Saturday, December 24, 2016

వామన వైభవం - 64:


8-576-సీ.
సంతుష్టుఁడీ మూఁడు జగములఁ బూజ్యుండు;
సంతోషి కెప్పుడుఁ జరఁగు సుఖము
సంతోషిఁ గాకుంట సంసార హేతువు;
సంతసంబున ముక్తిసతియు దొరకుఁ
బూఁటపూఁటకు జగంబుల యదృచ్ఛాలాభ;
తుష్టిని దేజంబు తోన పెరుఁగుఁ
బరితోష హీనతఁ బ్రభ చెడిపోవును;
జలధార ననలంబు సమయునట్లు
8-576.1-ఆ.
నీవు రాజ వనుచు నిఖిలంబు నడుగుట
దగవు గాదు నాకుఁ; దగిన కొలఁది
యేను వేఁడికొనిన యీ పదత్రయమునుఁ
జాల దనక యిమ్ము; చాలుఁజాలు. "

టీకా:
సంతుష్టుడు = తృప్తిపడువాడు; ఈ = ఈ; మూడుజగములన్ = ముజ్జగములందును; పూజ్యుండు = గౌరవింపదగినవాడు; సంతోషి = తృప్తిపడువాని; కిన్ = కి; ఎప్పుడున్ = ఎప్పటికిని; జరుగు = కలుగుతుండును; సుఖము = సౌఖ్యము; సంతోషి = సంతృప్తి; కాకుంటన్ = చెందకపోవుట; సంసార = సంసార బంధనములకు; హేతువు = కారణము; సంతసంబునన్ = సంతృప్తివలన; ముక్తి = మోక్షము యనెడి; సతియున్ = కాంతకూడ; దొరకున్ = లభించును; పూటపూట = ప్రతి దినమున; కు = కు; జగంబులన్ = లోకములందు; అదృచ్చా = తనకితానుగా; లాభ = దొరకినదానితో; తుష్టినిన్ = తృప్తివలన; తేజంబున్ = తేజస్సు; తోనన్ = తోపాటు; పెరుగున్ = అభివృద్దికలుగును; పరితోష = సంతృప్తి; హీనతన్ = లేకపోవుటచేత; ప్రభ = తేజస్సు; చెడిపోవును = పాడైపోవును; జల = నీటి; దారన్ = దారలవలన; అనలంబు = అగ్ని; సమయున్ = ఆరిపోవు; అట్లు = విధముగా.
                  నీవున్ = నీవు; రాజవు = రాజువుకదా; అనుచున్ = అని; నిఖిలంబున్ = సమస్తమును; అడుగుట = కోరుట; తగవు = తగినది; కాదు = కాదు; నా = నా; కున్ = కు; తగిన = సరిపడిన; కొలది = అంత; ఏనున్ = నేను; వేడికొనిన = కోరుకొన్న; ఈ = ఈ; పద = అడుగులు; త్రయమును = మూడింటిని (3); చాలదు = వీలుకాదు; అనక = అనకుండగ; ఇమ్ము = ఇమ్ము; చాలుజాలు = ఇంకచాలు.

భావము:
తృప్తిపడేవాడు ముల్లోకాల్లోనూ గౌరవింపబడతాడు. తృప్తునికి ఎప్పుడూ సుఖం కలుగుతుంది. సంతోషం లేకపోవడమే తిరిగి పుట్టడానికి కారణం. సంతోషంవల్ల మోక్షం కూడా సమకూరుతుంది. పూటపూటకూ తనంతతానుగా దొరికినదానితో సంతోషపడుతుంటే తేజస్సు పెరుగుతుంది. నీళ్ళ వలన నిప్పు చల్లారినట్లుగా సంతోషం లేకపోతే తేజస్సు తగ్గిపోతుంది. నీవు రాజువు కదా అని అవి ఇవి అన్నీ అడగడం భావ్యం కాదు. నాకు తగినట్లుగా నేను అడిగిన మూడుఅడుగులూ కాదనకుండా ఇమ్ము. అంతే చాలు. అదే చాలు. ”
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=75&Padyam=576

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: