Monday, December 5, 2016

వామన వైభవం - 45:


8-541-క.
వెడవెడ నడకలు నడచుచు
నెడనెడ నడు గిడక నడరి యిల దిగఁబడగా
బుడిబుడి నొడువులు నొడువుచుఁ
జిడిముడి తడఁబడగ వడుగు చేరెన్ రాజున్.
8-542-వ.
ఇట్లు డగ్గఱి మాయాబిక్షుకుండు రక్షోవల్లభుం జూచి యిట్లనియె.

టీకా:
వెడవెడన్ = మెల్లిమెల్లి; నడకలు = అడుగులుతో; నడచుచున్ = తిరుగుతు; ఎడనెడ = మధ్యమధ్యలో; అడుగు = అడుగులు; ఇడక = వేయకుండ; అడరి = బెదరి; ఇల = భూమి; దిగబడగా = కుంగిపోతుండగ; బుడిబుడి = చిన్నచిన్న; నొడువులున్ = మాటలు; నొడువుచున్ = పలుకుచు; చిడిముడిన్ = కలవరపాటుతో; తడబడగ = తడబడుతుండగ; వడుగు = బ్రహ్మచారి; చేరెన్ = సమీపించెను; రాజున్ = చక్రవర్తిని. ఇట్లు = ఇలా; డగ్గఱి = దగ్గరకుచేరి; మాయా = కపట; బిక్షకుండు = యాచకుడు; రక్షస్ = రాక్షసుల; వల్లభున్ = ప్రభువును; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
వామనుడు మెల్లమెల్లగా అడుగులువేస్తూ నడిచాడు. అక్కడక్కడ నేల దిగబడుతుంటే అడుగులు తడబడుతు నడిచాడు. మధ్యలో కొద్దిగా మాట్లాడుతు, తడబడుతు, కలవరబడుతు బలిచక్రవర్తిని సమీపించాడు. (బలిచక్రవర్తి యాగశాలలోనికి వామనరూపంతో మయావటువుగా అవతరించిన విష్ణువు ప్రవేశించే ఘట్టం. పద్యం నడక వామనుని నడకతో పోటీపడుతోందా అన్నట్టు ఉంది.) అలా మాయాబిక్షుక రూపంలో ఉన్న వామనుడు ఆ దానవచక్రవర్తి అయిన బలిని చూసి ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=72&Padyam=541

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: