Saturday, December 10, 2016

వామన వైభవం - 50:


8-550-మ.
వరచేలంబులొ మాడలో ఫలములో వన్యంబులో గోవులో
హరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ధరణీ ఖండమొ కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా! "
8-551-వ.
అని ధర్మయుక్తంబుగాఁ బలికిన వైరోచని వచనంబులు విని సంతోషించి యీశ్వరుం డిట్లనియె.



టీకా:
వర = మంచి; చేలంబులో = బట్టలుకాని; మాడలో = సువర్ణ నాణెములుకాని {మాడ - అరవరహా, ఒక సువర్ణనాణెము}; ఫలములో = పళ్ళుకాని; వన్యంబులో = వనములుకాని; గోవులో = పశువులుకాని; హరులో = గుర్రములుకాని; రత్నములో = మణులుకాని; రథంబులో = రథములుకాని; విమృష్టాన్నంబులో = మంచి ఆహారములు కాని; కన్యలో = స్త్రీలుకాని; కరులు = ఏనుగులుకాని; కాంచనమో = బంగారము కాని; నికేతనములో = ఇళ్శుకాని; గ్రామంబులో = ఊళ్ళుకాని; భూములో = పొలములుకాని; ధరణీఖండమో = భూభాగముకాని; కాక = కాకపోతే; ఏమి = ఏది; అడిగెదో = అడిగెదవు; ధాత్రీసుర = బ్రాహ్మణ; ఇంద్ర = శ్రేష్ఠులలో; ఉత్తమా = ఉత్తముడా. అని = అని; ధర్మయుక్తంబుగాన్ = ధర్మబద్దముగా; పలికిన = అడిగిన; వైరోచని = బలిచక్రవర్తి {వైరోచని - విరోచనుని పుత్రుడు, బలి}; వచనంబులు = మాటలు; విని = విని; సంతోషించి = ఆనందించి; ఈశ్వరుండు = భగవంతుడు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:
ఓ బ్రాహ్మణోత్తముడా! నీకేం కావాలో కోరుకో. మేలైన వస్త్రములా, డబ్బులా, పండ్లా, అడవి సంపదలా, గోవులా, గుర్రాలా, రత్నాలా, రథాలా, మంచి ఆహారాలా, కన్యలా, ఏనుగులా, బంగారమా, భవనాలా, గ్రామాలా, పొలాలా, భూభాగాలా లేకపోతే ఇవి కాకుండా ఇంకేమైనా కోరుకుంటున్నావా? ఇలా ధర్మబద్ధంగా బలిచక్రవర్తి పలికిన పలుకులకు సంతోషించిన భగవంతుడైన వామనుడు ఇలా అన్నాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=73&Padyam=550

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: