Sunday, September 10, 2017

పోతన రామాయణం - 2

9-260-మ.
సవరక్షార్థము దండ్రి పంపఁ జని విశ్వామిత్రుఁడుం దోడరా
నవలీలం దునుమాడె రాముఁ డదయుండైబాలుఁడై కుంతల
చ్ఛవిసంపజ్జితహాటకం గపటభాషావిస్ఫురన్నాటకన్
జవభిన్నార్యమఘోటకం గరవిరాజత్ఖేటకం దాటకన్.
9-261-క.
గారామునఁ గౌశిక మఖ
మా రాముఁడు గాచి దైత్యు నధికు సుబాహున్
ఘోరాజిఁ ద్రుంచి తోలెన్
మారీచున్ నీచుఁ గపటమంజులరోచున్.

భావము:
చిన్నపిల్లవాడుగా ఉండగా శ్రీరాముడిని తండ్రి యఙ్ఞం కాపాడటానికి మహర్షి విశ్వామిత్రుని వెంట పంపించాడు. అక్కడ ఉన్న రాకాసి తాటకి బంగారు రంగు జుట్టు కలది, కపట పలుకులతో నాటకాలు ఆడేది, సూర్యుని గుఱ్ఱాలను మించిన వేగం కలది. చేతిలో గొప్పడాలు కలది. అలాంటి తాటకిపై ఏమాత్రం దయ చూపకుండా శ్రీరాముడు దానిని సుళువుగా సంహరించాడు. శ్రీరాముడు భీకర యుద్ధంచేసి రాక్షసుడైన సుబాహుని చంపాడు. కపటవేషం వేసిన దుర్మార్గుడు మారీచుని తరిమికొట్టాడు. కౌశికుడు అను మరొక పేరు గల విశ్వామిత్రుని యాగాన్ని కాపాడాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=261

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: