8-567-వ.
అనిన బరమయాచకునకుఁ బ్రదాత యిట్లనియె.
8-568-ఆ.
"ఉన్నమాటలెల్ల నొప్పును విప్రుండ!
సత్య గతులు వృద్ధ సమ్మతంబు;
లడుగఁ దలఁచి కొంచె మడిగితివో చెల్ల;
దాత పెంపు సొంపుఁ దలఁపవలదె. "
టీకా:
అనినన్ = అనగా; పరమ = మహా; యాచకున్ = బిక్షుని; కున్ = కి; ప్రదాత = గొప్పదాత; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను. ఉన్నమాటలు = చెప్పినవి; ఎల్లన్ = అన్ని; ఒప్పును = తగును; విప్రుండ = బ్రాహ్మణుడా; సత్య = యదార్థముమైన; గతులు = విధములు; వృద్ధ = పెద్దలచే; సమ్మతంబులు = అంగీకరింపబడునవి; అడుగన్ = అడగవలెనని; తలచి = అనుకొని; కొంచము = కొద్దిగానే; అడిగితివో = అడిగితివేమి; చెల్ల = అరె; దాత = దాతయొక్క; పెంపు = గొప్పదనమును; సొంపున్ = మంచితనమును; తలపన్ = భావించ; వలదె = వద్దా.
భావము:
ఇలా మూడు అడుగుల నేల అడిగిన ఉత్కృష్ట బిక్షుకుడైన వామనుడితో, బహు దొడ్డ దాత అయిన బలిచక్రవర్తి ఇలా అన్నాడు. “ఓ బ్రాహ్మణుడా! నీ మాటలన్నీ ఉన్నమాటలే. వాటిని ఒప్పుకోవలసిందే. ముమాటికీ సత్యములే. అందుకు పెద్దలు కూడా కాదనరు. కానీ పాపం అడక్క అడక్క అడిగి ఇంత కొంచెమే అడిగావు. చాలా బాగుంది. కానీ అడిగే టప్పుడు దాత గొప్ప దనాన్నీ అతని గొప్ప గుణాన్ని తలచాలి కదా!. ”
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=75&Padyam=568
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment