Wednesday, September 18, 2019

కపిల దేవహూతి సంవాదం - 116


( చంద్ర సూర్య పితృ మార్గంబు )

3-1037-క.
నీ నామస్తుతి శ్వపచుం
డైనను జిహ్వాగ్ర మందు ననుసంధింపన్
వానికి సరి భూసురుఁడుం
గానేరఁడు చిత్రమిది జగంబుల నరయన్.
3-1038-ఉ.
ఈ విధ మాత్మలం దెలిసి యెప్పుడు సజ్జనసంఘముల్ జగ
త్పావనమైన నీ గుణకథామృత మాత్మలఁ గ్రోలి సర్వ తీ
ర్థావళిఁ గ్రుంకినట్టి ఫలమందుదు రంచు సమస్త వేదముల్
వావిరిఁ బల్కుఁ గావునను వారలు ధన్యులు మాన్యు లుత్తముల్.

భావము:
లోకాలన్నిటిలో విచిత్రమైన విషయ మేమిటంటే భక్తిపూర్వకంగా నీ నామాన్ని జిహ్వాగ్రాన నిలుపుకొని జపించినట్లయితే వాడు కుక్కమాంసం తినేవాడైనా వానితో బ్రాహ్మణుడు కూడా సాటి కాలేడు. ఈ పరమార్థాన్ని చక్కగా తెలిసికొన్న సజ్జనులు సర్వదా లోకపావనమైన నీ మధుర కథాసుధారసాన్ని తనివితీరా మనసారా త్రాగుతారు. అటువంటి వారికి సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలం ప్రాప్తిస్తుంది. ఈ విధంగా వేదాలన్నీ గొంతెత్తి చాటుతున్నాయి. అందువల్ల అటువంటి మహనీయులే మాననీయులు, ఉత్తములు, సాధుసత్తములు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1038

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: