Tuesday, December 6, 2016

వామన వైభవం - 46:


8-543-మ.
ఇతఁడే దానవచక్రవర్తి సురలోకేంద్రాగ్నికాలాది ది
క్పతి గర్వాపనయప్రవర్తి, గతలోభస్ఫూర్తి, నానా మఖ
వ్రతదానప్రవణానువర్తి, సుమనోరామామనోభేదనో
ద్ధత చంద్రాతపకీర్తి, సత్యకరుణా ధర్మోల్లసన్మూర్తి దాన్.
8-544-వ.
అని కుశ పవిత్రాక్షత సంయుతం బయిన దక్షిణహస్తంబు సాఁచి యిట్లనియె.



టీకా:
ఇతడే = ఇతనేనా; దానవ = రాక్షస; చక్రవర్తి = చక్రవర్తి; సురలోకేంద్ర = దేవేంద్రుడు; అగ్ని = అగ్నిదేవుడు; కాల = యముడు; ఆది = మున్నగు; దిక్పతి = దికపాలకుల; గర్వ = గర్వమును; అపనయ = తొలగించిన; ప్రవర్తి = మొనగాడు; గత = నశించిన; లోభ = లోభము; స్పూర్తిన్ = ప్రకాశించగా; నానా = పలు; మఖ = యాగములు; వ్రత = వ్రతములు; దాన = దానముచేసెడి; ప్రవణ = సమర్థతతో; అనువర్తి = నడచెడివాడు; సుమనస్ = దేవతా; రామా = స్త్రీల; మనస్ = మనస్సులను; భేదన = కలవరపాటును; ఉద్ధత = పెంచెడి; చంద్ర = చంద్రుని; ఆతప = వెన్నెలవంటి; కీర్తిన్ = కీర్తి కలవాడు; సత్య = సత్యసంధత; కరుణా = దయా హృదయము; ధర్మ = ధర్మబుద్ధులతో; ఉల్లసత్ = ఉల్లాసవంతమైన; మూర్తి = వ్యక్తి; తాన్ = అతను. అని = అని పలికి; కుశ = దర్భలు; పవిత్ర = పవిత్రమైన; అక్షత = అక్షతలు; సంయుతంబు = కలిగినది; అయిన = ఐన; దక్షిణ = కుడి; హస్తంబున్ = చేతిని; సాచి = చాచి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
“ఇతడేనా రాక్షసచక్రవర్తి! ఇతడేనా దేవేంద్రుడు, అగ్ని, యముడూ మొదలైన దిక్పాలకుల గర్వాన్ని తొలగించిన మొనగాడు! ఇతడేనా అత్యాశలేని నిండైన హృదయం కలవాడు! ఇతడేనా పెక్కు యజ్ఞాల పుణ్యకార్యాలలో ప్రీతితో దానమిచ్చేవాడు! ఇతడేనా దేవతాస్త్రీల మనస్సులను కలవరపెట్టే వెన్నెలవంటి కీర్తికలవాడు! ఇతడేనా సత్యంతో ధర్మంతో ప్రకాశించే స్వరూపం కలవాడు!”. ఇలా పలికి, పవిత్రమైన దర్భలూ అక్షతలూ పట్టుకున్న తన కుడిచెయ్యి సాచి వామనుడు ఇలా అన్నాడు
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=72&Padyam=543

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: