Wednesday, July 3, 2019

కపిల దేవహూతి సంవాదం - 53


( విష్ణు సర్వాంగ స్తోత్రం )

3-941-సీ.
మునులకు మకరకేతనునకు మోహనం; 
బైన స్వకీయ మాయావిలాస
మున రచితం బైన భ్రూమండలంబును; 
ముని మనఃకుహర సమ్మోదమానుఁ
డగు నీశ్వరుని మందహాసంబు నవపల్ల; 
వాధర కాంతిచే నరుణ మైన
మొల్లమొగ్గల కాంతి నుల్లసం బాడెడు; 
దంతపంక్తిని మదిఁ దలఁపవలయు
3-941.1-తే.
వెలయ నీరీతి నన్నియు వేఱువేఱ
సంచితధ్యాన నిర్మల స్థానములుగ
మనములోఁ గను" మని చెప్పి మఱియుఁ బలికె
దేవహూతికిఁ గపిలుండు దేటపడఁగ.

భావము:
మహామునులకే కాకుండా మన్మథునకు సైతం మరులు రేకెత్తించే మాధవుని మాయావిభ్రమ విరచితమైన భ్రూమండలాన్ని, మునీంద్రుల మనస్సులకు ఆనందాన్ని అందించే మందహాసాన్ని, క్రొంగ్రొత్త చిగురు తొగరు పెదవులను, ఆ పెదవుల కాంతికి జాజువారిన మొల్ల మొగ్గల చెలువాన్ని పరిహసించే పలువరసను తలపోయాలి. ఈ విధంగా అన్ని అవయవాలను వేరువేరుగా మనస్సులో నిలిపి ధ్యానం చేసుకోవాలి” అని దేవహూతికి కపిలుడు తేటతెల్లంగా తెలిపి మళ్ళీ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=50&padyam=941

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: