11-38-తే.
అర్ఘ్యపాద్యాదివిధులను నర్థితోడఁ
బూజ గావించి, వారలఁ బొలుపు మిగుల
నుచితపీఠంబులందును నునిచి, యెలమి
నవమునిశ్రేష్ఠులను భూమినాయకుండు.
11-39-క.
వారల కిట్లను "మీరలు
గారవమున విష్ణుమూర్తిఁ గైకొనిన మహా
భూరితపోధనవర్యులు
సారవిహీనంబు లైన సంసారములన్.
11-40-క.
ఏ రీతి గడప నేర్తురు?
క్రూరులు బహుదుఃఖరోగకుత్సిత బుద్ధుల్
నీరసులు నరులు గావున
నారయ సుజ్ఞానబుద్ధి నానతి యీరే?
భావము:
అర్ఘ్యం పాద్యం మొదలైన శాస్త్రవిధులతో ప్ఱ్ఱార్థనా పూర్వకంగా పూజించి ఆ విదేహ మహారాజు ఆ తొమ్మిది మంది మునివరులను సముచిత పీఠాలపై కూర్చుండ బెట్టాడు. అలా ఆసీనులైనవారితో విదేహరాజు ఇలా అన్నాడు. “మీరు విష్ణుమూర్తిని ఎంతో భక్తిశ్రద్ధలతో భజించే గొప్ప తపోనిధులు. ఈ సంసారాలు పరమ సారం లేనివి. క్రూరులు; అనేక రకాల దుఃఖాలు, రోగాలు, అల్ప బుద్ధులు కలవారు; నీరసులు అయిన మానవులకు ఈ సారహీనమైన సంసారాలను దాటటానికి ఏదైనా మార్గం ఏదో సుఙ్ఞాన పూరకమైన మీ బుద్ధి కుశలతతో చెప్పండి.
http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=6&Padyam=40
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :