Wednesday, September 4, 2019

కపిల దేవహూతి సంవాదం - 107


( చంద్ర సూర్య పితృ మార్గంబు )

3-1021-వ.
సకాములై యింద్రియజయంబు లేక పితృగణంబుల నెల్లప్పుడుఁ బూజించుచు గృహంబుల యందు వర్తించి హరిపరాఙ్ముఖు లగు వారు త్రైవర్గిక పురుషు లని చెప్పంబడుదురు.
3-1022-చ.
వినుతగుణోత్తరుండు నురువిక్రముఁ డైన హరిన్ భజించి త
న్మనన లసత్కథామృతము మానుగఁ గ్రోలుట మాని దుష్కథల్
విని ముద మందుచుందురు వివేకవిహీనత నూరఁబంది యా
త్మను మధురాజ్యభక్ష్యములు మాని పురీషము కేగు చాడ్పునన్.

భావము:
కామప్రవృత్తికి లోబడి ఇంద్రియాలను జయింపలేక పితృదేవతలను అనుదినం ఆరాధిస్తూ గృహాలలో పడి సంసార నిమగ్నులై జీవిస్తూ, హరిపరాఙ్ముఖులై, ధర్మార్థకామాలను మాత్రమే నమ్ముకొని వర్తిస్తారు. అటువంటి వారు త్రైవర్గిక పురుషులని పిలువబడతారు. శుభగుణవిశిష్టుడు, అద్వితీయ పరాక్రముడు అయిన త్రివిక్రముని భజిస్తూ ఆయన మహిమలనే మననం చేస్తూ ఆయన మధుర కథాసుధను తనివితీరా త్రాగడం ఉత్తమలక్షణం. అలాకాకుండా మరికొందరు ఊరబంది అవివేకంతో తీయతీయని నేతివంటకాలను కాలదన్ని మలభక్షణకై పరుగెత్తినట్లుగా చెడ్డకథలను వింటూ ఆనందిస్తూ ఉంటారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1022

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: