(భక్తి యోగం)
3-969-సీ.
తలఁప బ్రాహ్మణు లుత్తములు వారికంటెను;
వేదవేత్తలు, వేదవిదులకంటె
విలసితవేదార్థవిదులు, వారలకంటె;
సమధిక శాస్త్రసంశయము మాన్పు
మీమాంసకులు, మఱి మీమాంసకులకంటె;
నిజధర్మవిజ్ఞాననిపుణు లరయ
వారికంటెను సంగవర్జితచిత్తులు;
దగ వారికంటె సద్ధర్మపరులు
3-969.1-తే.
ధార్మికులకంటె నుత్తమోత్తములు వినుము
మత్సమర్పిత సకలధర్మస్వభావ
మహిమములు గల్గి యితర ధర్మములు విడిచి
సమత వర్తించు నప్పుణ్యతముఁడు ఘనుఁడు.
భావము:
(ఆ నాల్గు తెగలలో) బ్రాహ్మణులు ఉత్తములు. వీరికంటే వేదవేత్తలు శ్రేష్ఠులు. వీరికంటె వేదార్థం తెలిసినవాళ్ళు గొప్పవారు. వీరికంటె శాస్త్ర సంబంధమైన సందేహాలను చక్కగా తీర్చగల మీమాంసకులు అధికులు. వీరికంటె స్వధర్మపరాయణులు ఉత్తములు. వీరికంటే దేనిపైనా ఆసక్తిలేని నిస్సంగులు గొప్పవారు. వీరికంటె సద్ధర్మం ఆచరించేవారు అధికులు. అటువంటి ధర్మికులకంటే సర్వధర్మాలనూ, సర్వసంపదలనూ, సర్వబాధ్యతలనూ నాకే అర్పించి, అనన్యభావంతో సర్వత్ర సమవర్తనుడై జీవితం గడిపే పుణ్యాత్ముడు ఎంతో గొప్పవాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=969
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment