Monday, October 27, 2014

తెలుగుభాగవత తెనెసోనలు 10.1-307-క. - బాలురకుఁ బాలు లేవని

10.1-307-క.
బాలురకుఁ బాలు లే వని
బాలింతలు మొఱలుపెట్టఁ కపక నగి యీ
బాలుం డాలము చేయుచు
నాకుఁ గ్రేపులను విడిచె నంభోజాక్షీ!
            గోపికలు బాలకృష్ణుని అల్లరి యశోదకు ఇలా పిర్యాదు చేస్తున్నారు. కమలలాంటి కన్నులున్న తల్లీ. అసలే పిల్లలకి తాగటానికి పాలు సరిపోటం లేదని పసిపిల్లల తల్లులు గోలపెడుతుంటే, నీ కొడుకు పకపక నవ్వుతూ, వెక్కిరిస్తూ ఆవులకు లేగదూడల తాళ్ళువిప్పి వదిలేస్తున్నాడు చూడమ్మ.
            జ్ఞానముచే కలిగిన దృష్టి కలామె అంభోజాక్షి. గోపికలు అంటే ముముక్షువులు. బాలు రంటే అజ్ఞానులు. బాలింతలు అంటే వారిని పోషించే జ్ఞానప్రదాతలు. వారు అజ్ఞానులకి సరిపడినంత మోక్షం అనే పాలు అందటం లేదని తపిస్తున్నారట. ఎందుకంటే, బలం అంటే శక్తికి కారణభూతుడైన ఈ బాలుడు వేదాలు అనే ఆవులకి మోక్షాపేక్ష గల వారందరిని వదిలేస్తున్నా డట.
10.1-307-ka.
baalurakuM~ baalu lE vani
baaliMtalu moRralupeTTaM~ bakapaka nagi yee
baaluM Daalamu chEyuchu
naalakuM~ grEpulanu viDiche naMbhOjaakShee!
            బాలురకుఁ బాలు లేవని - బాలురు = పిల్లల; కున్ = కి; పాలు = తాగుటకు పాలు; లేవు = లేవు; అని = అని; బాలింతలు = పసిబిడ్డల తల్లులు; మొఱలుపెట్టఁ బకపక - మొఱలుపెట్టన్ = మొత్తుకొనగా; పకపక = పకపక అని; నగి = నవ్వి; యీ - = ; బాలుం డాలము - బాలుండు = పిల్లవాడు; ఆలమున్ = అల్లరిపెట్టుట, పరిహాసము; చేయుచు నాలకుఁ గ్రేపులను - చేయుచున్ = చేస్తూ; ఆల = ఆవుల; కున్ = కు; క్రేపులను = దూడలను; విడిచె నంభోజాక్షీ - విడిచెన్ = వదలిపెట్టెను; అంభోజాక్షీ = సుందరీ {అంబోజాక్షినీటిలో పుట్టిన పద్మాల్లాంటి కన్ను లున్నామె, స్త్రీ}.
||సర్వేజనా సుఖినోభవంతు||


No comments: