9-269-సీ.
ఆ వనంబున రాముఁ డనుజ సమేతుడై;
సతితోడ నొక పర్ణశాల నుండ
రావణు చెల్లలు రతిఁ గోరి వచ్చిన;
మొగి లక్ష్మణుఁడు దాని ముక్కు గోయ
నది విని ఖరదూషణాదులు పదునాల్గు;
వేలు వచ్చిన రామవిభుఁడు గలన
బాణానలంబున భస్మంబు గావింప;
జనకనందన మేని చక్కఁదనము
9-269.1-తే.
విని దశగ్రీవుఁ డంగజ వివశుఁ డగుచు
నర్థిఁ బంచినఁ బసిఁడిఱ్ఱి యై నటించు
నీచు మారీచు రాముఁడు నెఱి వధించె
నంతలో సీతఁ గొనిపోయె నసురవిభుఁడు.
భావము:
శ్రీరాముడు తమ్ముడితో భార్యతో కలిసి దండకారణ్యంలో ఒక పర్ణశాలలో ఉన్నాడు. అప్పుడు రావణాసురుని చెల్లెలు శూర్పణక కామించి వచ్చింది. అంతట లక్ష్మణుడు ఆమె ముక్కు కోసేశాడు. అది విని ఖరుడు దూషణుడు అనే రాక్షసులు పద్నాలుగువేల మంది రాక్షససేనతో దండెత్తి వచ్చారు. శ్రీరామచంద్రుడు యుద్దంచేసి తన బాణాగ్నిలో వారిని భస్మం చేశాడు. సీత చక్కదనం విని మన్మథు పరవశుడైన రావణుడు మారీచుడిని పంపాడు. ఆ నీచుడు బంగారు లేడి రూపంలో రాగా, శ్రీరాముడు వాడిని వధించాడు. ఆ సమయంలో రావణాసురుడు సీతను తీసుకుపోయాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=269
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment