9-360-చ.
వశుఁడుగ మ్రొక్కెదన్ లవణవార్ధి విజృంభణతా నివర్తికిన్
దశదిగధీశమౌళిమణి దర్పణమండిత దివ్యకీర్తికిన్
దశశతభానుమూర్తికి సుధారుచిభాషికి సాధుపోషికిన్
దశరథరాజుపట్టికిని దైత్యపతిం బొరిగొన్న జెట్టికిన్.
9-361-ఉ.
నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులున్
విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ
జల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం
జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁ డిచ్చుత మా కభీష్టముల్.
భావము:
సాగరుని అహంకారం సర్వం అణచినవానికి; సకల దిర్పాలకుల కిరీటాలలోని మణులు అనె దర్పణాలలో ప్రతిఫలించే గొప్ప యశస్సు గలవానికి; వెలసూర్యులతో సమానమైన ప్రకాశంగల మహామూర్తికి; అమృతం అంత మధురంగా మాట్లాడు వానికి; సాధులను పాలించువానికి; దశరథరాజు కుమారునికి; రావణాసురుని సంహరించిన వీరునికి; వినమ్రుడనై మ్రొక్కుతాను. నల్లటివాడు, పద్మాలవంటి కళ్ళు గలవాడు, గొప్ప ధనుస్సు బాణాలు ధరించు వాడు, విశాలమైన వక్షస్థలం గలవాడు, మేళ్ళు అనేకం సమకూర్చువాడు, ఎగుభుజాలు గలవాడు, అన్ని దిక్కులకు తన కీర్తిని వ్యాపింపజేసిన వాడు, రఘు కులోత్తముడు అయిన శ్రీరామచంద్రుడు మా కోరికలు తీర్చుగాక.
http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=23&padyam=361
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment