Thursday, July 28, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౯౭(597)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1240-ఆ.
కడఁగి కొలువ శీఘ్రకాలంబులోనన
యిష్టమైన వరము లిచ్చునట్టి
దైవ మెవ్వఁ డనిన దానవుఁ గనుఁగొని
మునివరుండు పలికె ముదముతోడ.
10.2-1241-వ.
“వినుము; దుర్గుణసుగుణంబులలో నొక్కటి యెచ్చటం గలుగు నచ్చట నాక్షణంబ కోపప్రసాదఫలంబులు సూపువాఁ డమ్మువ్వుర యందు ఫాలలోచనుఁ డివ్విధంబుఁ దెలిసినవారై బాణాసుర దశకంధరులు సమగ్ర భక్తియుక్తులై సేవించి యసమానసామ్రాజ్య వైభవంబుల నొంది ప్రసిద్ధులై; రట్లుగాన నీవు నమ్మహాత్ముని సేవింపు; మతనివలన నభిమతఫలంబులు వేగంబ ప్రాప్తం బయ్యెడి” నని చెప్పిన నతం డా క్షణంబ.

భావము:
తమను సేవించే భక్తులకు ఆ త్రిమూర్తులలో ఎవరు శీఘ్రంగా కోరిన వరాలిస్తారు.” అలా అడిగిన వృకాసురుని ప్రశ్నకు నారదుడు సంతోషంగా ఇలా సమాధానం చెప్పాడు. “అయితే శ్రద్ధగా విను. దుర్గుణాలు కలవారిమీద ఆగ్రహము చూపాలన్నా, సుగుణవంతులమీద అనుగ్రహము చూపాలన్నా, వెనువెంటనే చూపే దైవం త్రిమూర్తులలో ఒక్క పరమశివుడే. ఈ సంగతి తెలుసుకున్న బాణసురుడు, రావణాసురుడు మున్నగు దానవులు పరమశివుడిని భక్తితో సేవించి మహా సామ్రాజ్య వైభవాలను పొందారు. కనుక, నీవు కూడ శివుడిని భక్తితో పూజించు. నీ అభిమతం వేగంగా ఈడేరుతుంది.” అని చెప్పాడు. వెంటనే....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1241

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౫౯౬(596)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1238-క.
శకుని యను దైత్యు తనయుఁడు
వృకుఁ డనువాఁ డొకఁడు దుర్వివేకుఁడు సుజన
ప్రకరముల నలఁపఁ దెరువున
నొకనాఁ డొదిగుండి దివ్యయోగిం గడఁకన్.
10.2-1238-వ.
కనుంగొని.
10.2-1239-క.
కరములు ముకుళించి "మునీ
శ్వర! నారద! లలితధీవిశారద! నన్నుం
గరుణించి యాన తీ శుభ
కరు లగు హరి హర హిరణ్యగర్భులలోనన్

భావము:
శకుని అనే రాక్షసుని కొడుకు వృకాసురుడు. వాడు దుర్మార్గుడు. సుజనులను దారికాచి బాధించేవాడు. అలా ఒకనాడు రాక్షసుడు ఒక దారిలో దాగి ఉండి అటు వెళ్తున్న నారద మహర్షిని చూసాడు. అలా ఆ మార్గమున వస్తున్న నారదుడిని చూసి వృకాసురుడు నారదమహర్షికి చేతులు జోడించి నమస్కారం చేసి ఇలా అడిగాడు “ఓ నారద మహర్షి! నీవు అన్నీ తెలిసిన మహా ఙ్ఞానివి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందున ....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1239

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, July 19, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౯౫(595)

( విష్ణుసేవా ప్రాశస్త్యంబు ) 

10.2-1235-క.
సేవింప వారు దమకుం
గావించిన శోభనములు గని నిజములుగా
భావించి వారి మఱతురు
భావములఁ గృతఘ్నవృత్తిపని తమ పనిగన్.
10.2-1236-క.
మెలఁగుచు నుందురు దీనికిఁ
గలదొక యితిహాస మిపుడు గైకొని నీకుం
దెలియఁగఁ జెప్పెద దానన
యలవడు నీ వడుగు ప్రశ్న కగు నుత్తరమున్.

భావము:
అలా ఆరాధించి ఆ దేవతలు అనుగ్రహించిన ఐశ్వర్యాలను సత్యమైనవని అనుకుంటారు. పిమ్మట కృతఘ్నులై వారు తమకు శుభాలను అనుగ్రహించిన ఆ దేవతలనే మరచిపోతారు. దీనికి తార్కాణంగా ఒక కథ ఉంది. అది నీకు చెప్తాను. నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం దానితో తెలుస్తుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=84&Padyam=1236

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, July 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౯౪(594)

( విష్ణుసేవా ప్రాశస్త్యంబు ) 

10.2-1233-ఉ.
నారదసంయమీంద్రు వలనన్ వినుచుండి యనంతరంబ పం
కేరుహనాభుఁ జూచి యడిగెం దగ నిప్పుడు నీవు నన్ను నిం
డారిన భక్తిమై నడిగి నట్ల యతండును మందహాస వి
స్ఫార కపోలుఁడై పలికెఁ బాండుతనూభవుతోడఁ జెచ్చెరన్.
10.2-1234-సీ.
"వసుమతీనాథ! యెవ్వనిమీఁద నా కను-
  గ్రహ బుద్ధి వొడము నా ఘనుని విత్త
మంతయుఁ గ్రమమున నపహరించిన వాఁడు-
  ధనహీనుఁ డగుచు సంతాప మంద
విడుతురు బంధు ల వ్విధమున నొందిలి-
  యై చేయునదిలేక యఖిలకార్య
భారంబు లుడిగి మద్భక్తులతో మైత్రి-
  నెఱపుచు విజ్ఞాననిరతుఁ డగుచు
10.2-1234.1-తే.
బిదప వాఁ డవ్యయానందపదము నాత్మ
నెఱిఁగి సారూప్యసంప్రాప్తి నెలమి నొందుఁ
గాన మత్సేవ మిగుల దుష్కర మటంచు
వదలి భజియింతు రితరదేవతల నెపుడు.

భావము:
అలా నారదుని వలన పుణ్యకథా శ్రవణానంతరం, నన్ను ఎంతో ఆసక్తితో నీవడిగిన ఇదే ప్రశ్నను, పాండురాజ పుత్రుడు ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడిగాడు. అంతట మందహాస సుందర వదనారవిందుడై కృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. “మహారాజా! ధర్మరాజా! ఎవరిపై నాకు అనుగ్రహం కలుగుతుందో ఆ ఉత్తముడి సంపదలు సమస్తము నేను హరిస్తాను. అతడు ధనహీనుడై దుఃఖిస్తాడు. బంధువులు అతడిని వదలివేస్తారు. అతడు నిస్సహాయుడై అన్నింటినీ త్యజించి నా భక్తులతో స్నేహం చేస్తాడు. క్రమంగా విజ్ఞానాన్ని పొంది, తుదకు అవ్యయానందచిత్తుడై, సారూప్యాన్ని పొందుతాడు. అందుచేత కొందరు నన్ను సేవించటం చాలా కష్టమని అనుకుని ఇతర దేవతలను ఆరాధిస్తారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1234

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, July 17, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౯౩(593)

( విష్ణుసేవా ప్రాశస్త్యంబు ) 

10.2-1231-మ.
“మునినాథోత్తమ! దేవమానవులలో ముక్కంటి సేవించు వా
రనయంబున్ బహువస్తుసంపదల సౌఖ్యానందులై యుండ న
వ్వనజాతాక్షు రమామనోవిభుని శశ్వద్భక్తి సేవించు స
న్మునివర్యుల్‌ గడుఁ బేద లౌటకు గతంబున్ నా కెఱింగింపవే.”
10.2-1232-సీ.
నావుడు శుకయోగి నరనాథుఁ గనుఁగొని-
  విను మెఱింగింతుఁ దద్విధము దెలియ
"ఘనశక్తిసహితుండు కాలకంధరుఁడు దా-
  వినుతగుణత్రయాన్వితుఁడు గాన
రాగాదియుక్తమై రాజిల్లు సంపద-
  లాతనిఁ గొలుచు వారందు చుందు;
రచ్యుతుఁ, బరము, ననంతు, గుణాతీతుఁ,-
  బురుషోత్తముని, నాదిపురుషు, ననఘు,
10.2-1232.1-తే.
నర్థి భజియించువారు రాగాది రహితు
లగుచు దీపింతు రెంతయు ననఘచరిత!
ధర్మనందనుఁ డశ్వమేధంబు సేసి
పిదప సాత్త్విక కథనముల్‌ ప్రీతితోడ.

భావము:
“ఓ శుక మహర్షి! శివుడిని సేవించే దేవతలు, మానవులు సుఖసంపదలతో జీవిస్తారు; విష్ణువును నిండు భక్తితో సేవించే మునీశ్వరులు నిరుపేదలుగా జీవిస్తారు; దీనికి కారణం ఏమిటో వివరించు.” అలా అడిగిన పరీక్షిత్తుతో శుకమహర్షి ఇలా చెప్పసాగాడు. “అలా ఉండటానికి కారణం చెప్తాను. ఓ పుణ్యపురుషుడా! శ్రద్ధగా విను. నీలకంఠుడు అయిన శివుడు మహాశక్తి సంపన్నుడు. సత్త్వ రజస్తమో గుణ సమేతుడు. కనుక పరమశివుడిని సేవించేవారు ఐశ్వర్యవంతులు అవుతారు. అచ్యుతుడు, పరమాత్మ, అనంతుడు, పురుషోత్తముడు, ఆదిపురుషుడు అయిన శ్రీహరి త్రిగుణాతీతుడు. అతడిని కొలిచేవారు కూడా రాగరహితులే. వారు సంపదలను కోరరు. ధర్మరాజు రాజసూయయాగం చేసిన తర్వాత కోరి నారదాది మహర్షుల వలన ఎన్నో పుణ్యకధలు విన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1232

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, July 16, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౯౨(592)

( శ్రుతి గీతలు ) 

10.2-1230-వ.
సత్తైన ప్రకృతివలన నుత్పన్నంబైన యీజగత్తు సత్తు గావలయు; నది యెట్లనినం గనకోత్పన్నంబులైన భూషణంబులు కనకమయంబులయి కానంబడు చందంబున నని సాంఖ్యుండు వలికిన విని యద్వైతవాది యిట్లను; నెయ్యది యుత్పన్నంబు గాదది సత్తును గా; దను వ్యతిరేక వ్యాప్తి నియమంబు నిత్యసత్యంబైన బ్రహ్మంబునందుఁ దర్కహతంబగుం గావునం బ్రపంచంబు మిథ్య యని నిరూపించిననా ప్రపంచంబు బ్రహ్మవిశేషణంబై కార్యకారణావస్థలు గలిగియున్న యంతమాత్రంబున మిథ్యగానేర; దా ప్రపంచంబునకుఁ గార్యకారణావస్థలు నిత్యంబులు గావున నవస్థాద్వయ యుక్తంబయిన ప్రపంచంబు నిత్యంబనిన వెండియు నద్వైతి యిట్లను; బహుగ్రంథ ప్రతిపాదితం బయిన జగన్మిథ్యాత్వంబు లేమి యెట్లనిన నదియునుం గర్మవశులైన జడుల నవిద్యా ప్రతిపాదకం బైన కుతర్క సమేతం బైన భారతి యంధపరంపరా వ్యవహారంబునం జేసి భ్రమియింపఁజేయుఁ; గారణావస్థలయందును బ్రహ్మ విశేషణంబయిన సూక్ష్మరూపంబునం బ్రపంచంబు సత్తై యుండు; సత్యంబు బాధాయోగ్యంబు గావున నీకు శేషంబయి యుండుఁ గావున నీవు దేహగతుండైన దేహియందు నంతర్యామివయ్యుం గర్మఫలంబులం బొరయక కర్మఫలభోక్తయైన జీవునకు సాక్షిభూతంబవై యుందు; వట్టి నిన్ను నజ్ఞులైన మానవులు నిజకంఠ లగ్నంబయిన కంఠికామణి నిత్యసన్నిహితంబై వెలుంగుచుండినను గానకవర్తించు తెఱంగునఁ దమహృదయపద్మమధ్యంబున ననంతతేజోవిరాజమానుండవై ప్రకాశించు నిన్నుం దెలియలేరు; సకల బ్రహ్మాండనాయకుండవైన నీయందు శ్రుతులు ముఖ్య వృత్తిం బ్రవర్తించు"నని శ్రుత్యధిదేవతలు నారాయణు నభినందించిన తెఱంగున సనందనుండు మహర్షుల కెఱింగించిన ప్రకారం బని నారాయణర్షి నారదునకుం జెప్పిన నమ్మహాత్ముండు మజ్జనకుండైన వేదవ్యాసమునీంద్రునకు నుపన్యసించె; నయ్యర్థంబు నతండు నాకుం జెప్పిన విధంబున నీకుం జెప్పితి; నీ యుపాఖ్యానంబు సకల వేదశాస్త్ర పురాణేతిహాససారం; బుపనిషత్తుల్యంబు; దీనిం బఠించువారును వినువారును విగతకల్మషులై యిహపర సౌఖ్యంబుల నొంది వర్తింతు;” రని చెప్పిన శుకయోగీంద్రునకు రాజేంద్రుం డిట్లనియె.

భావము:
సాంఖ్యులు “బంగారంతో చేసిన నగలు సర్వం బంగార మయములే కదా, అలాగే సత్యమైన ప్రకృతి నుండి జనించినది కావున ఈ జగత్తు సత్యమైనదే” అంటారు. అద్వైతవాది “స్వాయంభువమైన సర్వం సత్యం కానేరదు అనే వ్యతిరేక సిద్ధాంతం ప్రకారం, నిత్యసత్యమైన బ్రహ్మము నందు సకల జగత్తు ధర్మహతము అగును కావున ప్రపంచం మిథ్య మాత్రమే” అంటారు. ద్వైతులు “జగత్తు బ్రహ్మవిశేషణం అయి కార్యకారణ అవస్థలు కలిగి ఉన్నంత మాత్రం చేత మిథ్య అనలేము, కార్యకారణావస్థలు అనే అవస్థా ద్వయంతో కూడి ఉన్న లోకం సమస్తం సత్యమైనదే” అంటారు. అద్వైతసిద్ధాంతులు “ఎన్నో గ్రంథాలలో ప్రతిపాదించబడిన “జగన్మిథ్య” అనే సూత్రం తప్పు అని ఎలా అనగలము అంటే. కర్మవశులైన జడస్వభావులు చేసే అవిద్యా ప్రతిపాదికములు అయిన కుతర్కముల వలె గ్రుడ్డి పరంపరాగత వ్యవహారముల వలన భ్రమింప చేస్తున్నాయి. కారణావస్థ అందు బ్రహ్మమునకు విశేషణములై, సూక్ష రూపంలో జగత్తు సత్యమే అయి ఉంటుంది. అసత్తైన కారణంగా పరబ్రహ్మము అయిన నీకు శేషము అయి ఉంటుంది” అంటారు. కావున, సమస్త శరీరధారులలో అంతర్యామివై ఉండే నిన్ను కర్మఫలాలు సోకవు. కర్మఫలభోక్తలు అయిన జీవునకు సాక్షీభూతుడవై ఉంటావు. అజ్ఞానులు తమ కంఠమందు ప్రకాశించే రత్నాన్ని ఎలా తెలియలేరో అలా, తమ హృదయపద్మాల్లో మహాతేజంతో ప్రకాశించే నిన్ను తెలుసుకోలేరు. సకల బ్రహ్మాండానికి నాయకుడవైన నీలో వేదాలు వర్తిస్తుంటాయి. అని వేదాధిదేవతలు నారాయణుని స్తుతించిన ఈ విధం అంతా సనందనుడు మహర్షులకు తెలిపాడు. దానిని నారాయణముని నారదునికి చెప్పాడు. నారదుడు నా తండ్రి అయిన వేదవ్యాసునికి వివరించాడు. ఆ మహానుభావుడు నాకు చెప్పారు. ఆదే విధంగా దానిని నేను సవిస్తరంగా నీకు చెప్పాను. ఈ “శృతిగీతములు” అని ప్రసిద్ధము అయిన నారాయణోపాఖ్యానం సకల వేద, శాస్త్ర, పురాణ, ఇతిహాసాల సారం. ఉపనిషత్తులకు సమానం. దీనిని పఠించినా విన్నా పాపాలు నశించిపోతాయి. ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి.” అని శుకుడు చెప్పగా పరీక్షిత్తు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1230

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, July 15, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౯౧(591)

( శ్రుతి గీతలు ) 

10.2-1229-సీ.
జగతిపై బహుతీర్థ సదనంబు లనఁ గల్గి-
  పుణ్యానువర్తన స్ఫురితు లగుచుఁ
బాటించి నీ యందు బద్ధమత్సరములు-
  లేక భక్తామరానోకహంబ
వగు భవత్పాదాబ్జయుగళంబు సేవించి-
  భవపాశముల నెల్లఁ బాఱఁదోలి
సమమతులై యదృచ్ఛాలాభ తుష మేరు-
  సమముగాఁ గైకొని సాధు లగుచుఁ
10.2-1229.1-తే.
బాదతీర్థంబు గల మహాభాగవత జ
నోత్తమోత్తము లైనట్టి యోగివరుల
వార కెప్పుడు సేవించువాఁడు వొందుఁ
బ్రవిమలానందమయ మోక్షపదము మఱియు.

భావము:
భాగవతోత్తములు లోకానికే మహాతీర్థములు. అట్టి పుణ్యవర్తన మూర్తులు మాత్సర్యాది విముక్తులై, భక్తులపాలిటి కల్పవృక్షమైన నిన్ను నిరంతరం సేవిస్తుంటారు. భవబంధాలనుంచి విముక్తులై సమచిత్తులై సదా సంతుష్ట మనస్కులై పరమ సాధు స్వభావులు అయి ఉంటారు. వారి పాదములే పుణ్యతీర్థములు. అట్టి పరమభాగవతులను భజించేవాడు ఆనందమయమైన మోక్షసామ్రాజ్య పదవికి యోగ్యుడు అవుతాడు. అంతేకాకుండా....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1229

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, July 14, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౯౦(590)

( శ్రుతి గీతలు ) 

10.2-1226-చ.
అనఘ! జితేంద్రియస్ఫురణు లయ్యును జంచలమైన మానసం
బను తురగంబు బోధమహితాత్మ వివేకపు నూలి త్రాట న
ల్లన గుదియంగఁ బట్టను దలంచుచు ముక్తి కుపాయలాభ మే
యనువును లేమికిన్ వగల నందెడు నాత్మలువో తలంపఁగన్.
10.2-1227-చ.
గురు పదపంకజాతములు గొల్వని వారలువో మహాబ్ధి ని
స్తరణకుఁ గర్ణధారరహితంబగు నావను సంగ్రహించు బే
హరి గతి భూరి దుస్తర భవాంబుధిలోన మునుంగుచుందు రం
బురుహదళాక్ష! నీవు పరిపూర్ణుఁడవై తనరారఁగా నొగిన్.

భావము:
మహానుభావా! పుణ్యరూపా! జితేంద్రియత సాధించిన వారు కూడా చంచలమైన మనస్సు అనే గుఱ్ఱాన్ని నిగ్రహించుకోలేరు; దానిని ఙ్ఞానము, గొప్పదనము, వివేకములు అనే తాళ్ళతో నియంత్రించగలం అని భావిస్తారు; ముక్తి పొందే ఉపాయం తెలియలేక విచారగ్రస్తులు అవుతారు. పద్మముల వంటి కన్నులు గల మహాత్మా! గురుపాదపద్మాల్ని సేవించనివారు నావికుడు లేని నావ ఎక్కి సముద్రం దాటాలి అని ప్రయత్నించే వ్యాపారి వలె జనన మరణ పరంపరలనే దాటరాని మహాసముద్రంలో మునిగిపోతారు; వారు పరిపూర్ణుడవైన నిన్ను తెలుసుకొనలేరు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1227

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, July 12, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౮౯(589)

( శ్రుతి గీతలు ) 

10.2-1224-క.
మదిఁదల పోయఁగ జల బు
ద్బుదములు ధరఁ బుట్టి పొలియు పోలిక గల యీ
త్రిదశాది దేహములలో
వదలక వర్తించు నాత్మవర్గము నోలిన్.
10.2-1225-ఆ.
ప్రళయవేళ నీవు భరియింతు వంతకుఁ
గారణంబ వగుటఁ గమలనాభ!
భక్తపారిజాత! భవభూరితిమిరది
నేశ! దుష్టదైత్యనాశ! కృష్ణ!

భావము:
బుద్ధిపూర్వకంగా ఆలోచించి చూస్తే, నీళ్ళల్లో బుడగలు పుట్టి నశించే విధంగా దేవతాదుల దేహాల్లో విడువక ప్రవర్తిస్తూ ఉంటారు ఈ సకల ఆత్మలు. శ్రీకృష్ణా! భక్తులపాలిటి పారిజాతమ! భవబంధాలను విదూర! దుష్టశిక్షక! సమస్తమునకు కారణభూతుడవైన నీవు, అటువంటి శరీరాల్లో అంతరాత్మవై వర్తించి, ప్రళయ కాలంలో వాటిని ఆ సకలాత్మలను అన్నింటిని నీలో లీనం చేసుకుంటావు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1225

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, July 11, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౮౮(588)

( శ్రుతి గీతలు ) 

10.2-1223-వ.
దేవా! కర్మమూలంబు లయిన పాణి పాదంబులు లేనివాఁడవయ్యును స్వతంత్రుఁడవు గావున బ్రహ్మాదులు భవత్పరతంత్రులై యుండుదురు; స్థిర చర రూపంబులుగల చేతనకోటికి నీవు సర్వవిధనియంతవు; గావున నీ కృపావలోకనంబుగల వారికి మోక్షంబు కరస్థితంబై యుండు; భవత్కృపావలోకనంబు లేని దుష్టాత్ములు దుర్గతిం గూలుదు; రట్టి జీవులు దేవతిర్మఙ్మనుష్యస్థావ రాది శరీరంబులు సొచ్చి యణురూపులై యుందు; రందును నీ వంతరాత్మ వగుచు నుందువు; మఱియును.

భావము:
ఓ దేవాదిదేవా! పాణి పాదములు కర్మ మూలములు. అట్టివి లేని నిర్వికారుడవు సర్వస్వతంత్రుడవు అయిన నీకు బ్రహ్మాదులు వశులు అయి ఉంటారు. ఈ చరాచర ప్రపంచము సమస్తానికి నీవే ప్రభువవు, నియామకుడవు. కనుక నీ కృపాపాత్రులకు మోక్షం కరతలామలకము అవుతుంది. నీ దయకు పాత్రులు కాని దుష్టాత్ములు దుర్గతిపాలై బహువిధ దేవ, నర, జంతు, వృక్షాది శరీరాలు ధరిస్తూ అణురూపులు ఔతూ ఉంటారు. అలాంటివారిలోనూ అంతరాత్మవై నీవు ఉంటావు. అంతే కాకుండా......

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1223

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Sunday, July 10, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౮౭(587)

( శ్రుతి గీతలు ) 

10.2-1221-మ.
వనజాతాక్ష! భవత్పదాబ్జయుగ సేవాసక్తు లైనట్టి య
జ్జనముల్‌ మృత్యుశిరంబుఁదన్ని ఘనసంసారాంబుధిన్ దాఁటి పా
వనులై లోకములుం బవిత్రములుగా వర్తించుచున్ నిత్య శో
భనమై యొప్పెడి ముక్తిఁ బొందుదురు శుంభద్వైభవోపేతులై.
10.2-1222-మ.
మిము సద్భక్తి భజింపనొల్ల కిల దుర్మేధం బ్రవర్తించు నీ
చ మతివ్రాతము నేర్పునం బసులఁ బాశశ్రేణి బంధించు చం
దమునం బెక్కగు నామరూపములచేతన్ వారి బంధించి దు
ర్గమ సంసారపయోధిఁ ద్రోతువు దళత్కంజాతపత్త్రేక్షణా!

భావము:
ఓ దేవా! పరమ భాగవతులు సదా నీ పాదసేవలో నిమగ్నులు అయి ఉంటారు. వారు మృత్యువును జయించి; భవసాగారాన్ని తరించి; జననమరణ పరంపరలకు గురికాక; పవిత్రులై లోకాలను పవిత్రం చేస్తూ; మహద్వైభవములతో ముక్తిని అందుకుంటారు. వికసించిన కలువరేకుల వంటి కన్నులు కల మహాత్మా! నిను భక్తితో సేవించకుండా దుర్మదాంధులై ప్రవర్తించేవారిని పశువులను బంధించినట్లు నామరూపాలతో బంధించి సంసారం అనే సముద్రంలో పడదోస్తావు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1222

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Saturday, July 9, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౮౬(586)

( శ్రుతి గీతలు ) 

10.2-1220-వ.
అట్టి నిన్నుఁ బరమాణుకారణవాదులైన కణ్వ గౌతమాదులును, బ్రకృతి కారణవాదులయిన సాంఖ్యులును, దేహాత్మవాదులయిన బౌద్ధులును, వివిధంబులైన కుతర్కంబులచేతం బరస్పరావ్యాహతంబులైన మతంబులు దమతమ కుతర్కవాదంబుల సమర్థించుచు నిన్నుం దెలియలేరు; మహాభాగ్యవంతులయిన యోగీంద్రులకు నీవు ప్రత్యక్షం బైన నివి యన్నియు నసత్యంబు లని కానవచ్చు; వెండియుఁ గొందఱీ సచరాచర వస్తుజాతంబులకు నంతర్యామివై సర్వంబు నీవ యగుటం దెలియలేక నిత్యం బనియు, ననిత్యం బనియు విపరీతబుద్ధిం దెలియుదురు; గాని భవదీయ దివ్యతత్త్వంబు నిక్కంబుగఁ దెలియజాలరు; కొందఱు జగచ్ఛరీరుండవుగాన జగద్రూపకుండవైన నిన్నుం గటకమకుటకర్ణికాది వివిధ భూషణభేదంబులం గనకంబు నిజస్వరూపంబు విడువక వర్తించు చందంబున జగద్వికారానుగతుండ వయ్యును నిఖిల హేయప్రత్యనీక కల్యాణగుణాత్మకుండవై యుండుదు వని యాత్మ విదులయిన వారు దెలియుదు; రదియునుం గాక.

భావము:
పరమాణువులే ఈ సృష్టికి కారణమని భావించే కణ్వ గౌతమాదులు, ప్రకృతే కారణమని వాదించే సాంఖ్యులు, దేహాత్మ వాదులు అయిన బౌద్ధులు మున్నగు వారు తమ తమ పరస్పర విరుద్ధము లైన కుతర్కాలతో కొట్టుమిట్టు లాడుతూ అట్టి సచ్చిదానంద స్వరూపుడవైన నిన్ను తెలుసుకోలేరు; నిన్ను సాక్షాత్కరించుకున్న మాహా భాగ్యవంతులు అయిన పరమ యోగులకు ఈ సృష్టిలో నీవు తప్ప ఇతర పదార్థాలు సమస్తము అసత్యాలు అనిపిస్తాయి; చరాచర ప్రపంచం అంతటా ఉండే నిన్ను సక్రమంగా తెలుసుకోలేక కొందరు విపరీత బుద్ధులతో నిత్యానిత్య వాదాలు వాదించుకుంటూ ఉంటారే తప్ప నీ నిజస్వరూపాన్ని తెలుసుకోలేరు; కటక కంకణ కిరీటాది నానావిధ భూషణాలలో సువర్ణం తన స్వరూపాన్ని విడువక వర్తించునట్లు నీవు విశ్వాత్ముడవు, సమస్త కల్మషాలకు అతీతుడవు, శుభరూపుడవు, కల్యాణ గుణాత్మకుడవు అని ఆత్మతత్వం తెలిసినవారే తెలుసుకుంటారు. అంతేకాకుండా....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1220

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Friday, July 8, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౮౫(585)

( శ్రుతి గీతలు ) 

10.2-1218-చ.
యమ నియమాది యోగమహితాత్మకులైన మునీంద్రులున్ విరో
ధమునఁ దలంచు చైద్యవసుధావర ముఖ్యనృపుల్‌ ఫణీంద్ర భో
గము లన నొప్పు బాహువులు గల్గిన నిన్ను భజించు గోపికల్‌
క్రమమున నేమునున్ సరియ కామె భవత్కృప కంబుజోదరా!
10.2-1219-మ.
అరవిందాక్ష! భవత్స్వరూప మిలఁ బ్రత్యక్షంబునం గాన నె
వ్వరికిం బోలదు శాస్త్రగోచరుఁడవై వర్తింతు వీ సృష్టి ముం
దర సద్రూపుఁడవైన నీ వలననే ధాత్రాద్యమర్త్యుల్‌ జనిం
చిరి నిన్నంతకు మున్నెఱుంగఁ గలమే చింతింప నేమచ్యుతా!

భావము:
జితేంద్రియులూ పరమశాంతమూర్తులూ అయిన యోగులూ; శత్రుభావంతో నిన్ను తలపోసే శిశుపాలాది రాజన్యులూ; ఆదిశేష నాగుని పోలిన బాహువులతో నిండైన నిన్ను భక్తితో ఆరాధించే గోపికలూ; తరువాత మేమూ; నీ దివ్యమైన కృపకు సమానంగా పాత్రులం కావటంలో సందేహం లేదు. అంబుజాక్ష! ఈ లోకంలో ఎవరికీ నీ అసలైన స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడటం సాధ్యం కాదు. నీవు శాస్త్రగోచరుడవు అయి ఉంటావు. ఈ సృష్టికి పూర్వం సత్తు రూపంలో వెలుగొందు పరమాత్మ స్వరూపుడవైన నీ వలననే బ్రహ్మాది దేవతలు ప్రభవించారు. అటువంటి బ్రహ్మాదుల సృష్టికి ముందరి ఆ సచ్చిదానంద స్వరూపాన్ని మేము తెలుసుకోలేము.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1219

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Thursday, July 7, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౮౪(584)

( శ్రుతి గీతలు ) 

10.2-1216-సీ.
అనఘ! దుర్గమమైన యాత్మతత్త్వంబు ప్ర-
  వర్తించుకొఱకు దివ్యంబులైన
యంచిత రామకృష్ణాద్యవతారముల్‌-
  భజియించియున్న నీ భవ్యచరిత
మను సుధాంభోనిధి నవగాహనము సేసి-
  విశ్రాంతచిత్తులై వెలయుచుండి
మోక్షంబు బుద్ధినపేక్షింపనొల్లరు-
  మఱియుఁగొందఱు భవచ్చరణపంక
10.2-1216.1-ఆ.
జములఁ దగిలి పుణ్యతము లైన హంసల
వడువు నొంది భాగవతజనముల
నొనరువారు ప్రకట యోగిజనప్రాప్య
మైన ముక్తిఁ గోర రాత్మ లందు.
10.2-1217-ఉ.
కొందఱు నీ శరీరము లకుంఠితభక్తి భవద్వశంబులై
చెందఁగ నీ పదాబ్జములు సేరి భజించుచుఁ దత్సుఖాత్ములై
యుందురు కొందఱీ తనువు లోలి ధరించి భవత్పదాబ్జముల్‌
పొందుగఁ గొల్వలేక నిలఁ బుట్టుచుఁ జచ్చుచు నుందు రవ్యయా!

భావము:
పుణ్యాత్మా! నీ ఆత్మతత్వం తెలియుట బహుళతర కష్టసాధ్యమైనది. అట్టి ఆ ఆత్మతత్వం వ్యక్తమయ్యేలా రామకృష్ణాది అవతారాలు ధరిస్తావు. అటువంటి నీ దివ్యచరిత్ర అనే అమృతసాగరంలో స్నానమాడినవారు శాంతించిన చిత్తములు పొందుతారు. వారు ముక్తిని కూడా కోరరు. నీ పాదపద్మాలనే ధ్యానిస్తూ పరమహంసల్లా ప్రవర్తించే భాగవతశిఖామణులు కొందరు మహా యోగి వరేణ్యులు పొందే మోక్షమును ఆశించను కూడ ఆశించరు. అవ్యయా! భగవంతుడ! శరీరధారులు సర్వులూ నీ అంశభూతములే యని ఎఱిగిన కొందరు సదా నీ పాదపద్మాలను సేవిస్తూ పరమానందం చెందుతారు. మఱికొందరు శరీరధారులు నీ పాదపద్మాలను భజించలేక ఈ లోకంలో పుడుతూ చస్తూ ఉంటారు

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1216

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Wednesday, July 6, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౮౩(583)

( శ్రుతి గీతలు ) 

10.2-1215-వ.
మఱియు వివిధకాష్ఠాంతర్గతుం డయిన వాయుసఖుండు తద్గత దోషంబునం బొరయక నిత్యశుద్ధుఁడై తరతమభావంబున వర్తించు చందంబున స్వసంకల్పకృతంబులయిన విచిత్రశరీరంబులయందు నంతర్యామివై ప్రవేశించి తత్తద్విచిత్రయోనిగతంబైన హేయంబులం బొరయక సకలాత్మ సమంబై బ్రహ్మంబయిన నిన్ను నైహికాముష్మిక ఫలసంగమంబు లేక విగతరజోగుణంబులందగిలి కొందఱు భజియించుచుండుదు; రదియునుం గాక, దేవా! భవదీయ సంకల్పాధీనంబులయిన శరీరంబులం బ్రవేశించియున్న జీవసమూహంబు నీకు శేషభూతం బని తెలిసి కొందఱు భవనివారకం బయిన శ్రీమత్త్వచ్చరణారవిందంబులు సేవించి కృతార్థులగుదురు మఱియును.

భావము:
దేవా! కఱ్ఱకు ఎన్ని వంకరలు ఉన్నా, కఱ్ఱలో అంతర్గతంగా ఉండే అగ్నిహోత్రునికి ఆ వంకరలు అంటవు కదా అలాగే. నీవు నీ సంకల్పానికి అనుగుణంగా విశిష్ఠంగా చిత్రించి ఆ శరీరాలలో అంతర్యామిగా ఉన్నప్పటికీ, ఆయా శరీరుల పాపాలు నీకు సోకవు. అటువంటి సర్వాంతర్యామివై సాక్షాత్తు పరబ్రహ్మమైన నిన్ను నిష్కాములై ఫలాపేక్షలేక రజోగుణాన్ని వదలిన కొందరు మహాత్ములు సేవిస్తూ ఉంటారు. తమ తమ ప్రాణదేహాలు నీ ఆధీనాలని తెలిసినవారు భగవంతుడవైన నీ పాదపద్మాలను ధ్యానించి భవరోగాలకు దూరులౌతారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1215

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Monday, July 4, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౮౨(582)

( శ్రుతి గీతలు ) 

10.2-1213-ఆ.
నిన్ను ననుసరింప నేరని కుజనులు
పవనపూర్ణ చర్మభస్త్రి సమితి
యోజఁ జేయుచుందు రుచ్ఛ్వసనంబులు
బలసి యాత్మదేహభజను లగుచు.
10.2-1214-సీ.
దేవ! కొందఱు సూక్ష్మదృక్కు లైనట్టి మ-
  హాత్మకు లుదరస్థుఁ డైన వహ్ని
గా మదిఁ దలఁతురు కైకొని మఱికొంద-
  ఱారుణు లనుపేర నమరు ఋషులు
లీల సుషుమ్ననాడీ మార్గగతుఁడవై-
  హృత్ప్రదేశమునఁ జరించుచున్న
రుచి దహరాకాశ రూపిగా భావింతు-
  రట్టి హృత్పద్మంబునందు వెడలి
10.2-1214.1-తే.
వితతమూర్ధన్యనాడికాగతుల నోలి
బ్రహ్మరంధ్రంబుఁ బ్రాపించి పరమపురుష!
సుమహితానందమయ పరంజ్యోతిరూపి
వైన నినుఁ బొంది మఱి పుట్ట రవని యందు.

భావము:
గాలితో నిండిన తోలుతిత్తి లాంటి తమ శరీరం మీది మమకారంతో, నిన్ను సేవించని దుష్ట మానవులు, ఉచ్ఛ్వాస నిశ్వాశాలు నింపుకుంటూ ఆ దేహాన్నే తమ ఆత్మ అనుకుని భజిస్తూ ఉంటారు. ఓ భగవంతుడా! మహితాత్మకులు “సూక్ష్మ దర్శనులు” నిన్ను గర్భంలో ఉన్న అగ్నిగా భావిస్తారు. ఋషీశ్వరులు “ఆరుణులు” సుషుమ్నానాడీ మార్గంలో సంచరిస్తూ హృదయ ప్రదేశంలో సంచరించే సూక్ష్మాకార రూపం కలవాడిగా నిన్ను తలుస్తారు. అట్టి హృదయపద్మం నుంచి వెలువడి మూర్ధన్య నాడి ద్వారా బ్రహ్మరంధ్రం చేరుకుని, ఆనందమయ పరంజ్యోతి స్వరూపుడవు అయిన నిన్ను చేరి ఆ అరుణులు ముక్తులు అవుతారు. వారికి మరల జన్మ అంటూ ఉండదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1214

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Sunday, July 3, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౮౧(581)

( శ్రుతి గీతలు ) 

10.2-1211-సీ.
అనయంబు దేహి నిత్యానిత్య సద్విల-
  క్షణమునఁ బంచకోశవ్యవస్థ
నభివృద్ధిఁ బొరయుచు నందులోపల నున్న-
  ప్రాణాన్నబుద్ధి విజ్ఞానమయము
లను చతుష్కోశంబు లవ్వల వెలుఁగొందు-
  నానందమయుఁ డీవు గాన దేవ!
సురుచిర స్వప్రకాశుండవు నీ పరి-
  గ్రహము గల్గుటఁ జేసి కాదె ప్రకృతి
10.2-1211.1-తే.
మహ దహంకార పంచతన్మాత్ర గగన
పవన తేజోంబు భూ భూతపంచకాది
కలిత తత్త్వముల్‌ బ్రహ్మాండకార్య కరణ
మందు నెపుడు సమర్థంబు లగుటఁ జూడ.
10.2-1212-క.
కోరి శరీరులు భవదను
సారంబున నిహపరైక సౌఖ్యంబులఁ బెం
పారఁగ నందుచు నుందురు
ధీరజనోత్తము లనంగ దివిజారిహరా!

భావము:
ప్రాణ, అన్న, బుద్ధి, విజ్ఞాన, ఆనందమయాలనే పంచకోశాల యొక్క శాశ్వతమూ అశాశ్వతమూ అనే లక్షణాల వలన జీవులు అభివృద్ధి పొందుతూంటాయి. ఈ పంచకోశాలలో చివరిదైన ఆనందమయకోశానికి చెంది ప్రాణమయ, అన్నమయ, బుద్ధిమయ, విజ్ఞానమయ నాలుగు కోశాలకు పరమై నీవు స్వయంప్రకాశుడవై వెలుగొందుతుంటావు. నీ అనుగ్రహం ఉన్నందు వలనే కదా ఈ ప్రకృతీ, మహత్తూ, అహంకారమూ; పంచతన్మాత్రలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలూ; పంచభూతాలైన భూమీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మున్నగునవి అన్నీ ఈ సమస్త సృష్టి, స్థితి, లయ కార్యాలను సర్వ సమర్థంగా నిర్వహిస్తున్నాయి. ఓ అసుర సంహారా! నామ రూప ధారులు నిన్ను భజిస్తూ ఇహపర సౌఖ్యాలను పొంది గొప్పవారని ప్రసిద్ధులు అవుతారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1212

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Friday, July 1, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౮౦(580)

( శ్రుతి గీతలు ) 

10.2-1208-క.
లీలం బ్రాకృతపూరుష
కాలాదిక నిఖిలమగు జగంబుల కెల్లన్
మాలిన్య నివారక మగు
నీ లలితకథాసుధాబ్ధినిం గ్రుంకి తగన్.
10.2-1209-చ.
భరిత నిదాఘ తప్తుఁ డగు పాంథుఁడు శీతలవారిఁ గ్రుంకి దు
ష్కర మగు తాపముం దొఱగు కైవడి సంసరణోగ్రతాపమున్
వెరవునఁ బాయుచుండుదురు నిన్ను భజించుమహాత్మకుల్‌ జరా
మరణ మనోగదంబులఁ గ్రమంబునఁ బాయుట సెప్ప నేటికిన్?

భావము:
ప్రాకృతము, పురుషుడు, కాలములకు స్వరూప నిలయమైన ఈ ప్రపంచంలోని నిఖిల పాపాలనూ నివారించే సామర్ధ్యం కల నీ మనోహర కథామృత సముద్రంలో మునిగి ధన్యులు అవుతారు. బాటసారి తీవ్రమైన వేసవి ఎండకి కలిగే పరితాపాన్ని, చన్నీళ్ళ స్నానం చేసి పోగొట్టుకుంటాడు. అదే విధంగా నిన్ను పూజించే మహాత్ములు సంసార దుర్భర తాపాన్ని నేర్పుతో తొలగించుకుంటారు. అలాంటప్పుడు మనోవ్యధ, ముసలితనము, మరణములను పోగొట్టుకుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1209

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :