Tuesday, September 5, 2017

శ్రీ కృష్ణ జననం - 32

10.1-109-క.
సుతుఁ గనె దేవకి నడురే
యతి శుభగతిఁ దారలును గ్రహంబులు నుండన్
దితిసుత నిరాకరిష్ణున్
శ్రితవదనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్.
10.1-110-క.
వెన్నుని నతిప్రసన్నునిఁ 
గ్రన్నన గని మెఱుఁగుఁబోఁడి గడు నొప్పారెం
బున్నమనాఁడు కళానిధిఁ
గన్న మహేంద్రాశ చెలువు గలిగి నరేంద్రా! 
చంద్రుని షోడశ కళలు
10.1-111-వ.
అప్పుడు.
10.1-112-సీ.
జలధరదేహు నాజానుచతుర్బాహు; 
సరసీరుహాక్షు విశాలవక్షుఁ
జారు గదా శంఖ చక్ర పద్మ విలాసుఁ; 
గంఠకౌస్తుభమణికాంతి భాసుఁ
గమనీయ కటిసూత్ర కంకణ కేయూరు; 
శ్రీవత్సలాంఛనాంచిత విహారు
నురుకుండలప్రభాయుత కుంతలలలాటు; 
వైడూర్యమణిగణ వరకిరీటు 
10.1-112.1-తే.
బాలుఁ బూర్ణేందురుచిజాలు భక్తలోక
పాలు సుగుణాలవాలుఁ గృపావిశాలుఁ
జూచి తిలకించి పులకించి చోద్య మంది
యుబ్బి చెలరేఁగి వసుదేవుఁ డుత్సహించె.

భావము:
దేవకీదేవి అర్థరాత్రి వేళ నక్షత్రాలు గ్రహాలు అత్యంత శుభస్థానాలలో ఉండగా, రాక్షసులను శిక్షించేవాడు; ఆశ్రయించినవారి ముఖాలలో ఆనందం నింపేవాడు; జయశీలము గలవాడు; విశ్వం అంతా వ్యాపించి ఉండువాడు అయిన శ్రీమహావిష్ణువును ప్రసవించింది. ఓ పరీక్షిన్నరేంద్రా! శ్రీ మన్నారాయణుని ప్రసవించి దేవకి మెరుపు తీగలా మెరిసి పోతూ మిక్కిలి అందంగా ఉన్నది; ఆ సమయంలో, దేవకి నిండు పౌర్ణమినాటి పదహారు కళలతో నిండిన చంద్రుని కన్న తూర్పు దిక్కు అంత అందంగా ఉంది. అప్పుడు ఆ బాలుడు దివ్యరూపంతో వసుదేవునికి దర్శనమిచ్చాడు. అతడు నీలమేఘ వర్ణ దేహం కలిగి ఉన్నాడు; (మోకాళ్ళ వరకు) పొడవైన నాలుగు చేతులలో గద శంఖం చక్రం పద్మం వెలుగొందుతున్నాయి; తామరరేకుల వంటి కళ్ళు, విశాలమైన వక్షం ఉన్నాయి; కంఠంలో కౌస్తుభమణి కాంతులు వెలుగుతున్నాయి; అందమైన మొలతాడు, కంకణాలు, భుజకీర్తులు ధరించి ఉన్నాడు; శ్రీవత్సము అనే పుట్టుమచ్చ వక్షం మీద మెరుస్తున్నది; చెవికుండలాల కాంతితో ముంగురులు వెలిగిపోతున్నాయి; వైడూర్య మణులు పొదగిన కిరీటం ధరించి ఉన్నాడు; పూర్ణచంద్రుని కాంతులీనుతున్నాడు.; అతడు భక్తులందరిని రక్షించే వాడు; సృష్టిలోని సగుణాల పోగు; అతి విశాలమైన కరుణ కలవాడు; వసుదేవుడు ఆ హరిని కనుగొని చూసి పులకించి, ఆశ్చర్యంతో మైమరచి ఉప్పొంగి, ఉబ్బితబ్బిబయ్యాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=11&padyam=112

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: