( రాజుల ఉత్పత్తి )
12-8-వ.
మఱియుఁ గణ్వవంశజుండగు సుశర్ముండను రా జుదయించిన వాని హింసించి తద్భృత్యుం డంధ్ర జాతీయుం డయిన వృషలుం, డధర్మమార్గవర్తి యై, వసుమతీచక్రం బవక్రుండై యేలు నంత వాని యనుజుండు కృష్ణుం డనువాఁడు రాజై నిలుచు; నా మహామూర్తికి శాంతకర్ణుండును, వానికి బౌర్ణమాసుండును, వానికి లంబోదరుండును, వానికి శిబిలకుండు, నతనికి మేఘస్వాతియు, వానికి దండమానుండును, వానికి హాలేయుం డగు నరిష్టకర్మయు, వానికి దిలకుండు, నతనికిఁ బురీషసేతుండును, వానికి సునందనుండును, నా రాజశేఖరునకు వృకుండును, వృకునకు జటాపుండును, జటాపునకు శివస్వాతియు, వానికిఁ నరిందముండు, నా భూమీశునకు గోమతియును, వానికిఁ బురీమంతుండును, నతనికి దేవశీర్షుండును, వానికి శివస్కందుండును, నతని కి యజ్ఞశీలుండు, నా భవ్యునకు శ్రుతస్కందుండు, వానికి యజ్ఞశ త్రుండు, వానికి విజయుం, డ వ్విజయునికిఁ జంద్రబీజుం డతనికి సులోమధియు నిట్లు పెక్కం డ్రుదయించి నన్నూటయేఁబదియాఱు హాయనంబులు ధాత్రిం బాలించెద; రంత నాభీరులేడ్వురు, గర్దభులు పదుండ్రు, గంక వంశజులు పదాఱుగురు, మేదినీభరంబు దాల్చి యుండెద; రటమీఁద యవను లెనమండ్రు, బర్బరులు పదునల్గురు, దేశాధీశులై యేలెదరు; మఱియుం బదుమువ్వురు గురుండులును, బదునొకండ్రు మౌనులును, వేయుందొమ్మన్నూటతొమ్మిది హాయనంబులు గర్వాంధులయి యేలెద; రటమీఁద నా మౌనవంశజు లగు పదునొకండ్రు త్రిశతయుతం బైన వత్సరంబులు మత్సరంబున నేలెద ; రా సమయంబునఁ, గైలికిలు లను యవనులు భూపతు లగుదు; రంత భూతనందుండు నవభంగిరుండు శిశునందుండుఁ దద్భ్రాతయగు యశోనందుండుఁ బ్రవీరకుండు వీరలు వీరులై షడుత్తరశత హాయనంబు లేలెద; రంత నా రాజులకుఁ బదుమువ్వురు కుమారు లుదయించి యందు నార్గురు బాహ్లికదేశాధిపతు లయ్యెదరు; కడమ యేడ్వురును గోసలాధిపతు లయ్యెద; రంత వైఢూర్య పతులు నిషధాధిపతులై యుండెదరు; పురంజయుండు మగధదేశాధిపతియై పుట్టి, పుళింద యదు మద్రదేశవాసు లగు హీనజాతి జనులు బ్రహ్మజ్ఞానహీనులై హరిభక్తి విరహితులై యుండ, వారికి ధర్మోపదేశంబు సేసి, నారాయణభక్తి నిత్యంబు నుండునట్లుగాఁ జేసి, బలపరాక్రమవంతు లైన క్షత్రియవంశంబు లడంచి, పద్మావతీనగర పరిపాలకుండై యాగంగా ప్రయాగ పర్యంతం బగు భూమినేలఁ గలండు; శూద్రప్రాయు లగు రాజులును, వ్రాత్యులును,బాషండులు నగు విప్రులును గలిగి సౌరాష్ట్రావంత్యాభీరార్భుద మాళవ దేశాధిపతు లయ్యెదరు, సింధుతీరంబులఁ జంద్రభాగా ప్రాంతంబులఁ గాశ్మీరమండలంబున మేధావిహీనులై మ్లేచ్ఛాకారు లగు రాజులు భూభాగం బేలుచు, ధర్మసత్యదయాహీనులై, క్రోధమాత్సర్యంబుల, స్త్రీ బాల గో ద్విజాతులఁ వధియింప రోయక, పరధన పరస్త్రీపరు లై, రజస్తమోగుణరతు లై, యల్పజీవు లై, యల్పబలు లై హరి చరణారవిందమకరంద రసాస్వాదులు గాక తమలో నన్నోన్య వైరానుబంధులై సంగ్రామరంగంబుల హతు లయ్యెద; రా సమయంబునఁ బ్రజలు తచ్చీల వేష భాషాదుల ననుసరించి యుండెదరు; కావున.
భావము:
అటుపిమ్మట, కణ్వవంశంలో సుశర్ముడనే రాజు పుడతాడు. కాని, అతని భృత్యుడు, ఆంధ్ర జాతీయుడు అయిన వృషలుడు అధర్మమార్గంలో అతనిని వధిస్తాడు. రాజ్యాన్ని చేపట్టి అవక్రవిక్రమంతో పరిపాలిస్తాడు. అతని పిమ్మట, అతని తమ్ముడు కృష్ణుడు రాజవుతాడు. తరువాత శాంతకర్ణుడు, పౌర్ణమాసుడు, లంబోదరుడు, శిబిలకుడు, మేఘస్వాతి, దండమానుడు, నాగలి పట్టేవాడైన అరిష్టకర్మ, తిలకుడు, పురీషసేతుడు, సునందనుడు, వృకుడు, జటాపుడు, శివస్వాతి, అరిందముడు, గోమతి, పురీమంతుడు, దేవశీర్షుడు, శివస్కంధుడు, యజ్ఞశీలుడు, శ్రుతస్కంధుడు, యజ్ఞశత్రుడు, విజయుడు, చంద్రబీజుడు, సులోమధి అనే రాజులు వంశపారంపర్యంగా వచ్చిన రాజ్యాన్ని క్రమంగా అనుభవిస్తారు. వారందరు కలిసి పరిపాలించే కాలం నాలుగువందలయేభైఆరు సంవత్సరములు.
ఆ తరువాత నాభీరవంశం వారు ఏడుగురు, గర్దభవంశం వారు పదిమంది, కంకవంశం వారు పదహారుమంది రాజ్యభారాన్ని ధరించి పరిపాలిస్తారు. అటు పిమ్మట ఎనిమిదిమంది యవనులు, పదునాలుగురు బర్బరులు ప్రభువులు అవుతారు. అటు తరువాత గురుండులు పదముగ్గురు, మౌనులు పదకొండుమంది ప్రభులు అవుతారు. గురుండులు గర్వంతో కన్నూమిన్నూ కానకుండా పంతొమ్మిదివందలతొమ్మిది ఏళ్ళు పరిపాలన సాగిస్తారు. అటు పిమ్మట మౌనవంశంలో పుట్టిన పదకొండుమంది మూడువందల సంవత్సరాలపాటు క్రోధబుద్ధితో పరిపాలన సాగిస్తారు. అదే సమయంలో కైలికిలులు అనే యవనులు భూపాలన చేస్తారు. ఆ తరువాత భూతనందుడు, నవభంగిరుడు, శిశునందుడు, అతని తమ్ముడు యశోనందుడు, ప్రవీరకుడు అనేవారు వీరులై నూటఆరు ఏళ్ళు పాలకులు అవుతారు. ఆ రాజుకు పదముగ్గురు కొడుకులు పుడతారు. వారిలో ఆరుగురు బాహ్లిక దేశానికి అధిపతులు అవుతారు. మిగిలిన ఏడుగురు కోసల దేశానికి అధిపతులు అవుతారు.
అపుడు వైడూర్యపతులు నిషధదేశానికి ఏలికలు అవుతారు. పురంజయుడు మగధదేశ ప్రభువుగా ప్రభవిస్తాడు. పుళిందులూ, యదువంశస్థులూ మద్రదేశీయులూ అయిన హీనజాతి జనులు బ్రహ్మజ్ఞాన హీనులూ హరిభక్తి విహీనులు కాగా వారికి ధర్మాన్ని ఉపదేశించి నారాయణుని పట్ల భక్తి తాత్పర్యాలు కలిగిస్తాడు. శక్తిశౌర్యసమన్వితులైన క్షత్రియుల వంశాలను తొక్కిపెట్టి పద్మావతీనగరం రాజధానిగా చేసుకుని గంగనుంచి ప్రయాగవరకూ ఉన్న భూమిని పరిపాలిస్తాడు.
శూద్రప్రాయులైన రాజులు, సంస్కారరహితులు, నాస్తికులు అయిన బ్రాహ్మణులు, సౌరాష్ట్రము, అవంతి, ఆభీరము, అర్భుదము, మాళవము అనే దేశాలకు ప్రభులు అవుతారు. సిందుతీరంలోను, చంద్రభాగ పరిసరాలలోను, కాశ్మీరదేశంలోను, మ్లేచ్ఛ రాజులు పరిపాలన చేస్తారు. వారికి తెలివితేటలు ఉండవు. ధర్మము, సత్యము, దయ ఉండవు. పెచ్చరిల్లిన క్రోధ మాత్సర్యాలతో స్త్రీలనూ బాలకులనూ గోవులనూ బ్రాహ్మణులనూ వధించడానికి సైతం వెనుతీయరు. పరధనాశక్తి, పరవనితాశక్తి కలిగి రజోగుణంలోనూ తమోగుణంలోనూ మునిగి అల్పాయువులు, అల్పబలులు అవుతారు. శ్రీవిష్ణు పాదపద్మ మకరందంలోని రుచి వారికి తెలియదు. ఒకరి పట్ల ఒకరు వైరాలు పెంచుకుని యుద్ధాలకు సిద్ధపడి ప్రాణాలు కోల్పోతారు. ఆ కాలంలోని ప్రజలు కూడ వారి వేషభాషలను శీలవృత్తులను అనుకరిస్తారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=2&padyam=8
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :