Monday, July 15, 2019

కపిల దేవహూతి సంవాదం - 65


(భక్తి యోగం)

3-957-క.
హేయగుణరహితుఁ డనఁగల
నా యందుల భక్తిలక్షణముఁ దెలిపితి నన్
బాయక నిర్హేతుకముగఁ
జేయు మదీయవ్రతైక చిరతరభక్తిన్.
3-958-వ.
నిష్కాము లయిన మదీయ భక్తులకు నట్టి భక్తియోగంబు సాలోక్య సార్ష్టి సామీప్య సారూప్య సాయుజ్యంబులకు సాధనంబు; గావున, మహాత్ము లగు వారు నిజమనోరథఫలదాయకంబు లయిన మదీయ సేవావిరహితం బులయిన యితర కర్మంబు లాచరింప నొల్లరు; దీని నాత్యంతిక భక్తియోగం బని చెప్పుదురు; సత్త్వ రజస్తమోగుణ విహీనుం డయిన జనుండు మత్సమానాకారంబుఁ బొందు" నని చెప్పి మఱియు నిట్లనియె.

భావము:
నిందనీయాలైన గుణాలు లేనివాడనైన నాయందు నిలుపవలసిన భక్తి లక్షణాలను తెలిపాను. నన్ను వదలకుండా, హేతువులు వెదకకుండా చేసే వ్రతమే అచంచలమైన భక్తి అని భావించు. కోరికలు లేకుండా నన్ను భజించే నా భక్తులకు పైన చెప్పిన భక్తియోగం సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం అనే ముక్తులకు సాధనమౌతుంది. అందువల్ల మహాత్ములైనవారు తమ కోర్కెలు తీర్చేవే అయినా నా ఆరాధనకు దూరమైన ఏ సాధనలనూ చేయరు. దీనినే ఆత్యంతిక భక్తియోగం అని అంటారు. సత్త్వరజస్తమోగుణాలకు అతీతమైన ప్రవర్తనగల మానవుడు నాతో సమానమైన రూపాన్ని పొందుతాడు” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=958

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: