Thursday, August 27, 2020

శ్రీ కృష్ణ విజయము - 17


( అక్రూరుడు వ్రేపల్లెకు వచ్చుట )

10.1-1193-మ.
ఇతఁడా కంసునిచేతఁ బంపువడి నన్ హింసింప నేతెంచినాఁ
డతిదుష్టుం డని చూచునో? సకలభూతాంతర్బహిర్మధ్య సం
గతుఁ డౌటం దలపోసి నన్ను సుజనుంగాఁ జూచునో? యెట్టి యు
న్నతిఁ గావించునొ? యే క్రియం బలుకునో? నా భాగ్య మెట్లున్నదో?"
10.1-1194-వ.
అని మఱియును.
10.1-1195-మ.
"అలకభ్రాజితమై సుధాంశునిభమై హాసప్రభోద్దామమై
జలజాక్షంబయి కర్ణకుండల విరాజద్గండమై యున్న యా
జలజాతాక్షు ముఖంబు చూడఁగలుగున్ సత్యంబుపో నాకు నా
వలది క్కేగుచు నున్న వీ వనమృగ వ్రాతంబు లీ త్రోవలన్.

భావము:
“ఈ అక్రూరుడు ఆ కంసుడు పంపుతే, నన్ను హింసించడానికి వచ్చిన పరమ దుర్మార్గు” డని శ్రీకృష్ణుడు నన్ను అనుమానిస్తాడో? నిఖిల ప్రాణుల లోపల వెలుపల రెండూ కానిది అందు మిక్కిలి వ్యాపించి ఉండేవాడు కనుక, ఆలోచించి అభిమానిస్తాడో? నన్ను ఎలా గౌరవిస్తాడో? నాతో ఏవిధంగా మాట్లాడతాడో? ఇంతకీ నా అదృష్టం ఎలా ఉందో ఏమిటో?”. ఈ విధంగా తలపోస్తూ ఇంకా ఇలా అనుకోసాగాడు. “పద్మాక్షుడైన శ్రీకృష్ణుడి ముఖము ముంగురులతో ముచ్చటగా ప్రకాశిస్తుంటుంది, చంద్రుడితో సరిపోలుతూ ఉంటుంది, నవ్వుల నిగ్గులతో నివ్వటిల్లుతూ ఉంటుంది. కమలదళాల వంటి కన్నులు, చెవులకమ్మల కాంతులతో అందగించే చెక్కిళ్ళు కలిగి ఉంటుంది. అటువంటి మోము దర్శించబోతున్నా. ఇది తథ్యం. ఇదిగో ఈ దారులమ్మట నేను ప్రయాణిస్తుంటే అడవిమృగాలు నాకు కుడిపక్కగా వెళ్తూ శుభాన్ని సూచిస్తున్నాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=136&padyam=1195

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 16

( అక్రూరుడు వ్రేపల్లెకు వచ్చుట )

10.1-1190-వ.
అంత నా రాత్రి మథురానగరంబున నక్రూరుండు వసియించి నియతుండయి మరునాడు రేపకడ లేచి నిత్యకృత్యంబు లాచరించి రథంబెక్కి కదలి నందగోకులంబునకుం బోవుచుం దెరువునం దనలో నిట్లనియె.
10.1-1191-ఉ.
"ఎట్టి తపంబుఁ జేయఁబడె? నెట్టి చరిత్రము లబ్ధమయ్యెనో?
యెట్టి ధనంబు లర్హులకు నీఁబడెనో తొలిబామునందు; నా
యట్టి వివేకహీనునకు నాదిమునీంద్రులు యోగదృష్టులం
బట్టఁగలేని యీశ్వరుని బ్రహ్మమయున్ హరిఁ జూడఁగల్గెడిన్.
10.1-1192-ఉ.
సూరులు దొల్లి యే విభుని శోభిత పాదనఖ ప్రభావళిం
జేరి భవాంధకారములఁ జిక్కక దాఁటుదు రట్టి దేవునిన్
వైరముతోడనైనఁ బిలువన్ ననుఁ బంచి శుభంబుఁ జేసె ని
ష్కారణ ప్రేమతోడ; నిదె కంసునిఁ బోలు సఖుండు గల్గునే.

భావము:
అక్కడ ఆక్రూరుడు ఆవేళ రాత్రికి మథురలో ఉండి, మరునాటి తెల్లవారకట్ల లేచి నిత్యకర్మానుష్ఠానములు తీర్చుకుని రథమెక్కి నందుడి గోకులానికి పయనమై వెళ్ళుతూ, దారిలో ఇలా అనుకున్నాడు. “పూర్వజన్మలలో నేను ఎంతటి తపస్సు చేసానో! ఏమి గొప్ప పనులు చేసానో! ఎంత గొప్ప దానములు అర్హమైన వారికి చేసానో! ఆర్యులైన పరమ యోగుల యోగ దృష్టికి కూడ అందని భగవంతుడు, బ్రహ్మస్వరూపుడు అయిన శ్రీకృష్ణుడిని చూడబోతున్నాను. పరమ విజ్ఞులు అయిన వారు ముందు ఏ దేవదేవుడి కాలిగోళ్ళ కాంతిపుంజాలను ఆశ్రయించి జననమరణాలనే చీకట్లలో చిక్కుకొనక తరిస్తారో! అటువంటి భగవంతుడైన కృష్ణుడిని వైరబుద్ధితో జయించడం కోసం అయినా పిలుచుకు రమ్మని నిష్కారణ ప్రేమతో నన్ను పంపి కంసుడు నాకెంతో మేలు చేసాడు. అతని వంటి చెలికాడు మరొకడు ఎక్కడా దొరకడు కదా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=136&padyam=1192

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Wednesday, August 26, 2020

శ్రీ కృష్ణ విజయము - 15

( వ్యోమాసురుని సంహారించుట )

10.1-1186-వ.
ఇట్లు కొండగుహలోనఁ గ్రమక్రమంబున గోపకుమారుల నిడి యొక్క పెనుఱాతఁ దద్ద్వారంబుఁ గప్పి యెప్పటియట్ల వచ్చిన.
10.1-1187-ఉ.
వీరుఁడు మాధవుం డఖిలవేది నిశాచరభేది నవ్వుతో
"నౌర! నిశాట! దొంగతన మచ్చుపడెన్ నెఱదొంగ వౌదు; వా
భీరుల నెల్ల శైలగుహఁ బెట్టితి చిక్కినవారిఁ బెట్టరా;
రార" యటంచుఁ బట్టె మృగరాజు వృకాఖ్యముఁ బట్టు కైవడిన్.
10.1-1188-ఉ.
పంకజలోచనుం డొడిసి పట్టిన శైలనిభాసురాకృతిన్
బింకముతోడఁ బొంగి విడిపించుకొనంగ బలంబు లేమి లో
శంకిలి బిట్టు తన్నుకొనఁ జక్కన నా రణభీము వ్యోమునిం
గొంకకఁ గూల్చె న వ్విభుఁడు గోయని మింట సుపర్వు లార్వఁగన్.
10.1-1189-ఆ.
ఘోర దనుజు నేల గూల్చి పర్వతగుహ
వాత నున్న ఱాయి వ్రయ్యఁ దన్ని
గుహఁ జరించుచున్న గోపాలకులఁ గొంచు
బల్లిదుండు గోపపల్లి కరిగె.

భావము:
వాడు క్రమక్రమంగా గోపబాలురను ఆ కొండ గుహలో చేర్చి పెద్దబండరాయితో దారి మూసేసి, మునుపటి లాగే అక్కడి ఆటలోకి వచ్చిచేరాడు. సర్వజ్ఞుడూ, గర్వాంధులైన దానవులను రూపుమాపే వాడూ, మహావీరుడూ, అయిన కృష్ణ మాధవుడు నవ్వుతూ “ఓరోరీ! రాక్షసా! నీ గుట్టు బట్టబయలైంది. నీవు గడిదేరిన గజదొంగవి. గొల్లపిల్లలను అందరినీ కొండగుహలో దాచిపెట్టావు. మిగతావాళ్ళని కూడా దాచేద్దువుగాని. రారా” అంటూ సింహము తోడేలును పట్టుకున్నట్లు వాడిని ఒడిసి పట్టుకున్నాడు. పద్మాల వంటి కన్నులు కల కృష్ణుడు గట్టిగా పట్టుకోగానే వాడు గొల్లరూపం వదిలిపెట్టేసాడు. కొండంత రాక్షసాకారంతో ఉప్పొంగాడు. కాని, విడిపించుకునే శక్తి లేకపోడంతో లోలోపల సందేహిస్తూనే, గిజ గిజ గింజుకున్నాడు. అప్పుడు గోవిందుడు గొప్ప యుద్ధవీరుడు అయిన ఆ వ్యోముడిని జంకుగొంకు లేకుండా నేలకూల్చాడు. అప్పుడు ఆకాశం నుండి దేవతలు “ఓహో” అని హర్షధ్వానాలు చేసారు. బలవంతుడైన కృష్ణుడు భయంకరుడైన దైత్యుడిని నేలగూల్చి, పర్వతగుహ ద్వారమును మూసి ఉంచిన రాతిని బద్దలుగొట్టాడు. గుహలో తిరుగాడుతున్న ఆ గొల్లపిల్లలను వెంటపెట్టుకుని గొల్లపల్లెకు వెళ్ళిపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=135&padyam=1189

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 14

( వ్యోమాసురుని సంహారించుట )

10.1-1183-వ.
అని వినుతించి వీడుకొని నారదుం డరిగె; నంత నొక్కనాడు కృష్ణ సహితులై గోపకుమారు లడవికిం జని పసుల మేపుచు నొక్క కొండదండ నిలాయనక్రీడ చేసి; రందు.
10.1-1184-క.
కొందఱు గొఱియల మంచునుఁ
గొందఱు పాలకుల మంచుఁ గుటిలత్వమునం
గొందఱు దొంగల మనుచునుఁ
జెంది కుమారకులు క్రీడఁజేసిరి తమలోన్.
10.1-1185-శా.
ఆలో దొంగలలో మయాసురసుతుం డాద్యుండు వ్యోముండు గో
పాలుండై చని మేషకల్పనలతో భాసిల్లి క్రీడించు త
ద్బాల వ్రాతము నెల్ల మెల్లనఁ జతుఃపంచావశిష్టంబుగా
శైలాంతర్గుహలోనికిం గొనిచనెం జౌర్యం బవార్యంబుగన్.

భావము:
అలా గోవిందుడిని స్తుతించి, సెలవు తీసుకుని నారదమహర్షి వెళ్ళిపోయాడు. అటు పిమ్మట, ఒక రోజు గోపబాలురు కృష్ణుడితో కలిసి అడవికి వెళ్ళారు. అక్కడ పశులను మేపుతూ ఒక పర్వతం దగ్గర దాగుడుమూతలు ఆడటం ప్రారంభించారు. ఆ దాగుడుమూతలాటలో కొందరు గొఱ్ఱెలుగా కొందరు కాపరులుగా కొందరు దొంగలుగా ఏర్పడి గోపబాలురు తమలో తాము ఆడుకోసాగారు. అంతలో మయుడనే రాక్షసుడి పెద్ద కొడుకు వ్యోమాసురుడు గొల్లపిల్లాడి రూపం ధరించి, దొంగగా ఏర్పడిన వారిలో చేరాడు. వాడు అడ్డులేని దొంగతనంతో ఆ ఆటలో గొఱ్ఱెలుగా నటిస్తున్న గొల్లపిల్లలలో నలుగురు ఐదుగురిని తప్పించి మిగిలిన వారిని అందరినీ మెల్లగా ఒక పర్వతగుహలోకి తీసుకుపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=135&padyam=1185

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, August 25, 2020

శ్రీ కృష్ణ విజయము - 13

( నారదుడు కృష్ణుని దర్శించుట )

10.1-1181-వ.
దేవా! నీచేత నింక చాణూర ముష్టిక గజ శంఖ కంస యవన ముర నరక పౌండ్రక శిశుపాల దంతవక్త్ర సాల్వ ప్రముఖులు మడిసెదరు; పారిజాతం బపహృతం బయ్యెడిని; నృగుండు శాపవిముక్తుం డగు; శ్యమంతకమణి సంగ్రహంబగు; మృత బ్రాహ్మణపుత్ర ప్రదానంబు సిద్ధించు; నర్జునసారథివై యనేకాక్షౌహిణీ బలంబుల వధియించెదవు; మఱియును.
10.1-1182-శా.
కృష్ణా! నీ వొనరించు కార్యములు లెక్కింపన్ సమర్థుండె? వ
ర్ధిష్ణుండైన విధాత మూఁడుగుణముల్ దీపించు లోపించు రో
చిష్ణుత్వంబున నుండు నీవలన; నిస్సీమంబు నీ రూపు నిన్
విష్ణున్ జిష్ణు సహిష్ణు నీశు నమితున్ విశ్వేశ్వరున్ మ్రొక్కెదన్."

భావము:
ఓ ప్రభూ! ఇంక ముందు చాణూరుడు, ముష్టికుడు, గజుడు, శంఖుడు, కంసుడు, కాలయవనుడు, మురుడు, నరకుడు, పౌండ్రకుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు సాల్వుడు మొదలైనవారు నీ చేతిలో మరణిస్తారు. దేవలోకం నుంచి పారిజాతవృక్షం సంగ్రహించబడుతుంది. నృగునకు శాపవిముక్తి కలుగుతుంది. శమంతకమణి లభిస్తుంది. మృతులైన బ్రాహ్మణ కుమారులను తిరిగి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. అర్జునుడికి సారథివిగా ఉండి అనేక అక్షౌహిణుల సేనలు సంహరిస్తావు. అంతేకాకుండా ఓ కృష్ణా! సృష్టిని సమృద్దిగా చేసే బ్రహ్మదేవుడు కూడా నీవు చేసే పనులను లెక్కించడానికి సమర్ధుడు కాడు. నీ వలననే సత్త్వరజస్తమోగుణములు జనించి, వృద్ధిపొంది, అణగిపోతాయి. నీ రూపమునకు మేర లేదు. నీవు సర్వవ్యాపివి, జయ శీలుడవు, సహన శీలివి, పరమేశ్వరుడవు, ప్రమాణ రహితుడవు, ప్రపంచ నియామకుడవు. అటువంటి నీకు నమస్కరిస్తాను.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=134&padyam=1182

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, August 20, 2020

శ్రీ కృష్ణ విజయము - 12

( నారదుడు కృష్ణుని దర్శించుట )
10.1-1179-వ.
ఆ సమయంబునం బుష్పవర్షంబులు గురియించి సురలు వినుతించి; రంత హరిభక్తి విశారదుండైన నారదుండు వచ్చి గోవిందుని సందర్శించి రహస్యంబున నిట్లనియె.
10.1-1180-సీ.
“జగదీశ! యోగీశ! సర్వభూతాధార!$
  సకలసంపూర్ణ! యీశ్వర! మహాత్మ!
కాష్ఠగతజ్యోతి కైవడి నిఖిల భూ$
  తము లందు నొకఁడవై తనరు దీవు
సద్గూఢుఁడవు; గుహాశయుఁడవు సాక్షివి$
  నీ యంతవాఁడవై నీవు మాయఁ
గూడి కల్పింతువు గుణముల; వానిచేఁ$
  బుట్టించి రక్షించి పొలియఁజేయుఁ
10.1-1180.1-ఆ.
దీ ప్రపంచ మెల్ల నిట్టి నీ విప్పుడు
రాజమూర్తులైన రాక్షసులను
సంహరించి భూమిచక్రంబు రక్షింప
నవతరించినాఁడ వయ్య! కృష్ణ!

భావము:
ఆ సంతోష సమయంలో దేవతలు పూలవానలు కురిపించారు. స్తోత్రాలు చేసారు. అంతలో విష్ణుభక్తి విశారదుడైన నారదుడు వచ్చి, గోపాలకృష్ణుడిని దర్శించి ఏకాంతంగా ఇలా అన్నాడు. “కృష్ణా! జగదీశ్వరా! యోగీశ్వరా! సకల ప్రాణులకు ఆధారమైన వాడా! నిఖిలమునందూ నిండి ఉండువాడా! ఓ మహానుభావా! కట్టెలలో అగ్నిలా సమస్త ప్రాణులలోనూ ఏకరూపుడవై విలసిల్లుతూ ఉంటావు. హృదయ కుహర మందు గూఢంగా ఉంటావు. జీవులు ఆచరించే సకల క్రియాకలాపములకు కేవలం సాక్షీభూతుడవై ఉంటావు. సర్వస్వతంత్రుడవు. నీకు అధీనమై ఉండే మాయాశక్తిచే సత్వ్తరజస్తమో గుణాలను కల్పిస్తుంటావు. ఈ త్రిగుణాలచేత జగత్తును సృష్టి స్థితి లయాలు చేస్తుంటావు. రాజుల రూపాలలో ఉన్న రాక్షసులను నిర్మూలించి భూమండలాన్ని కాపాడడటం కోసం నీవు అవతరించావు స్వామీ.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=134&padyam=1180

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 11

( కేశిని సంహారము )

10.1-1175-శా.
దంభోళిప్రతిమాన కర్కశ మహోద్యద్వామ దోఃస్తంభమున్
శుంభల్లీల నఘారి వాని రదముల్ చూర్ణంబులై రాలఁగా
గంభీరంబుగఁ గుక్షిలోఁ జొనిపి వీఁకన్ వృద్ధిఁ బొందించుచున్
గుంభించెం బవనంబు పిక్కటిలఁ దత్కుక్షిన్ నరేంద్రోత్తమా!
10.1-1176-క.
వాయువు వెడలక నిలిచినఁ
గాయంబు చెమర్పఁ గన్నుఁగవ వెలి కుఱుకన్
మాయచెడి తన్నుకొనుచును
గూయుచు నశ్వాసురుండు గూలెన్ నేలన్.
10.1-1177-ఆ.
ఘోటకాసురేంద్రు కుక్షిలోఁ గృష్ణుని
బాహు వధికమైనఁ బట్టలేమిఁ
బగిలి దోసపండు పగిదిఁ దద్దేహంబు
వసుమతీశ రెండు వ్రయ్య లయ్యె.
10.1-1178-క.
నళినాక్షుఁడు లీలాగతి
విలయముఁ బొందించె నిట్లు వీరావేశిన్
బలలాశిన్ జగదభినవ
బలరాశిన్ విజితశక్రపాశిం గేశిన్.

భావము:
పరీక్షన్మహారాజా! అఘాసురుడిని హరించిన హరి వజ్రాయుధం వలె కఠినమైనది, స్తంభంవలె ఉన్నది అయిన తన ఎడమ చేతిని, ఆ తురగ దైత్యుడి దంతాలు పొడి పొడి అయి రాలిపోయేలాగ, అవలీలగా వాడి కడుపులోనికి జొప్పించాడు. వాడి కడుపు ఉబ్బిపోయేలాగ తన చేతిని అంతకంతకూ పెంచుతూ, వాడి ఊపిరి ఉక్కిరిబిక్కిరి అయ్యేలా నిరోధించాడు. ఆ కేశి దానవుడికి ఒంట్లోని గాలి బయటకి పోకపోడంతో ఒళ్ళంతా చెమట పట్టింది. కనుగుడ్లు వెలికి వచ్చాయి. తన మాయలు పనిచేయకపోడంతో వాడు విలవిలా తన్నుకుంటూ పెడబొబ్బలు పెడుతూ నేల మీదకి కూలిపోయాడు. ఓ దేశాధీశా! పరీక్షిత్తూ! తురగాసురుడి పొట్టలో కృష్ణుడి చెయ్యి బాగా ఎక్కువగా పెరిగి పోడంతో, పట్టుటకు చోటులేక వాడి దేహం దోసపండులా రెండు ముక్కలు అయిపోయింది. వీరావేశం కలవాడూ, మాంసాహారుడూ, లోకంలో నవనవీన శక్తియుక్తుడూ, ఇంద్ర వరుణులను జయించిన వాడూ అయిన కేశిని దానవుడిని తామరరేకుల వంటి కన్నుల కల కృష్ణుడు అలవోకగా అంతమొందించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=133&padyam=1178

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Sunday, August 16, 2020

శ్రీ కృష్ణ విజయము - 10

( కేశిని సంహారము )

10.1-1172-ఆ.
నిష్ఠురోగ్ర సింహ నినదంబుతో నింగి
మ్రింగుభంగి నోరు మిగులఁ దెఱచి
కఱవరాఁగ నతఁడు గాటు దప్పించినఁ
దన్నె నెగసి తురగదానవుండు.
10.1-1173-ఉ.
తన్నిన తన్నునం బడక దానవహంత సమీకరంతయై
కన్నులఁ గెంపు పెంపెనయ గ్రక్కున ఘోటనిశాటు పాదముల్
వన్నె చెడంగఁ బట్టి పడవైచె ధనుశ్శతమాత్రదూరమున్
పన్నగడింభమున్ విసరి పాఱఁగవైచు ఖగేంద్రు కైవడిన్.
10.1-1174-ఉ.
వైచిన మ్రొగ్గి లేచి వెస వాజినిశాటుఁడు హుంకరించి సం
కోచము లేక పైఁ బడిన గోపకులేంద్రుఁడు దిగ్గజేంద్ర శుం
డాచటుల ప్రభాబల విడంబకమైన భుజార్గళంబు దో
షాచరు నోటిలోన నిడెఁ జండఫణిన్ గుహ నుంచుకైవడిన్.

భావము:
ఆ అశ్వరూప రాక్షసుడు కర్కశంగా గట్టిగా సకిలిస్తూ, ఆకాశాన్నే మ్రింగబోతున్నట్లు నోరు పెద్దగా తెరచి, కరవడానికి వచ్చాడు; కృష్ణుడు ఆ పోటు తప్పించుకున్నాడు; వాడు ఎగిరి తన్నాడు. గుఱ్ఱమురక్కసుడు తన్నిన తన్ను తప్పించుకుని, కృష్ణుడు రాక్షసాంతకుడు రణోత్సాహం వహించాడు. కోపంతో గోపాలకృష్ణుడి కళ్ళు జేవురించాయి. వెంటనే తురగాసురుడి పొంగు అణిగేలా చటుక్కున, వాడి కాళ్ళు పట్టుకుని గరుత్మంతుడు పాముపిల్లను విసిరేయునట్లు, వాడిని నాలుగు వందల మూరల దూరం పారేశాడు. అలా విసరిపారేయడంతో నిశాచరుడు నేలమీద పడి, వేగంగా పైకి లేచి అహంకారంతో హుంకరిస్తూ జంకూగొంకూ లేకుండా కృష్ణుడి మీదకి లంఘించాడు. అప్పుడా యదుకుంజరుడు భయంకర సర్పాన్ని పర్వత గుహలోకి చొప్పించినట్లు, దిగ్గజతొండమువలె బహు బలిష్టమైన తన బాహుదండమును వాడి నోటిలోనికి దూర్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=133&padyam=1174

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 9

( కేశిని సంహారము )

10.1-1169-క.
భీషణ ఘోటక దానవ
హేషానిర్ఘోషభిన్న హృదయ నిఖిల గో
యోషా పురుషార్భకమై
ఘోషము హరి చూడ దైన్యఘోషం బయ్యెన్.
10.1-1170-వ.
అ య్యవసరంబున.
10.1-1171-ఉ.
"పేదల ఘోషగోపకుల బిట్టదలించుట వీరధర్మమా?
కాదు; వ్రజంబులో దనుజఘస్మరుఁ డే" డని తన్ను రోయు క్ర
వ్యాదునిఁ జూచి గోపకుల కడ్డమువచ్చి "నిశాట! యింకఁ బో
రా" దని శౌరి చీరె మృగరాజు క్రియన్ నెదిరించె దైత్యుఁడున్.

భావము:
దారుణమైన అశ్వాకారంలో ఉన్న ఆ రాక్షసుడి సకిలింత వినబడేసరికి, అక్కడున్న ఆవులు, దూడలు, స్త్రీలు, పురుషులు, బిడ్డలు అందరి హృదయాలు దద్ధరిల్లాయి. కృష్ణుడు చూస్తుండగానే ఆ గొల్లపల్లె అంతా దీనంగా ఘోషించసాగింది. అలా అల్లకల్లోలం సృష్టిస్తున్న ఆ సమయంలో కేశి ఇలా అనసాగాడు. ఐత“బలహీనులైన మందలోని గొల్లలను భయపెట్టడం తరిమికొట్టడం నావంటి వీరుడికి ధర్మం కాదు. ఈ గొల్లపల్లెలో దానవహంత కృష్ణుడు ఏడీ, ఎక్కడ” అంటూ తనను తిడుతున్న ఆ అసురుణ్ణి కృష్ణుడు చూసాడు. గోపాలురకు అడ్డంగా వచ్చి శూరుని మనుమడైన కృష్ణుడు “ఓరీ నిశాచరా! ఇంక నువ్వు ఎక్కడకీ పోలేవు” అంటూ సింహంలాగ గర్జించి వాడిని పోరుకి పిలిచాడు. ఆ రక్కసుడు వాసుదేవుని ఎదిరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=133&padyam=1171

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, August 15, 2020

శ్రీ కృష్ణ విజయము - 8

( కేశిని సంహారము )

10.1-1167-సీ.
ఖురపుటాహతిఁ దూలి కుంభినీచక్రంబు$
  ఫణిరాజఫణులకు బరువుసేయ
భీషణహేషా విభీషితులై మింట$
  నమృతాంధు లొండొరు నండఁ గొనఁగఁ
జటుల చంచల సటాచ్ఛటల గాడ్పుల మేఘ$
  ములు విమానములపై ముసుఁగు పడఁగ
వివృతాస్యగహ్వర విపులదంతంబులు$
  ప్రళయాగ్నికీలల పగిది మెఱయఁ
10.1-1167.1-ఆ.
గాలపాశలీలగా వాల మేపార
వాహ మగుచు గంధవాహగతుల
విజితశక్రపాశి వీర్యపయోరాశి
కేశి వచ్చె మంద క్లేశ మంద.
10.1-1168-వ.
మఱియును.

భావము:
కేశి అనే రాక్షసుడు ఇంద్రుడిని, వరుణుడిని మించిన వాడు, శౌర్యానికి సముద్రం లాంటి వాడు. వాడు కంసుని ప్రోత్సాహంతో గుఱ్ఱము రూపు ధరించి వాయువేగంతో నందుని మందలో ప్రవేశించి సంకటం కలిగించాడు. అతని అశ్వగతి వేగంతో కూడిన దిట్టమైన గిట్టల తాకిడికి చలించిన భూమండలం మోస్తున్న ఆదిశేషుని పడగలకు భారమైంది. అతని భీతిగొలిపే సకిలింతలకు మిక్కిలి భయపడిపోయి ఆకాశంలో దేవతలు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. అతను జూలు ఊపిన విసురుకి జనించిన గాలి వలన మేఘాలు చెల్లాచెదురు అయిపోయి, విమానాలను క్రమ్ముకున్నాయి. తెరిచిన అతని నోటి గుహలోని పెద్ద పండ్లు ప్రళయకాలంలోని అగ్నిజ్వాలల మాదిరి మెరిశాయి. అతని తోక యమపాశం లాగా ప్రకాశించింది. అంతే కాదు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=133&padyam=1167

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 7

( కంసుడక్రూరునితో మాట్లాడుట )

10.1-1165-ఉ.
"పంపినఁ బోనివాఁడనె నృపాలక! మానవు లెన్న తమ్ము నూ
హింపరు దైవయోగముల నించుకఁ గానరు తోఁచినట్లు ని
ష్కంపగతిం చరింతు రది గాదన వచ్చునె? యీశ్వరేచ్ఛఁ ద
ప్పింపఁగ రాదు నీ పగతు బిడ్డలఁ దెచ్చెదఁ బోయి వచ్చెదన్."
10.1-1166-వ.
అని పలికి రథంబెక్కి యక్రూరుండు చనిన సకలజనులను వీడుకొలిపి కంసుం డంతిపురంబునకుం జనియె; నంతఁ గంస ప్రేరితుండై.

భావము:
“ఓ రాజా! నీవు ఆజ్ఞాపిస్తే వెళ్ళకుండా ఉంటానా? నిజానికి నరులు తమ శక్తి ఎలాంటిదో? దైవశక్తి ఎలాంటిదో? కొంచెము కూడ గ్రహించ లేరు. వారికి తోచినట్లు పట్టుదలతో ప్రవర్తిస్తుంటారు. దానిని కాదనలేం కదా. విధి నిర్ణయం తప్పించడం ఎవరి తరమూ కాదు. నేను వెళ్ళి నీ విరోధిపుత్రులను ఇక్కడికి తీసుకువస్తాను.” ఇలా చెప్పి, అక్రూరుడు రథం మీద వ్రేపల్లెకని బయలుదేరాడు. కంసుడు తక్కిన వారందరినీ పంపించి అంతఃపురంలోకి వెళ్ళాడు. అంత, కంసుడు పంపిన. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=132&padyam=1165

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Friday, August 14, 2020

శ్రీ కృష్ణ విజయము - 6

( కంసుడక్రూరునితో మాట్లాడుట )

10.1-1163-సీ.
ఆ రామకేశవు లంతరించిన వసు$
  దేవ ముఖ్యులఁ జంపి తెగువ మెఱసి
వృష్ణి భోజ దశార్హ వీరులఁ దెగటార్చి$
  ముదుకఁడు రాజ్యకాముకుఁడు ఖలుఁడు
నగు నుగ్రసేను మా యయ్య గీటడగించి$
  పినతండ్రి దేవకుఁ బిలుకుమార్చి
మఱియు వైరులనెల్ల మర్దించి నే జరా$
  సంధ నరక బాణ శంబరాది
10.1-1163.1-ఆ.
సఖులతోడ భూమిచక్ర మేలెదఁ బొమ్ము
తెమ్ము వేగమ వసుదేవసుతుల
మఖము పేరు చెప్పి మంత్రభేదము చేయ
వలయుఁ బెంపఁ జనదు వైరి జనుల."
10.1-1164-వ.
అనిన నక్రూరుం డిట్లనియె.

భావము:
బలరాముడు కృష్ణుడు ఇద్దరు నేలకూలిన వెంటనే, వసుదేవుడు మున్నగు ప్రముఖులను సంహరిస్తాను. సాహసంతో వృష్ణి, భోజ, దశార్హ వంశజులైన వీరులను హతమారుస్తాను. రాజ్యాభిలాష గలవాడూ ముసలివాడూ దుర్మార్గుడూ అయిన మా తండ్రి ఉగ్రసేనుణ్ణి నిర్మూలిస్తాను. మా పినతండ్రియైన దేవకుణ్ణి చంపేస్తాను. ఇంకా మిగిలిన శత్రువుల ప్రాణాలు తీస్తాను. జరాసంధుడు, నరకుడు, బాణుడు, శంబరుడు మొదలైన నా చెలికాండ్రతో గూడి ఈ భూమండలాన్న పరిపాలిస్తాను. ధనుర్యాగమనే మిషతో నీవు వెళ్ళి వసుదేవుడి కొడుకులను శీఘ్రంగా ఇక్కడికి తీసుకుని రా. పగవారి గుట్టు భేదించాలి. విరోధులను వృద్ధి కానీయ రాదు.” కంసుడి మాటలు వినిన అక్రూరుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=132&padyam=1163

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 5

( కంసుడక్రూరునితో మాట్లాడుట )

10.1-1161-శా.
కొండల్గూలఁగఁ ద్రొబ్బు కొమ్ముల తుదిం గోపించి కోరాడుచో
దండిన్ దండి నధఃకరించు నొకవేదండంబు నా యింట బ్ర
హ్మాండంబైనఁ గదల్పనోపు బలకృష్ణాభీరులం బోరిలో
ఖండింపం దడవెంత? దాని; కదియుం గాదేని నక్రూరకా!
10.1-1162-శా.
చాణూరుండును ముష్టికుండును సభాసంఖ్యాతమల్లుల్ జగ
త్ప్రాణున్ మెచ్చరు సత్వసంపదల బాహాబాహి సంగ్రామపా
రీణుల్ వారలు రామకృష్ణుల బలోద్రేకంబు సైరింతురే?
క్షీణప్రాణులఁ జేసి చూపుదురు సంసిద్ధంబు యుద్ధంబునన్.

భావము:
నా గుమ్మంలో ఉన్న కువలయాపీడము అనే గజరాజు తన దంతాగ్రాలతో కొండలను కూడా కూలద్రోస్తుంది. కోపంతో ఢీకొన్నప్పుడు నిండు మగటిమితో యముడిని సైతం క్రిందపడేస్తుంది. బ్రహ్మాండాలను కూడా కదలించే శక్తి దానికి ఉంది. అలాంటి గజరాజుకి బలరామకృష్ణులను చీల్చిచెండాడానికి క్షణకాలం పట్టదు. ఒకవేళ అది వారిని సంహరించ లేకపోతే అక్రూరా! విను చాణూరుడు, ముష్టికుడు మల్లుర సమూహంలో గణింపదగిన యోధులు. కుస్తీపట్టుటలో వారు వాయుదేవుడిని సైతం లక్ష్యపెట్టరు. శక్తి సామర్థ్యాలతో మల్లయుద్ధం చేయడంలో మిక్కిలి నేర్పరులు. వారు బలరామకృష్ణుల బలాధిక్యాన్ని ఏమాత్రం సహించరు. పోరాటంలో వారి ప్రాణాలుతోడి తెగటారుస్తారు. ఇది ముమ్మాటికీ నిజం.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=132&padyam=1162

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, August 13, 2020

శ్రీ కృష్ణ విజయము - 4

( కంసుడక్రూరునితో మాట్లాడుట )

10.1-1157-వ.
అని తనవారి నందఱ నయ్యైపనులకు నియమించి యదుశ్రేష్ఠుం డగు నక్రూరునిం బిలిపించి చెట్టపట్టుకొని యిట్లనియె.
10.1-1158-శా.
"అక్రూరత్వముతోడ నీవు మనఁగా నక్రూరనామంబు ని
ర్వక్రత్వంబునఁ జెల్లె మైత్రి సలుపన్ వచ్చున్ నినుం జేరి నీ
వక్రోధుండవు మందలోన బలకృష్ణాభీరు లస్మద్వినా
శక్రీడారతులై చరింతురఁట యోజందెచ్చి యొప్పింపవే.
10.1-1159-ఆ.
నాకు వెఱచి సురలు నారాయణుని వేఁడి
కొనిన నతఁడు వచ్చి గోపకులము
నందు గృష్ణమూర్తి నానకదుందుభి
కుదితుఁ డయ్యె ననఁగ నొకటి వింటి.
10.1-1160-వ.
కావున నీవు గోపకులచేత నరులు గొని ధనుర్యాగంబు చూడరం డని వారలం దోడ్కొని రమ్ము, తెచ్చిన.

భావము:
ఆవిధంగా కంసుడు తన వాళ్ళందరికీ ఆ యా పనులు అప్పజెప్పి. యాదవోత్తముడైన అక్రూరుణ్ణి పిలిపించాడు. అతడి చెయ్యి తన చేతితో పట్టుకుని, ఇలా అన్నాడు. “క్రూరకృత్యాలకు దిగకుండా బతుకు సాగించడం వలన నీకు అక్రూరుడనే పేరు సార్ధకనామం అయింది. నీతో కలసి మెలసి స్నేహం చేయవచ్చు. నీవు కోపంలేని వాడివి, నందవ్రజంలో గొల్లలైన రామకృష్ణులు నన్ను చంపడానికి ఆసక్తితో సిద్ధపడుతున్నారుట. ఉపాయంతో వారిని తెచ్చి నాకు అప్పగించు. దేవతలు నాకు భయపడి వేడుకోడంతో, విష్ణువు యదువంశంలో వసుదేవుడికి కృష్ణుడుగా పుట్టాడని ఒక మాట విన్నాను. కాబట్టి, నువ్వు నందాదులైన యాదవులకు చెప్పి ఒప్పించి కప్పం గైకొని, ధనుర్యాగం చూడడానికి రండని వారిని పిలుచుకొని రావాలి. నువ్వు అలా తీసుకు వస్తే. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=132&padyam=1159

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 3


( కంసుని మంత్రాలోచన )

10.1-1154-శా.
విన్నాణంబులఁ బోరనేర్తురు మహావీర్యప్రతాపాది సం
పన్నుల్ మీరలు మేటి మల్లుగములం బ్రఖ్యాతులై పెంపుతో
మన్నా రా బలకృష్ణులం బెనఁకువన్ మర్దించి మత్ప్రీతి కా
సన్నుల్ గండు పురీజనుల్ పొగడ నో! చాణూర! యో! ముష్టికా!
10.1-1155-శా.
రారా హస్తిపకేంద్ర! గండమదధారాగంధలోభాంధ గం
భీరాళివ్రజమైన మత్కువలయాపీడద్విపేంద్రంబు మ
ద్వారోదంచిత దేహళీపరిసరస్తంభంబు డాయంగ నా
భీరుల్ రా నదలించి డీకొలుపుమీ బీరంబు తోరంబుగన్.
10.1-1156-క.
పశువిశసనములు చేయుఁడు
పశుపతికిం బ్రియముగాఁగ భావించి చతు
ర్దశినాడు ధనుర్యాగము
విశదంబుగఁ జేయవలయు విజయముకొఱకున్."

భావము:
ఓ చాణూర ముష్టికులారా! మీరు మిక్కిలి నేర్పుగా మల్ల యుద్ధం సలుప గల దిట్టలు. గొప్ప శౌర్య ప్రతాపాలు కల వారు జెట్టీలలో జగజెట్టీలుగా పేరుపొందిన వారు. పట్టణ ప్రజలు ప్రశంసించేలా మల్లయుద్ధంలో ఆ రామకృష్ణులను మట్టుపెట్టి నాకు ప్రీతిపాత్రులు కండు. ఓరీ మావటీ! ఇటు రమ్ము! ఆ గోపాలకులు మన భవన ద్వార సమీపంలో ఉన్న స్తంభం వద్దకు రాగానే నీ ప్రతాపం ప్రదర్శించుము. చెక్కిళ్ళ మీది మదజల ధారల సౌరభాల చేత గండుతుమ్మెదలకు ఆశగొలిపి ఆకర్షించే కువలయాపీడము అనే మన గజరాజాన్ని అదలించి వారి మీదకు డీకొలుపుము. చతుర్దశి నాడు విజయం కోసం వైభవోపేతంగా ధనుర్యాగం చెయ్యాలి. రుద్రుడికి ప్రీతిగా జంతుబలులు ఇవ్వండి.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=131&padyam=1156

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

భాగవత జయంత్యుత్సవములు 2020 - సాంస్కృతిక కార్యక్రమాలు । Bhagavata Jayan...

Wednesday, August 12, 2020

శ్రీ కృష్ణ విజయము - 2

( కంసుని మంత్రాలోచన )

10.1-1151-వ.
మఱియు నలుక దీఱక కంసుండు దేవకీవసుదేవుల లోహపాశ బద్ధులంజేసి కేశియనువానిం బిలిచి రామకేశవులం జంపుమని పంపి మంత్రి భట గజారోహక చాణూర ముష్టిక సాల్వ కోసల ప్రముఖుల రావించి యిట్లనియె.
10.1-1152-శా.
"ఎందున్ నన్నెదిరించి పోరుటకు దేవేంద్రాదులుం జాల రీ
బృందారణ్యము మంద నిప్పుడు మదాభీరార్భకుల్ రామ గో
విందుల్ వర్ధిలుచున్న వారఁట రణోర్విం గంసుని ద్రుంతు మం
చున్ దర్పంబులు పల్కుచుందు రఁట యీ చోద్యంబులన్ వింటిరే?
10.1-1153-క.
పట్టణజనములు చూతురు
దట్టంబుగ మల్లరంగతల పార్శ్వములం
బెట్టింపుఁడు తమగంబులు
పుట్టింపుఁడు వీట మల్లుపో రను మాటన్.

భావము:
అంతటితో కంసుడికి అలక తీరలేదు. అతడు దేవకీ వసుదేవులను ఇనప సంకెళ్ళతో బంధించాడు. కేశి అనేవాణ్ణి పిలచి, గోకులానికి వెళ్ళి రామకృష్ణులను చంపి రమ్మని పంపించాడు. తరువాత మంత్రులను, భటులను, మావటివాళ్ళను, చాణూరుడు ముష్టికుడు అనే జెట్టీలనూ, సాల్వుడు కోసలుడు మొదలైన ముఖ్యులనూ పిలిపించి వారితో ఇలా అన్నాడు. “ఎక్కడైనా, ఇంద్రాదులకు సైతం నన్ను ఎదిరించి పోరాడా లంటే శక్తి చాలదు. అలాంటిది, బలరామకృష్ణులు అనే మదించిన గొల్లపిల్లలు ఇప్పుడు బృందావనంలో పెరుగుతున్నారుట. “కదనభూమిలో కంసుణ్ణి చంపుతా” మంటూ బీరాలు పలుకుతున్నారుట. మీరు ఈ వింత మాటలు విన్నారా? మల్లజెట్టీ పోటీ ఏర్పాటు చేయండి. మల్ల రంగానికి ముందువైపుల మంచెలు అమర్చండి. పుర ప్రజలు చూస్తారు. నగరం నలుమూలల చాటింపు వేయించండి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=131&padyam=1153

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 1

( కంసునికి నారదుడు జెప్పుట )

10.1-1149-చ.
ఘనుఁడొకనాడు నారదుఁడు కంసునితోడ యశోద కూఁతు దాఁ
గనుటయుఁ జక్రి దేవకికి గర్భజుఁ డౌటయు మున్ను రోహిణీ
తనయుఁడు రాముఁడౌటయును దద్విభు లిద్దఱు మంద నున్నవా
రని యెఱుఁగంగఁ జెప్పిన మహాద్భుత మంచుఁ జలించి గిన్కతోన్.
10.1-1150-చ.
"కొడుకుల మందలోన నిడి గొంటుతనంబున మోసపుచ్చె నీ
బడుగునుఁ బట్టి చంపు టిది భావ్య" మటంచుఁ గృపాణపాణి యై
వడి వసుదేవునిం దునుమ వచ్చిన కంసునిఁ జూచి నారదుం
డుడుగుము చంపఁ బోల దని యోడక మానిచి పోయె మింటికిన్.

భావము:
ఒకరోజు, మహానుభావుడైన నారదుడు కంసుని దగ్గరకు వచ్చి “అ బాలిక యశోద కన్న కన్నె, శ్రీకృష్ణుడు దేవకీగర్భ సంభూతుడు, బలరాముడు రోహిణి కొడుకు, ఆ రామకృష్ణులు ఇద్దరు నందుని మందలో ఉన్నారు” అని తెలియ చెప్పాడు. ఆయన మాటలు విని, ఆశ్చర్యపోయి, ఆగ్రహావేశాలతో కంసుడు కంపించిపోయాడు. ఈ బడుగు వసుదేవుడు కొడుకులను నందవ్రజంలో భద్రంగా దాచిపెట్టి, మంచిమాటలతో నన్ను వంచించాడు. ఈ దిక్కుమాలినవాణ్ణి, ఈ మోసగాణ్ణి పట్టి పరిమార్చడం సరైన పని అంటూ ఖడ్గం చేపట్టి వెంటనే వసుదేవుణ్ణి చంపడానికి కంసుడు ఉద్యుక్తుడయ్యాడు. అతణ్ణి చూసి నారదమహర్షి “వసుదేవుడిని చంపవద్దు. ఇది నీవంటి వాడికి తగదు” అని వాడిని వారించి దేవలోకానికి తరలిపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=130&padyam=1150

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :