8-732-వ.
అని యిట్లు సత్యవ్రతుండు పలికిన సంతసించి మత్స్యరూపంబున మహాసముద్రంబున విహరించు హరి పురాణపురుషుం డగుటం జేసి సాంఖ్యయోగక్రియాసహితయగు పురాణసంహిత నుపదేశించె; నమ్మహారాజు ముని సమేతుండై భగవన్నిగదితంబై సనాతనంబగు బ్రహ్మస్వరూపంబు విని కృతార్థుం డయ్యె; నతం డిమ్మహాకల్పంబున వివస్వతుం డనం బరఁగిన సూర్యునకు శ్రాద్ధదేవుండన జన్మించి శ్రీహరి కృపావశంబున నేడవ మనువయ్యె; అంత నవ్విధంబున బెనురేయి నిండునంతకు సంచరించి జలచరాకారుండగు నారాయణుండు తన్నిశాంత సమయంబున.
8-733-మ.
ఉఱ కంబోనిధి రోసి వేదముల కుయ్యున్ దైన్యముం జూచి వేఁ
గఱు లల్లార్చి ముఖంబు సాఁచి బలువీఁకందోఁక సారించి మే
న్మెఱయన్ దౌడలు దీటి మీస లదరన్ మీనాకృతిన్ విష్ణుఁ డ
క్కఱటిం దాఁకి వధించె ముష్టిదళితగ్రావున్ హయగ్రీవునిన్.
భావము:
ఈ విధంగా సత్యవ్రతుడు ప్రార్ధన చేయగా విని, మత్స్య రూపంతో సముద్రంలో సంచరిస్తున్న మహావిష్ణువు సంతోషించాడు. ఆ పరమాత్ముడు సాంఖ్యయోగంతో కూడిన పురాతనమైన వేదభాగాన్ని అతనికి బోధించాడు. మునులతోపాటు సత్యవ్రతుడు భగవంతుడు చెప్పిన సనాతనమైన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుని ధన్యుడైయ్యాడు. సత్యవ్రతుడు ఈ కల్పంలో వివస్వంతుడని పిలువబడే సూర్యునికి శ్రాద్ధదేవుడు అనే పేరుతో పుట్టి విష్ణువు దయవల్ల ఏడవమనువు అయ్యాడు. ప్రళయరాత్రి ముగిసి తెల్లవారే పర్యంతమూ ఆవిధంగా విష్ణువు మత్స్య స్వరూపంతో తిరుగుతున్నాడు. వేదాలు బాధతో మొరపెట్టుకోవడాన్ని ఆ కాళరాత్రి ముగిసే తెల్లవారుజామున విష్ణుమూర్తి కన్నాడు. వేగంగా రెక్కలు అల్లార్చి, నోరు తెరిచాడు; ఉత్సాహంతో తోక ఊగించాడు; మేను మెరపించాడు; దౌడలు చక్క జేసుకున్నాడు; మీసాలు కదిలించాడు; దుష్టుడూ మహాబలిష్టుడూ ఐన హయగ్రీవుణ్ణి హతమార్చాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=90&padyam=733: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment