Saturday, December 16, 2017

ద్వారక అస్తమయం - 3

11-7-సీ.
ఈ రీతి శ్రీకృష్ణుఁ డేపారఁ బూతనా; 
శకట తృణావర్త సాల్వ వత్స
చాణూర ముష్టిక ధేను ప్రలంబక; 
దైత్యాఘ శిశుపాల దంతవక్త్ర
కంస పౌండ్రాదిక ఖండనం బొనరించి; 
యటమీఁదఁ గురుబలం బణఁచి మఱియు 
ధర్మజు నభిషిక్తుఁ దనరఁగాఁ జేసిన; 
నతఁడు భూపాలనం బమరఁ జేసె
11-7.1-తే.
భక్తులగు యాదవేంద్రులఁ బరఁగఁ జూచి
"యన్యపరిభవ మెఱుఁగ రీ యదువు లనుచు
వీరిఁ బరిమార్ప నేఁ దక్క వేఱొకండు
దైవ మిఁక లేదు త్రిభువనాంతరమునందు. "


భావము:
ఇలాగ, మహానుభావుడైన శ్రీకృష్ణుడు అతిశయించి; పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, వత్సాసురుడు, ధేనుకాసురుడు, ప్రలంబాసురుడు మున్నగు రాక్షసులను; చాణూర, ముష్టికులను; కంస, సాల్వ, పౌండ్రక, శిశుపాల, దంతవక్త్రులను సంహరించాడు. అంతేకాక కౌరవసైన్యాన్ని అణచివేసి ధర్మరాజును చక్రవర్తిగా అభిషేకించాడు. ధర్మరాజు భూపాలనం చేస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు “తన భక్తులైన యాదవులు ఇతరుల వలన ఓటమి లేని వారు. వీరిని సంహరించడానికి నేను తప్ప మరొక దైవం ముల్లోకాల యందు లేడు” అని ఆలోచించాడు



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




No comments: