Saturday, July 13, 2019

కపిల దేవహూతి సంవాదం - 64


(భక్తి యోగం)

3-955-చ.
అనుపమ పాపకర్మపరిహారము కై భజనీయుఁ డైన శో
భనచరితుం డితం డనుచు భావమునం దలపోసి భక్తిచే
ననితర యోగ్యతన్ భగవదర్పణబుద్ధి నొనర్చి కర్మముల్
జనహితకారి యై నెగడ సాత్వికయోగమనంగఁ జొప్పడున్.
3-956-చ.
మనుసుత! మద్గుణశ్రవణమాత్ర లభించిన యట్టి భక్తిచే 
ననఘుఁడ సర్వశోభనగుణాశ్రయుఁడన్ పరమేశ్వరుండ నై
తనరిన నన్నుఁ జెందిన యుదాత్త మనోగతులవ్యయంబులై
వననిధిగామి యైన సురవాహినిఁబోలె ఫలించు నిమ్ములన్.

భావము:
సాటిలేని పాపాలను పరిహారం చేసేది భగవద్భక్తి ఒక్కటే అనే విశ్వాసంతో, భజింపదగిన పవిత్ర చరిత్రుడు భగవంతుడే అని మనస్సులో భావిస్తూ, సమస్త కార్యాలను భగవదంకితంగా ఆచరిస్తూ, లోకులకు మేలు చేకూర్చే పనులు చేస్తూ ఉండటం సాత్త్వికభక్తి.
మనుపుత్రికవైన ఓ తల్లీ! నా గుణాలను ఆలకించిన మాత్రాన ప్రాప్తమైన భక్తితో ఉదాత్తచిత్తులైన కొందరు పాపరహితుడనూ, అనంత కళ్యాణగుణ సహితుడనూ, పరమేశ్వరుడనూ అయిన నన్ను ఆశ్రయిస్తారు. అటువంటి ఉత్తముల మనోభావాలు సముద్రాన్ని సంగమించిన గంగానది మాదిరిగా చక్కగా సఫల మౌతాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=956

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: