అని యిట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలిత లోచనుండయి యశస్వి యిట్లనియె.
8-588-సీ.
"నిజ మానతిచ్చితి వీవు మహాత్మక! ;
మహిని గృహస్థధర్మంబు నిదియ
యర్థంబుఁ గామంబు యశమును వృత్తియు;
నెయ్యది ప్రార్థింప నిత్తు ననియు
నర్థ లోభంబున నర్థిఁ బొమ్మను టెట్లు? ;
పలికి లే దనుకంటెఁ బాప మెద్ది?
యెట్టి దుష్కర్ముని నే భరించెదఁ గాని;
సత్యహీనుని మోవఁ జాల ననచుఁ
8-588.1-తే.
పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ
సమరముననుండి తిరుగక చచ్చుకంటె
బలికి బొంకక నిజమునఁ బరఁగుకంటె
మానధనులకు భద్రంబు మఱియుఁ గలదె.
టీకా:
అని = అని; ఇట్లు = ఇలా; హితంబు = మేలుకోరి; పలుకుచున్న = చెప్పుతున్న; కుల = వంశ; ఆచార్యున్ = గురువున; కున్ = కు; క్షణమాత్ర = కొంచముసేపు; నిమీలిత = అరమూసిన; లోచనుండు = కన్నులు కలవాడు; అయి = అయ్యి; యశస్వి = కీర్తిగలవాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను. నిజమున్ = సత్యమును; ఆనతిచ్చితివి = చెప్పితివి; ఈవు = నీవు; మహాత్మక = గొప్ప ఆత్మ కలవాడ; మహిని = భూమిపైన; గృహస్థ = గృహస్థులయొక్క; ధర్మంబున్ = ధర్మము; ఇదియ = ఇదె; అర్థంబున్ = అర్థము; కామంబు = కామము; యశము = కీర్తి; వృత్తియున్ = జీవనోపాయము; ఎయ్యదిన్ = దేనికోసము; ప్రార్థింపన్ = కోరినా; ఇత్తును = ఇచ్చెదను; అనియు = అని; అర్థ = సంపదలపై; లోభంబునన్ = లోభముతో; అర్థిన్ = అడిగినవానిని; పొమ్ము = వెళ్ళిపొమ్ము; అనుట = అనుట; ఎట్లు = ఎలాకుదురుతుంది; పలికి = మాట యిచ్చి; లేదు = లేదు; అనుట = అనుట; కంటెన్ = కంటె; పాపము = పాపము; ఏద్ది = ఏముంది; ఎట్టి = ఎలాంటి; దుష్కర్ముని = చెడ్డపనిచేసినవానినైన; నేన్ = నేను; భరించెదన్ = మోయగలను; కాని = కాని; సత్యహీనును = ఆడితప్పువానిని; మోవజాలన్ = మోయలేను; అనుచున్ = అని. పలుకదే = అన్నదికదా; తొల్లి = పూర్వము; భూదేవి = భూదేవి; బ్రహ్మ = బ్రహ్మదేవుని; తోడన్ = తోటి; సమరమున = యుద్దము; నుండి = నుండి; తిరుగక = వెనుతిరగక; చచ్చు = మరణించుట; కంటెన్ = కంటె; పలికి = మాట యిచ్చి; బొంకక = పలుకలేదనకుండ; నిజమునన్ = సత్యమునందు; పరగు = వర్తిల్లెడి; కంటెన్ = కంటె; మాన = అభిమానము యనెడి; ధనుల = సంపదలుగలవార; కున్ = కి; భద్రంబు = శుభమైనది; మఱియున్ = మరింకొకటి; కలదె = ఉన్నదా, లేదు.
భావము:
ఇలా తమ మేలు కోరి, గురువు శుక్రుడు చెప్పగా, గొప్ప యశస్సు గల బలి ఒక క్షణం పాటు కన్నులు మూసుకుని ఇలా అన్నాడు.
“ఓ మహాత్మా! శుక్రాచార్యా! నీవు చెప్పింది నిజమే. లోకంలో ఇదే గృహధర్మం కూడా. అర్ధమూ, కామమూ, కీర్తి, జీవనోపాయము వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ధనంపై దురాశతో అడిగినవానికి లేదని చెప్పి త్రిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పడం కంటే పాపం లేదు. పూర్వం భూదేవి “ఎంతటి చెడ్డ పనిచేసిన వాడిని అయినా మోస్తాను కానీ ఆడినమాట తప్పిన వాడిని మాత్రం మోయలేను. ” అని చెప్పింది కదా. యుద్ధంలో వెనుతిరగకుండా వీరమరణం పొందడం, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడం మానధనులు అయిన వారికి మేలైన మార్గాలు కదా.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=76&Padyam=588
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :