4-117-తే.
అట్టి దేవునిఁ ద్రిపుర సంహార కరునిఁ
జంద్రశేఖరు సద్గుణసాంద్రు నభవు
మనము రోషింపఁ జేసిన మంగళములఁ
బొంద వచ్చునె పద్మగర్భునకునైన?"
4-118-వ.
అని యి వ్విధంబున భయవిహ్వలలోచనలై పలుకుచున్న సమయంబున మహాత్ముండైన దక్షునకు భయావహంబులై సహస్ర సంఖ్యాతంబు లైన మహోత్పాతంబులు భూనభోంతరంబులఁ గానంబడుచుండె; ఆ సమయంబున రుద్రానుచరులు నానావిధాయుధంబులు ధరియించి కపిల పీత వర్ణంబులు గలిగి వామనాకారులు, మకరోదరాననులు నై యజ్ఞశాలాప్రదేశంబునం బరువులుపెట్టుచుఁ గదియం జనుదెంచి దక్షాధ్వర వాటంబులు విటతాటంబులు చేయుచుం, గొందఱు ప్రాగ్వంశంబును, గొందఱు పత్నీశాలయు, కొందఱు సదస్య శాలయుఁ, గొంద ఱాగ్నీధ్ర శాలయు, కొందఱు యజమాన శాలయుఁ, గొందఱు మహానస గృహంబును విధ్వంసంబులు గావించిరి; మఱియుఁ గొందఱు యజ్ఞపాత్రంబుల నగ్నులం జెఱచిరి; వెండియుఁ గొందఱు హోమాగ్ను లార్చిరి; పదంపడి కొందఱు హోమకుండంబుల యందు మూత్రంబులు విడిచిరి; కొంద ఱుత్తరవేదికా మేఖలలు ద్రెంచిరి; కొందఱు మునుల బాధించిరి; కొందఱు తత్పత్నుల వెఱపించిరి; మఱికొందఱు దేవతా నిరోధంబుఁ గావించిరి; అంత మణిమంతుండు భృగువును, వీరభద్రుండు దక్షునిఁ, జండీశుండు పూషుని, భగుని నందీశ్వరుండును బట్టిరి; ఇవ్విధంబున సదస్య దేవ ఋత్విఙ్నికాయంబుల శిలల ఱువ్వియు, జానువులఁ బొడిచియు, నఱచేతుల నడచియు, గుల్ఫంబులఁ బొడిచియు వివిధ బాధలు పఱచిన వారు కాందిశీకు లై యెక్కడెక్క డేనిం జనిరి; మఱియును.
టీకా:
అట్టి = అటువంటి; దేవుని = దేవుని; త్రిపురసంహారకుని = శివుని {త్రిపురసంహారకుడు - త్రిపురములను కూల్చివేసినవాడు, శివుడు}; చంద్రశేఖరు = శివుని {చంద్రశేఖరుడు - చంద్రవంక సిగదండగ కలవాడు, శివుడు}; సత్ = మంచి; గుణ = గుణములు; సాంద్రున్ = మిక్కిలిగా కలవాని; అభవున్ = శివుని {అభవుడు - పుట్టుకలేనివాడు, శివుడు}; మనమున్ = మానసమును; రోషింపన్ = కోపింపను; చేసిన = చేసినచో; మంగళములన్ = శుభములను; పొంద = పొందుట; వచ్చునె = శక్యమా ఏమి; పద్మగర్భున్ = బ్రహ్మదేవుని; కున్ = కి; ఐనన్ = అయినప్పటికిని. అని = అని; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; భయ = భయముచే; విహ్వల = చలిస్తున్న; లోచనులు = కన్నులు కలవారు; ఐ = అయ్యి; పలుకుచున్ = పలుకుతూ; ఉన్న = ఉన్నట్టి; సమయంబునన్ = సమయములో; మహాత్ముండు = గొప్పవాడు; ఐన = అయినట్టి; దక్షున్ = దక్షుని; కున్ = కి; భయ = భయమును; ఆవహంబులు = కలిగించునవి; ఐ = అయ్యి; సహస్ర = వేనవేల; సంఖ్యాతంబులు = సంఖ్యలలో ఉన్నవి; ఐన = అయిన; మహా = గొప్ప; ఉత్పాతంబులు = అపశకునములు; భూ = భూమి; నభస్ = ఆకాశముల; అంతరంబులన్ = లోపల; కానంబడుచున్ = కనబడుతూ; ఉండెన్ = ఉండెను; ఆ = ఆ; సమయంబునన్ = సమయములో; రుద్ర = రుద్రుని యొక్క; అనుచరులు = అనుచరులు; నానవిధ = రకరకములైన; ఆయుధంబులున్ = ఆయుధములను; ధరియించి = ధరించి; కపిల = గోరోజనమువంటి చామనఛాయ; పీత = పసుపు; వర్ణంబులు = రంగులు; కలిగి = కలిగి ఉండు; వామన = పొట్టి; ఆకారులు = ఆకారములు కలవారు; మకర = మొసలి వంటి; ఉదర = పొట్ట; ఆననులు = ముఖములు కలవారు; ఐ = అయ్యి; యజ్ఞశాలా = యజ్ఞశాలలు ఉన్న; ప్రదేశంబునన్ = స్థలములలో; పరువులు = పరుగులు; పెట్టుచు = పెడుతూ; కదియన్ = దగ్గరకు; చనుదెంచి = చేరి; దక్షా = దక్షుని; అధ్వర = యజ్ఞము యొక్క; వాటంబులు = వాటికలు; విటతాటంబులు = చెల్లాచెదురు; చేయుచున్ = చేస్తూ; కొందఱు = కొంతమంది; ప్రాగ్వంశంబు = ప్రాగ్వంశమును {ప్రాగ్వంశము - యజ్ఞశాల ప్రాంత గృహము}; కొందఱు = కొంతమంది; పత్నీశాలయు = పత్నీశాలను {పత్నీశాల - యజమాని భార్య యొక్క శాల}; కొందఱు = కొంతమంది; సదస్యశాలయున్ = సభాస్థలి {సదస్యశాల - సభాస్థలిగల శాల}; కొందఱు = కొంతమంది; అగ్నీధ్రశాలయున్ = అగ్నీధ్రశాల {అగ్నీధ్రశాల -అగ్నిని ధరించు ఋత్విక్కు యొక్క శాల}; కొందఱు = కొంతమంది; యజమానశాలయున్ = యజమానశాల {యజమానశాల - యజమాని (యజ్ఞమును చేయువాని) యొక్క శాల}; కొందఱు = కొంతమంది; మహానసగృహంబును = వంటశాల; విధ్వంసంబు = నాశనము; కావించిరి = చేసిరి; మఱియున్ = ఇంకను; కొందఱు = కొంతమంది; యజ్ఞపాత్రంబులన్ = యజ్ఞపాత్రలను; అగ్నులన్ = అగ్నికుండములను; చెఱచిరి = పాడుచేసిరి; వెండియున్ = అటుతరువాత; కొందఱు = కొంతమంది; హోమ = హోమములందలి; అగ్నులు = అగ్నులను; ఆర్పిరి = ఆర్పివేసారు; పదంపడి = అటుతరువాత; కొందఱు = కొంతమంది; హోమకుండంబులన్ = హోమకుండముల; అందున్ = లో; మూత్రంబులు = మూత్రములు, నీరుడులు; విడిచిరి = వదిలిరి; కొందఱు = కొంతమంది; ఉత్తర = ఉత్తరపు దిక్కునకల; వేదికా = వేదికలయందలి; మేఖలలు = తోరణములు; త్రెంచిరి = తెంపివేసారు; కొందఱు = కొంతమంది; మునుల = మునులను; బాధించిరి = బాధపెట్టిరి; కొందఱు = కొంతమంది; తత్ = వారి; పత్నులన్ = భార్యలను; వెఱపించిరి = బెదిరించిరి; మఱికొందఱు = మరికొంతమంది; దేవతా = దేవతలను; నిరోధంబున్ = అడ్డుపెట్టుటలు; కావించిరి = చేసిరి; అంతన్ = అంతట; మణిమంతుండు = మణిమంతుడు; భృగువును = భృగువును; వీరభద్రుండు = వీరభద్రుడు; దక్షునిన్ = దక్షుని; చండీశుండు = చండీశుడు; పూషుని = పూషుని; భగుని = భగుని; నందీశ్వరుండును = నందీశ్వరుడును; పట్టిరి = పట్టుకొనిరి; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; సదస్య = సభ్యుల; దేవ = దేవతల; ఋత్విక్ = ఋత్విక్కుల; నికాయంబులన్ = సమూహములను; శిలల్ = రాళ్ళు; ఱువ్వియున్ = విసిరి; జానువుల్ = మోకాళ్ళ; పొడిచియున్ = పొడిచి; అఱచేతులన్ = అరచేతుల; అడచియున్ = నలగ్గొట్టి; గుల్ఫంబులన్ = చీలమండల; పొడిచియున్ = పొడిచి; వివిధ = రకరకములైన; బాధలు = బాధలు; పఱచిన = పెట్టిన; వారు = వారు; కాందిశీకులు = భయముచేత పారిపోవువారు; ఐ = అయ్యి; ఎక్కడెక్కడేని = ఎక్కెక్కడికో; చనిరి = వెళ్ళిపోయిరి; మఱియును = ఇంకను.
భావము:
అటువంటి దేవదేవునికి, త్రిపురసంహారికి, చంద్రచూడునకు, సకల సద్గుణ విభవునకు, అభవుని మనస్సుకు ఆగ్రహం తెప్పించి బ్రహ్మదేవుడైనా శుభాలను పొందగలడా?” అని ఈ విధంగా భయంతో వెర్రిచూపులు చూస్తూ పలుకుతుండగా గొప్పవాడైన దక్షునకు భయాన్ని కలిగిస్తూ వేలకొలది అపశకునాలు భూమిపైనా ఆకాశంలోనూ కనిపించసాగాయి. ఆ సమయంలో గోరోజనం వంటి రంగు కలవారు, పసుపుపచ్చని రంగు కలవారు, పొట్టివారు, మొసలిపొట్ట వంటి ముఖాలు కలవారు అయిన ప్రమథగణాలు రకరకాలైన ఆయుధాలను ధరించి పరుగున వచ్చి దక్షుని యజ్ఞశాలను సమీపించి, యజ్ఞవాటికలను చెల్లాచెదరు చేశారు. కొందరు ప్రాగ్వంశాన్ని (యజ్ఞశాల ప్రాంత గృహాన్ని), కొందరు పత్నీశాలను (యజ్ఞ యజమాని భార్య ఉండే శాలను), కొందరు సదస్యశాలను (సభాస్థలి శాలను), కొందరు అగ్నీధ్రశాలను (అగ్నిని ధరంచే ఋత్విక్కుల శాలను), కొందరు యజమానశాలను (యజ్ఞ యజమాని అయిన దక్షుని శాలను), కొందరు వంటశాలను నాశనం చేశారు. మరికొందరు యజ్ఞపాత్రలను, అగ్నిగుండాలను ధ్వంసం చేశారు. ఇంకా కొందరు హోమాగ్నులను ఆర్పివేశారు. ఆ తరువాత కొందరు హోమకుండాలలో మూత్రవిసర్జన చేశారు. కొందరు ఉత్తర దిక్కున ఉన్న వేదికయొక్క తోరణాలను త్రెంచివేశారు. కొందరు మునులను బాధించారు. కొందరు వారి భార్యలను భయపెట్టారు. మరికొందరు దేవతలను అడ్డుకున్నారు. అప్పుడు మణిమంతుడు భృగువును, వీరభద్రుడు దక్షుని, చండీశుడు పూషుని, నందీశ్వరుడు భగుని పట్టుకొన్నారు. ఈ విధంగా సదస్యులైన దేవతల, ఋత్విక్కుల సమూహాన్ని రాళ్ళతో కొట్టి, మోకాళ్ళతో పొడిచి రకరకాల బాధలు పెట్టగా వాళ్ళంతా కాందిశీకులై ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. ఇంకా...
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=7&Padyam=118
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :