Saturday, April 29, 2017

దక్షయాగము - 17:

4-59-క.
సతి దన పతి యగు నా పశు
పతిఁ జూచి సముత్సుకతను భాషించె; "ప్రజా
పతి మీ మామ మఖము సు
వ్రతమతి నొనరించుచున్న వాఁడఁట వింటే;
4-60-క.
కావున నయ్యజ్ఞమునకు
నీ విబుధగణంబు లర్థి నేగెద; రదిగో!
దేవ! మన మిప్పు డచటికిఁ
బోవలె నను వేడ్క నాకుఁ బుట్టెడు నభవా!

టీకా:
సతి = సతీదేవి; తన = తనయొక్క; పతి = భర్త; అగు = అయిన; ఆ = ఆ; పశుపతిన్ = శివుని {పశుపతి - పాశములచే బంధించబడిన సకల జీవులను పాలించు అధిపతి, శివుడు}; చూచి = చూసి; సముత్సకతను = మంచి; ఉత్సుకతనున్ = ఉత్సాహముతో; భాషించెన్ = మాట్లాడెను; ప్రజాపతి = ప్రజాపతి; మీ = మీ యొక్క; మామ = మావగారు; మఖమున్ = యాగమును; సువ్రత = బాగుగాచేయు; మతిన్ = ఉద్దేశ్యముతో; ఒనరించుచున్ = చేస్తూ; ఉన్నవాడట = ఉన్నాడట; వింటే = విన్నావా. కావునన్ = అందుచేత; ఆ = ఆ; యజ్ఞమున్ = యాగమున; కున్ = కు; ఈ = ఈ; విబుధ = దేవతల; గణంబుల్ = సమూహములు; అర్థిన్ = కోరి; ఏగెదరు = వెళుతున్నారు; అదిగో = అదిగో; దేవ = దేవుడ; మనము = మనము; ఇపుడున్ = ఇప్పుడు; అచటికిన్ = అక్కడకి; పోవలెను = వెళ్ళవలెను; అని = అని; వేడ్క = వేడుక; నాకున్ = నాకు; పుట్టెడున్ = పుడుతున్నది; అభవా = శివుడ {అభవ - పుట్టుక లేనివాడు, శివుడు}.

భావము:
అప్పుడు సతీదేవి అతిశయించిన కుతూహలంతో తన ప్రాణేశ్వరుడైన పరమేశ్వరునితో ఇలా అంటోంది “విన్నారా! మీ మావగారు దక్షప్రజాపతి దీక్షాపరుడై యజ్ఞం చేస్తున్నా డట! కనుక ఆ యజ్ఞాన్ని చూదాలనే వేడుకతో అదుగో ఆ దెవతలంతా గుంపులుగా వెళ్తున్నారు. స్వామీ! మనం ఇప్పుడే అక్కడికి వెళ్ళాలనే కోరిక నాకు కలుగుతున్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=60

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :


No comments: