విగ్గణ సమేతుం డగుచుఁ గ్రతుకర్మంబు నిర్వర్తించు సమయంబున, బ్రాహ్మణజనంబులు యజ్ఞంబులు నిర్విఘ్నంబులై సాగుటకుఁ బ్రమథాది వీర సంసర్గ కృత దోష నివృత్త్యర్థంబుగా విష్ణుదేవతాకంబును ద్రికపాలపురోడాశ ద్రవ్యకంబును నైన కర్మంబుఁ గావింప నధ్వర్యుకృత్య ప్రవిష్టుం డగు భృగువు తోడం గూడి నిర్మలాంతఃకరణుం డగుచు దక్షుఁడు ద్రవ్యత్యాగంబుఁ గావింపఁ బ్రసన్నుండై సర్వేశ్వరుండు.
4-163-సీ.
మానిత శ్యామాయమాన శరీర దీ; 
ధితులు నల్దిక్కుల దీటుకొనఁగఁ
గాంచన మేఖలా కాంతులతోడఁ గౌ; 
శేయ చేలద్యుతుల్ చెలిమి చేయ
లక్ష్మీసమాయుక్త లలిత వక్షంబున; 
వైజయంతీ ప్రభల్ వన్నెచూప
హాటకరత్న కిరీట కోటిప్రభల్; 
బాలార్క రుచులతో మేలమాడ
4-163.1-తే.
లలితనీలాభ్రరుచిఁ గుంతలములు దనరఁ 
బ్రవిమలాత్మీయ దేహజప్రభ సరోజ
భవ భవామర ముఖ్యుల ప్రభలు మాప
నఖిలలోకైక గురుఁడు నారాయణుండు.

టీకా:
అని = అని; ఇట్లు = ఈవిధముగ; రుద్ర = రుద్రునికి; క్షమాపణ = క్షమాపణకోరుట; కావించి = చేసి; పద్మసంభవు = బ్రహ్మదేవుని; చేతన్ = చేత; అనుజ్ఞాతుండు = అనుజ్ఞ పొందినవాడు; ఐ = అయ్యి; దక్షుండు = దక్షుడు; ఉపాధ్యాయ = గురువులు; ఋత్విక్ = ఋత్విక్కుల; గణ = సమూహముతో; సమేతుండు = కూడినవాడు; అగుచున్ = అవుతూ; క్రతు = యజ్ఞ; కర్మంబున్ = కర్మలను; నిర్వర్తించు = చేసెడి; సమయంబున = సమయములో; బ్రాహ్మణ = బ్రాహ్మణ; జనంబులు = జనులు; యజ్ఞంబులు = యజ్ఞములు; నిర్విఘ్నంబులు = ఆటంకములులేనివి; ఐ = అయ్యి; సాగుట = జరుగుట; కున్ = కు; ప్రమథ = ప్రమథగణములు; ఆది = మొదలైన; వీర = వీరత్వముగల; సంసర్గ = గుంపులు; కృత = చేసిన; దోష = దోషముల; నివృత్తి = పోగొట్టుట; అర్థంబుగా = కోసము; విష్ణు = విష్ణువు; దేవతాకంబును = దేవతగా కలది; త్రికపాల = మూడు గిన్నెల; పురోడాశ = యజ్ఞార్థమైన ఆపూపములకైన {పురోడాశము - యాగార్థమైన అపూపము (పిండితో చేసిన పిడచలు లేదా ముద్దలు)}; ద్రవ్యకంబును = పదార్థముతో కూడినది; ఐన = అయిన; కర్మంబున్ = యజ్ఞకర్మమును; కావింపన్ = చేయుటకు; అధ్వర్వు = అధ్వర్వ్యుడు అనెడి {అధ్వర్వ్యుడు - యజ్ఞమునందు అధర్వణవేదతంత్రము నడపువాడు}; కృత్య = చేయుట; ప్రవిష్టుండు = ప్రవేశముకలవాడు; అగు = అయిన; భృగువు = భృగువు; తోడన్ = తోటి; కూడి = కలిసి; నిర్మల = పరిశుద్ధమైన; అంతఃకరణుండు = అంతఃకరణము కలవాడు; అగుచున్ = అవుతూ; దక్షుడు = దక్షుడు; ద్రవ్య = ద్రవ్యములను; త్యాగంబున్ = త్యజించుట; కావింపన్ = చేయగా; ప్రసన్నుండు = ప్రసన్నుడు; ఐ = అయ్యి; సర్వేశ్వరుండు = విష్ణుమూర్తి {సర్వేశ్వరుడు - సర్వులకును ఈశ్వరుడు, విష్ణువు}. మానిత = మన్నింపదగు; శ్యామాయమాన = నల్లనిదైన; శరీర = దేహ; దీధితులు = కాంతులు; నల్దిక్కులన్ = నాలుగు (4) దిక్కులను {నాలుగు దిక్కులు - 1తూర్పు 2దక్షిణము 3పశ్చిమము 4ఉత్తరము}; దీటుకొనగ = పరచుకొనగ; కాంచన = బంగారపు; మేఖలా = మొలనూలు యొక్క; కాంతుల = ప్రకాశముల; తోడన్ = తోటి; కౌశేయచేల = పట్టుబట్ట; ద్యుతుల్ = మెరుపులు; = చెలిమి = స్నేహము; చేయన్ = చేస్తుండగ; లక్ష్మీ = లక్ష్మీదేవితో; సమాయుక్త = కూడిఉన్న; లలిత = అందమైన; వక్షంబున = వక్షస్థలమున; వైజయంతీ = వైజయంతిమాల; ప్రభల్ = కాంతులు; వన్నెచూప = ప్రకాశిస్తుండగ; హాటక = బంగారపు; రత్న = రత్నములు తాపిన; కిరీట = కిరీటము యొక్క; కోటి = అతిశయిస్తున్న; ప్రభల్ = కాంతులు; బాల = ఉదయిస్తున్న; అర్క = సూర్యుని; రుచుల = కాంతుల; తోన్ = తో; మేలమాడ = పరిహాసమాడ. 
లలిత = అందమైన; నీల = నల్లని; అభ్ర = మేఘముల; రుచిన్ = కాంతులతో; కుంతలములు = ముంగురులు; తనరన్ = అతిశయించ; ప్రవిమల = మిక్కిలినిర్మలమైన; ఆత్మీయ = స్వంత; దేహజ = శరీరమునుండి జనించు; ప్రభ = కాంతి; సరోజభవ = బ్రహ్మదేవుడు {సరోజభవ - సరోజము (పద్మము)న భవ (జనించినవాడు), బ్రహ్మదేవుడు}; భవా = శివుడు మొదలగు; అమర = దేవ; ముఖ్యుల = ప్రముఖుల; ప్రభలు = కాంతులు; మాపన్ = తగ్గింపజేయగ; అఖిలలోకైకగురుడు = విష్ణువు {అఖిలలోకైకగురుడు - సమస్తమైన లోకములకు ఒకడేయైన పెద్ద, హరి}; నారయణుండు = విష్ణువు {నారాయణుడు - నారములు (నీటి) యందు వసించువాడు, హరి}.

భావము:
అని ఈ విధంగా దక్షుడు క్షమింపుమని రుద్రుణ్ణి వేడుకున్నాడు. తరువాత బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించగా ఉపాధ్యాయులతోను, ఋత్విక్కులతోను కూడి యజ్ఞం చేయడం ప్రారంభించాడు. అప్పుడు బ్రాహ్మణులు యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగడానికి, ప్రమథ వీరుల సంబంధంవల్ల కలిగిన దోషం నివారించడానికి విష్ణుమూర్తి దేవతగా కలిగినదీ, పురోడాశ ద్రవ్యం కలిగినదీ అయిన కర్మను నిర్వర్తించారు. అధ్వర్యుకార్యాన్ని స్వీకరించిన భృగువుతో కూడి నిర్మలమైన మనస్సు కలవాడై దక్షుడు ద్రవ్యత్యాగం చేశాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు అనుగ్రహించి (సాక్షాత్కరించాడు). నల్లని మేని కాంతులు నాలుగు దిక్కుల్లో వ్యాపిస్తుండగా, బంగారు మొలత్రాడు కాంతులతో పట్టుబట్టల కాంతులు కలిసిపోగా, లక్ష్మికి కాపురమైన వక్షఃస్థలంపై వైజయంతీమాల కాంతులను ప్రసరిస్తుండగా, రత్నాలు పొదిగిన బంగారు కిరీటం కాంతులు బాలసూర్యుని వెలుగులతో అతిశయించగా, శిరోజాలు నీలమేఘ కాంతులతో ఒప్పుతుండగా, తన దేహంనుండి వెలువడే దివ్యకాంతులు బ్రహ్మ, శివుడు మొదలైన దేవతాశ్రేష్ఠుల దేహకాంతులను క్రిందుపరుస్తూ సమస్త లోకాలకు గురువైన నారాయణుడు (సాక్షాత్కరించాడు).

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=163

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Monday, June 26, 2017

దక్ష యాగము - 73:

4-161-సీ.
తలపోయ నవిదిత తత్త్వవిజ్ఞానుండ; 
నైన నాచేత సభాంతరమున
నతి దురుక్త్యంబక క్షతుఁడ వయ్యును మత్కృ; 
తాపరాధము హృదయంబు నందుఁ
దలఁపక సుజన నిందాదోషమున నధో; 
గతిఁ బొందుచున్న దుష్కర్ము నన్నుఁ
గరుణఁ గాచిన నీకుఁ గడఁగి ప్రత్యుపకార; 
మెఱిఁగి కావింప నే నెంతవాఁడ?
4-161.1-తే.
నుతచరిత్ర! భవత్పరానుగ్రహాను
రూప కార్యంబుచేత నిరూఢమైన
తుష్టి నీ చిత్తమందు నొందుదువు గాక; 
క్షుద్రసంహార! కరుణాసముద్ర! రుద్ర!"

భావము:
క్షుద్రులను సంహరించే రుద్రా! దయా సముద్రా! నేను తత్త్వజ్ఞానం తెలియని మూర్ఖుడను. మహాసభలో నేను పలికిన చెడ్డ పలుకులు అనే ములుకులచేత నీవు గాయపడ్డావు. అయినా నేను చేసిన నేరాన్ని నీవు మనస్సులో పెట్టుకోలేదు. మహానుభావుణ్ణి నిందించిన పాపంచేత అధోగతికి పోవలసిన పాపాత్ముణ్ణి నన్ను దయతో కాపాడావు. నీకు తిరిగి ఉపకారం చేయటానికి నే నెంతవాణ్ణి? ఓ సచ్చరిత్రా! త్రినేత్రా! ఇతరులను అనుగ్రహించే కార్యాల మూలంగా కలిగే ఆనందాన్ని నీవు పొందుదువు గాక!”

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=161

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Sunday, June 25, 2017

బాగవత జయంతి - 2017 బాలల బొమ్మల పోటీ.


బాగవత జయంతి - 2017 
బాలల బొమ్మల పోటీ..
బాగవత జయంతి - 2017
బాలల బొమ్మల పోటీ

6-15 ఏళ్ళ బాలలందరకూ
అంతర్జాల పైననే నడిచే పోటీ..
రండి రండి మీ పిల్లలకు మన సంస్కృతిపై ఆసక్తి పెంచుదాం...

దక్ష యాగము - 72:

4-159-క.
"విను; నీ కపరాధుఁడ నగు
నను దండించు టది దండనము గాదు మది
న్నను రక్షించుటగా మన
మునఁ దలఁతును దేవ! యభవ! పురహర! రుద్రా!
4-160-సీ.
అనఘాత్మ! తగ నీవు నబ్జనాభుండును; 
బరికింపఁ బ్రాహ్మణాభాసు లయిన
వారల యెడల నెవ్వలన నుపేక్షింప; 
రఁట! దృఢవ్రతచర్యు లైనవారి
యెడ నీకుపేక్ష యెక్కడిది? సర్గాదిని; 
నామ్నాయ సంప్రదాయప్రవర్త
నము నెఱింగించుట కమర విద్యాతపో; 
వ్రత పరాయణులైన బ్రాహ్మణులను
4-160.1-తే.
వరుసఁ బుట్టించితివి; కాన వారి నెపుడుఁ
గేల దండంబుఁ బూని గోపాలకుండు
బలసి గోవుల రక్షించు పగిది నీవు
నరసి రక్షించుచుందు గదయ్య రుద్ర!

టీకా:

విను = వినుము; నీకున్ = నీ ఎడల; అపరాధుడను = అపరాధము చేసినవాడను; అగు = అయిన; నను = నన్ను; దండించుట = శిక్షించుట; అది = అది; దండనము = దండనము; కాదు = కాదు; మదిన్ = అది; నను = నన్ను; రక్షించుట = రక్షించుట; కాన్ = అగునట్లు; మనమునన్ = మనసులో; తలంతును = తలుస్తాను; దేవ = దేవుడ {దేవ - దేవుడు, శివుడు}; అభవ = శివుడ {అభవ - పుట్టుకలేనివాడు, శివుడు}; పురహర = శివుడ {పురహర - త్రిపురములను హరించినవాడు, శివుడు}; రుద్రా = శివుడ {రుద్రుడు - రౌద్రము కలవాడు, శివుడు}.
అనఘాత్మ = పుణ్యాత్మ; తగన్ = తగ; నీవున్ = నీవును; అబ్జనాభుండును = విష్ణువు {అబ్జనాభుడు - అబ్జము (పద్మము) నాబిన కలవాడు, విష్ణువు}; పరికింప = సరిగచూసిన; బ్రాహ్మణ = బ్రహ్మణులలో; అభాసులు = బ్రష్టులు; అయిన = అయిన; వారల = వారి; ఎడ = అందు; ఎవ్వలనను = ఏవిధముగ; ఉపేక్షింపరట = నిర్లక్ష్యముచేయరట; దృఢ = గట్టి; వ్రతచర్యులు = విధముగ చరించువారు; ఐన = అయిన; వారి = వారి; ఎడ = అందు; నీకున్ = నీకు; ఉపేక్ష = అశ్రద్ధ; ఎక్కడిది = ఎక్కడిది; సర్గ = సృష్టి; ఆదిని = మొదటిలో; ఆమ్నాయ = వేదముల; సంప్రదాయమున్ = సంప్రదాయమును; ప్రవర్తనమున్ = విధానమును; ఎఱింగించుట = తెలుపుట; కున్ = కు; అమర = దేవతలను; విద్యా = విద్య; తపస్ = తపస్సు; వ్రత = వ్రతములందు; పరాయణులు = నిష్ఠకలవారు; ఐన = అయిన; బ్రాహ్మణులను = బ్రహ్మణులను. 
వరుసన్ = వరుసగా; పుట్టించితివి = పుట్టించితివి; కాన = కావున; వారినిన్ = వారిని; ఎపుడున్ = ఎప్పుడును; కేలన్ = చేతితో; దండంబున్ = కర్ర; పూని = ధరించి; గోపాలకుండు = గోవులుకాచెడివాడు; బలిసి = అతిశయించి; గోవులన్ = ఆవులను; రక్షించు = కాపాడు; పగిది = విధముగ; నీవున్ = నీవును; అరసి = చక్కగచూసి; రక్షించుచుందు = కాపాడుతుంటావు; కదు = కదా; అయ్య = తండ్రి; రుద్రా = శివ.

భావము:

“దేవా! అభవా! పురాంతకా! రుద్రా! విను. నీకు అపరాధం చేసిన నన్ను నీవు శిక్షించడం నాకు అది శిక్ష కాదు. అది నన్ను రక్షించడంగానే భావిస్తాను. పుణ్యాత్మా! నీవు, విష్ణువు కపట బ్రాహ్మణులను క్షమింపరు. దృఢమైన వ్రతం కల బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేయరు. సృష్టి ఆరంభంలో వేదసంప్రదాయాలను ప్రవర్తింపజేయడానికి నీవు బ్రాహ్మణులను సృజించావు. విద్య, తపస్సు, వ్రతం బ్రాహ్మణుల ధర్మాలు. కాబట్టి కర్ర చేత పట్టుకొని గోపాలుడు గోవులను కాపాడే విధంగా నీవు బ్రాహ్మణులను నిత్యం శ్రద్ధగా కాపాడుతూ ఉంటావు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=160

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Saturday, June 24, 2017

దక్ష యాగము - 71:

4-157-క.
విను దక్షు నంత మేషము
ఖునిఁ జేసిన నిద్ర మేలుకొని లేచిన పో
ల్కిని నిలిచె దక్షుఁ, డభవుఁడు
కనుఁగొనుచుండంగ నాత్మఁ గౌతుక మొప్పన్.
4-158-వ.
ఇట్లు లేచి నిలిచి ముందఱ నున్న శివునిం గనుంగొనిన మాత్రన శరత్కాలంబున నకల్మషంబైన సరస్సునుంబోలెఁ బూర్వరుద్రవిద్వేష జనితంబు లైన కల్మషంబులం బాసి నిర్మలుండై యభవుని నుతియింపం దొడంగి మృతిఁ బొందిన సతీ తనయం దలంచి యనురా గోత్కంఠ బాష్పపూరిత లోచనుండును, గద్గదకంఠుండునునై పలుకం జాలక యెట్టకేలకు దుఃఖంబు సంస్తంభించుకొని ప్రేమాతిరేక విహ్వలుం డగుచు సర్వేశ్వరుం డగు హరున కిట్లనియె.

టీకా:
విను = వినుము; దక్షున్ = దక్షుని; అంత = అప్పుడు; మేష = గొర్రె; ముఖునిన్ = తల కలవానిగ; చేసినన్ = చేయగా; నిద్రన్ = నిద్రనుండి; మేలుకొని = మేల్కొని; లేచిన = లేచిన; పోల్కిని = విధముగ; నిలిచెన్ = నిలబడెను; దక్షుడు = దక్షుడు; అభవుడు = బ్రహ్మదేవుడు; కనుగొనుచుండగన్ = చూస్తుండగా; ఆత్మన్ = మనసున; కౌతుకము = కుతూహలము; ఒప్పన్ = ఒప్పగ. ఇట్లు = ఈవిధముగ; లేచి = లేచి; నిలిచి = నిలబడి; ముందఱ = ఎదుట; ఉన్న = ఉన్నట్టి; శివునిన్ = శివుని; కనుగొనిన = చూసి; మాత్రన = మాత్రముచేతనే; శరత్కాలంబునన్ = శరత్కాలమునందు; అకల్మషంబున్ = నిర్మలము; ఐన = అయిన; సరస్సునున్ = సరోవరము; పోలెన్ = వలె; పూర్వ = పాతకాలపు; రుద్ర = శివ; విద్వేష = ద్వేషించుటచేత; జనితంబులు = పుట్టినవి; ఐన = అయిన; కల్మషంబులన్ = దోషములను; పాసి = తొలగి; నిర్మలుండు = అమలినుడు; ఐ = అయ్యి; అభవుని = శివుని; నుతియింపన్ = స్తోత్రముచేయ; తొడగి = మొదలెట్టి; మృతి = మరణము; పొందిన = పొందిన; సతీ = సతి అనెడి; తనయన్ = పుత్రికను; తలంచి = తలచుకొని; అనురాగ = ప్రేమ; ఉత్కంఠలన్ = వేగిరిపాటులవలన; బాష్ప = కన్నీటితో; పూరిత = నిండిన; లోచనుండును = కన్నులు కలవాడును; గద్గద = గద్గదమైన; కంఠుండును = కంఠముకలవాడును; ఐ = అయ్యి; పలుకన్ = పలుక; చాలక = లేక; ఎట్టకేలకు = ఆఖరికి; దుఃఖంబున్ = దుఃఖమును; సంస్తంభించుకొని = చక్కగ ఆపుకొని; ప్రేమా = ప్రేమ; అతిరేక = అతిశయముచే; విహ్వలుడు = విహ్వలుడు; అగచున్ = అవుతూ; సర్వేశ్వరుండు = సమస్తమునకు ప్రభువు; అగు = అయిన; హరున్ = శివుని; కిన్ = కి; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.

భావము:
విదురా! విను. శివుడు దక్షుని గొఱ్ఱెతల కలవానిగా చేసి చూస్తుండగా అతడు నిద్రనుండి మేలుకొన్న విధంగా సంతోషంగా లేచాడు. అలా లేచి నిలిచిన దక్షుడు శివుని చూచినంత మాత్రాన శరత్కాలంలో బురద లేని సరస్సు వలె పూర్వం రుద్రుని ద్వేషించడం వలన కలిగిన దోషాలను పోగొట్టుకొని నిర్మలుడై ఆ శివుణ్ణి స్తుతించాలకున్నాడు. కాని మరణించిన తన కూతురును తలచుకొని ప్రేమతో, తహతహపాటుతో కన్నులలో నీరు నిండగా, డగ్గుత్తిక పడిన కంఠంతో మాట్లాడలేక, ఎట్టకేలకు దుఃఖాన్ని దిగమ్రింగుకొని ప్రేమాతిరేకంతో ఒడలు మరచి ఆ శివునితో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=157

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Friday, June 23, 2017

దక్ష యాగము - 70:

4-155-వ.
అని "దగ్దశీర్షుం డయిన దక్షుం డజముఖుం డగు; భగుండు బర్హి స్సంబంధ భాగంబులు గలిగి మిత్రనామధేయ చక్షుస్సునం బొడగాంచు; పూషుండు పిష్టభుక్కగుచు యజమాన దంతంబులచే భక్షించు; దేవతలు యజ్ఞావశిష్టంబు నాకొసగుటంజేసి సర్వావయవ పూర్ణులై వర్తింతురు; ఖండితాంగులైన ఋత్విగాది జనంబు లశ్వనీదేవతల బాహువులచేతను బూషుని హస్తంబులచేతను లబ్దబాహు హస్తులై జీవింతురు; భృగువు బస్తశ్మశ్రువులు గలిగి వర్తించు;" అని శివుండా నతిచ్చిన సమస్తభూతంబులును సంతుష్టాంతరంగంబులై “తండ్రీ లెస్సయ్యె” నని సాధువాదంబుల నభినందించిరి: అంతనా శంభుని యామంత్రణంబు వడసి సునాసీర ప్రముఖులగు దేవతలు ఋషులతోడం గూడి రా నజుండును రుద్రునిం బురస్కరించుకొని దక్షాధ్వర వాటంబుకుం జనియె; అంత.
4-156-క.
శర్వుని యోగక్రమమున
సర్వావయవములుఁ గలిగి సన్ముని ఋత్వి
గ్గీర్వాణముఖ్య లొప్పిరి
పూర్వతనుశ్రీల నార్యభూషణ! యంతన్.

టీకా:
అని = అని; దగ్ధ = కాలిపోయిన; శీర్షుండు = తల కలవాడు; అయిన = అయిన; దక్షుండు = దక్షుడు; అజ = గొర్రె; ముఖుండు = గొర్రెతల కలవాడు; అగు = అగును; భగుండు = భగుడు; బర్హి = దర్భలకి; సంబంధ = సంబంధించిన; భాగములు = భాగములు; కలిగి = పొంది; మిత్ర = మిత్ర అనెడి; నామధేయ = పేరుగల; చక్షుస్సునన్ = చక్షుస్సులో; పొడగాంచు = పొందును; పూషుండు = పూషుడు; పిష్టభుక్కు = పిండములను తినువాడు; అగుచున్ = అవుతూ; యజమాన = యజమానియొక్క; దంతంబులున్ = దంతములు; చేన్ = చేత; భక్షించు = తినును; దేవతలు = దేవతలు; యజ్ఞ = యజ్ఞము యొక్క; అవశిష్టంబు = మిగిలిన భాగము; నాకున్ = నాకు; ఒసగుటన్ = ఇచ్చుట; చేసి = వలన; సర్వ = సమస్తమైన; అవయవ = అవయవములు; పూర్ణులు = నిండుగ ఉన్నవారు; ఐ = అయ్యి; వర్తింతురు = నడచెదరు; ఖండితాంగులు = విరిగిన అవయవములు కలవారు; ఐన = అయిన; ఋత్విక్ = ఋత్విక్కులు; ఆది = మొదలైన; జనంబులు = వారు; అశ్వనీదేవతల = అశ్వనీదేవతల; బాహువుల = చేతుల; చేతను = చేతను; పూషుని = పూషుని; హస్తంబుల = అరిచేతుల; చేతను = చేతను; లబ్ద = పొందిన; బాహుహస్తులు = బాహుహస్తములు కలవారు; ఐ = అయ్యి; జీవింతురు = జీవించెదరు; భృగువు = భృగువు; బస్త = మేక; శ్మశ్రువులు = మీసములు; కలిగి = పొంది; వర్తించు = నడచును; అని = అని; శివుండు = శివుడు; ఆనతిచ్చిన = అనుగ్రహించగ; సమస్త = సమస్తమైన; భూతంబులును = జీవులును; సంతుష్టాంతరంగులు = సంతుష్టి చెందిన మనసులు కలవారు; ఐ = అయ్యి; తండ్రీ = అయ్యా; లెస్స = సరిగ; అయ్యెన్ = అయినది; అని = అని; సాధువాదంబులన్ = మంచిది మంచిది అనెడి పలుకులతో; అభినందించిరి = అభినందించిరి; అంతన్ = అంతట; ఆ = ఆ; శంభుని = శివుని; ఆమంత్రణంబు = అనుమతి; పడసి = పొంది; సునాసీర = ఇంద్రుడు; ప్రముఖులు = మొదలగు ముఖ్యులు; అగు = అయిన; దేవతలు = దేవతలు; ఋషులన్ = ఋషులను; తోడన్ = తోటి; కూడి = కలిసి; రాన్ = రాగా; అజుండును = బ్రహ్మదేవుడును; రుద్రునిన్ = శివుని; పురస్కరించుకొని = ముందిడుకొని; దక్ష = దక్షుని; అధ్వర = యజ్ఞము యొక్క; వాటంబు = వాటిక; కున్ = కి; చనియె = వెళ్ళెను; అంత = అప్పుడు. శర్వు = శివుని; నియోగ = నియమించిన; క్రమమున = ప్రకారము; సర్వ = సమస్తమైన; అవయవములున్ = అవయవములును; కలిగి = పొంది; సత్ = మంచి; ముని = మునులు; ఋత్విక్ = ఋత్విక్కులు; గీర్వాణ = దేవతల; ముఖ్యులు = ప్రముఖులు; ఒప్పిరి = చక్కగ ఉండిరి; పూర్వ = పూర్వపు; తను = దేహ; శ్రీలన్ = సంపదలతో; ఆర్యభూషణా = గొప్పవారిచే మన్నిపబడేవాడ; అంతన్ = అంతట.

భావము:
అని చెప్పి “శిరస్సు దహింపబడిన దక్షుడు గొర్రెముఖం కలవాడు అవుతాడు. భగుడు దర్భలతో సంబంధించిన యజ్ఞభాగాన్ని పొంది మిత్రనామకమైన నేత్రాలతో చూస్తాడు. పూషుడు పిండి పదార్థాలను యజమాని దంతాల ద్వారా భుజిస్తాడు. దేవతలు యజ్ఞశేషాన్ని నాకు సమర్పించడం వల్ల మునుపటి వలె అన్ని అవయవాలు కలిగి సంచరిస్తారు. అవయవాలు ఖండింపబడిన ఋత్విక్కులు మొదలైనవారు అశ్వినీ దేవతల బాహువుల చేతను, పూషుని హస్తాల చేతను తమ తమ బాహువులను, హస్తాలను పొంది బ్రతుకుతారు. భృగువు చింబోతు మీసాలు, గడ్డాము పొందుతాడు” అని శివుడు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు సమస్త ప్రాణులు సంతోషించి “తండ్రీ! బాగు బాగు” అని మెచ్చుకున్నారు. అప్పుడు ఆ శివుని దగ్గర సెలవు తీసుకొని ఇంద్రుడు మొదలైన దేవతలు ఋషులతో కూడి బయలుదేరారు. బ్రహ్మదేవుడు శివుణ్ణి ముందుంచుకొని దక్షయజ్ఞం జరిగిన ప్రదేశానికి వెళ్ళాడు. అప్పుడు…. శివుని ఆజ్ఞానుసారంగా మునులు, ఋత్విక్కులు, దేవతలు మొదలైన వారంతా తమ తమ పూర్వశరీరాలను పొంది చక్కగా ప్రకాశించారు. అప్పుడు…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=156

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Thursday, June 22, 2017

దక్ష యాగము - 69:

4-153-వ.
అట్లయ్యును.
4-154-క.
బలియుర దండించుట దు
ర్భలజన రక్షణము ధర్మపద్ధతి యగుటం
గలుషాత్ముల నపరాధము
కొలఁదిని దండించుచుందుఁ గొనకొని యేనున్."

టీకా:
అట్లు = ఆవిధముగ; అయ్యును = అయినప్పటికిని. బలియురన్ = బలవంతులను; దండించుట = దండించుట; దుర్భల = దుర్భలులు అయిన; జన = వారిని; రక్షణము = రక్షించుట; ధర్మ = ధర్మబద్ధమైన; పద్ధతి = విధానము; అగుటన్ = అవుటచేత; కలుషాత్ములన్ = దుష్టులను; అపరాధము = తప్పుల; = కొలదిని = ప్రకారము; దండించుచున్ = దండిస్తూ; ఉందున్ = ఉంటాను; కొనకొని = పూనుకొని; ఏనున్ = నేను.

భావము:
అయినా… బలవంతులను శిక్షించడం, దుర్బలులను రక్షించడం ధర్మమార్గం కనుక నేను దుష్టులను వారు చేసిన దోషాలకు తగినట్లుగా శిక్షిస్తూ ఉంటాను.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=154

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::