Wednesday, September 4, 2019

కపిల దేవహూతి సంవాదం - 108


(చంద్ర సూర్య పితృ మార్గంబు )

3-1023-చ.
అలవడ ధూమమార్గగతులై పితృలోకముఁ బొంది పుణ్యముం
బొలిసినవారు దొంటి తమ పుత్రులకుం దగఁ దాము పుట్టి వి
హ్వలమతి గర్భగోళపతనాది పరేతధరాగతాంతమై
వెలసిన కర్మ మిం దనుభవింతురు గావున నీవు భామినీ!
3-1024-క.
విను, సర్వ భావములఁ బర
ముని ననఘు ననంతు నీశుఁ బురుషోత్తము స
న్మనమున భజియింపుము ముద
మున బునరావృత్తి లేని ముక్తి లభించున్."

భావము:
ధూమమార్గాల గుండా వెళ్ళి, పితృలోకం చేరి సుఖించేవాళ్ళు తమ పుణ్యం తరిగిపోగానే మళ్ళీ ఈ భూమిమీద తమ బిడ్డలకే బిడ్డలై జన్మిస్తారు. వశం తప్పిన మనస్సుతో మాతృగర్భంనుండి బయటపడింది మొదలుగా శ్మశాన భూమికి చేరే పర్యంతం ఆయా కర్మఫలాలను ఇక్కడే అనుభవిస్తాడు. కాబట్టి ఓ తల్లీ! నీవు విను. సర్వశ్రేష్ఠుడు, పాపరహితుడు, అనంతుడు, అధీశ్వరుడు, పురుషోత్తముడు అయిన పరమేశ్వరుణ్ణి అన్నిరీతులా సద్బుద్ధితో సంతోషంగా సేవించు. దానివల్ల పునర్జన్మం లేని కైవల్యం నీకు లభిస్తుంది.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1024

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: