Friday, December 2, 2016

వామన వైభవం - 42:

8-536-సీ.
చవులుగాఁ జెవులకు సామగానంబులు;
చదువు నుద్గాతల చదువు వినుచు
మంత్ర తంత్రార్థ సంబంధభావములు పే;
ర్కొనెడి హోతలతోడఁ గూడికొనుచు
హోమకుండంబులం దున్న త్రేతాగ్నుల;
వెలిఁగించు యాజక వితతిఁ గనుచు
దక్షులై బహువిధాధ్వర విధానంబులు;
చెప్పెడు సభ్యులఁ జేరఁ జనుచుఁ
8-536.1-తే.
బెట్టుగోరెడు వేడుక పట్టుపఱుచు
నదితి పుట్టువు లచ్చికి నాటపట్టు
కోరి చరియించె సభలోనఁ గొంతఁదడవు
పుట్టు వెన్నఁడు నెఱుగని పొట్టివడుఁగు.



టీకా:
చవులుగాన్ = ఇంపుగా; చెవుల = చెవుల; కున్ = కు; సామగానంబులు = సామగానములు {సామగానములు - సామవేద మంత్రములు}; చదువు = పఠించెడి; ఉద్గాతల = ఉద్గాతలయొక్క {ఉద్గాత - యజ్ఞములందు సామవేద గానములను నడపువాడు}; చదువు = పఠనములను; వినుచున్ = వినుచు; మంత్రతంత్ర = మంత్రతంత్రముల; అర్థ = అర్థమునకు; సంబంధ = సంబంధించిన; భావములు = టీకలను; పేర్కొనెడి = వివరించెడి; హోతల = హోతల {హోతలు - ఋగ్వేదము తెలిసిన ఋత్విక్కులు}; తోడన్ = తోటి; కూడికొనుచు = కలియుచు; హోమకుండంబుల్ = హోమకుండములు; అందు = లో; ఉన్న = ఉన్నట్టి; త్రేతాగ్నులన్ = మూడుఅగ్నులను {త్రేతాగ్నులు - 1ఆవహనీయము 2గార్హపత్యము 3దక్షిణాగ్ని యనెడి మూడగ్నులు}; వెలిగించు = వెలిగించెడి; యాజక = ఋత్విక్కుల; వితతిన్ = సమూహమును; కనుచు = చూచుచు; దక్షులు = సమర్థులు; ఐ = అయ్యి; బహువిధ = పలురకములైన; అధ్వర = యజ్ఞ; విధానంబులు = విధులను; చెప్పెడు = పేర్కొనెడి; సభ్యులన్ = సభాపతుల; చేరన్ = దగ్గరకు; చనుచున్ = వెళుతు.  పెట్టు = దానమును; కోరెడు = కోరవలెననెడి; వేడుకన్ = కుతూహలమును; పట్టుపఱుచు = విదితముచేయుచు; అదితి = అదితి; పుట్టువు = కుమారుడు; లచ్చి = లక్ష్మీదేవి; కిన్ = కి; ఆటపట్టు = నివాసమైనవాడు; కోరి = కోరి; చరియించెన్ = తిరిగెను; సభ = సభ; లోనన్ = అందు; కొంత = కొంత; తడువు = సేవు; పుట్టువు = జన్మించుట; ఎన్నడున్ = ఎప్పుడు; ఎఱుగని = తెలియని; పొట్టి = వామనుడైన; వడుగు = బ్రహ్మచారి.

భావము:
చెవులకు ఇంపుగా సామవేదం పఠించే ఉద్గాతల గానాలు విన్నాడు. మంత్రతంత్రాలను వివరిస్తూ హోమం చేసే హోతలను కలుసుకున్నాడు. హోమకుండంలో అహవనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనే మూడగ్నులను వెలిగించే ఋత్విజులను చూసాడు. యాగవిధులను నేర్పరితనంతో పేర్కొంటున్న సభాపతులను సమీపించాడు. ఆ సభను బాగా ఆకర్షించాలని అనుకొని కొంతసేపు ఆ సభలో తిరుగాడాడు

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=72&Padyam=536

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : : 

No comments: