11-12-సీ.
ఘనుని శ్రీకృష్ణునిఁ గౌస్తుభాభరణునిఁ,-
గర్ణకుండలయుగ్మఘనకపోలుఁ,
బుండరీకాక్షు నంభోధరశ్యామునిఁ,-
గలిత నానారత్న ఘన కిరీటు,
నాజానుబాహు నిరర్గళాయుధహస్తు,-
శ్రీకరపీతకౌశేయవాసు,
రుక్మిణీనయన సరోజ దివాకరు,-
బ్రహ్మాదిసుర సేవ్యపాదపద్ము ,
11-12.1-తే.
దుష్టనిగ్రహ శిష్టసంతోషకరణుఁ,
గోటిమన్మథలావణ్యకోమలాంగు,
నార్తజనరక్షణైకవిఖ్యాతచరితుఁ,
గనిరి కరుణాసముద్రుని ఘనులు మునులు.
11-13-క.
వచ్చిన మునిసంఘములకు
విచ్చలవిడి నర్ఘ్యపాద్యవిధు లొనరింపన్
మెచ్చగు కనకాసనముల
నచ్చుగఁ గూర్చుండి వనరుహాక్షునితోడన్.
భావము:
మహాత్ముడు; కౌస్తుభమణి సంశోభితుడు; ఘనమైన చెంపలపై కర్ణ కుండలాల కాంతులు ప్రకాశించు వాడు; తెల్లతామరల వంటి కన్నుల వాడు; మేఘం వంటి నల్లని దేహఛాయ వాడు; బహురత్నాలు పొదిగిన కిరీటం వాడు; తిరుగులేని చక్రాది ఆయుధాలు చేబట్టు వాడు; శ్రీకరమైన పచ్చని పట్టువస్త్రం కట్టుకొను వాడు; రుక్మిణీదేవి నయన పద్మాలకు సూర్యుని వంటి వాడు; బ్రహ్మ మున్నగు దేవతలచేత సేవింపదగిన చరణకమలాలు కలవాడు; దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించు వాడు; కోటిమంది మన్మథుల లావణ్యం పుణికిపుచ్చుకున్న కోమల శరీరి; ఆర్తులైన వారిని రక్షించటంలో ప్రసిద్ధ చరిత్రుడు; దయకు సముద్రం వంటి వాడు; ఆజానుబాహువు అయిన శ్రీకృష్ణుడిని ఆ ఘనులైన మునులు దర్శించారు. అలా వచ్చిన శ్రీకృష్ణుడు మునులకు ఆర్ఘ్యం పాద్యం మొదలైన మర్యాదలు విస్తృతంగా చేసాడు. అటుపిమ్మట వారు మేలిమి బంగారు ఆసనాల మీద ఆసీనులై పద్మనేత్రుడైన కృష్ణుడితో ఇలా అన్నారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=12
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment