Sunday, December 3, 2017

పోతన రామాయణం - 51

9-354-వ.
అనిన వార “లేము వాల్మీకి పౌత్రులము; రాఘవేశ్వరుని యాగంబు చూడ వచ్చితి” మనవుడు; మెల్లన నగి “ యెల్లి ప్రొద్దున మీ తండ్రి నెఱింగెద; రుండుం” డని యొక్క నివాసంబునకు సత్కరించి పనిచె; మఱునాఁడు సీతం దోడ్కొని కుశలవుల ముందట నిడుకొని వాల్మీకి వచ్చి రఘుపుంగవునిం గని యనేక ప్రకారంబుల వినుతించి యిట్లనియె.
9-355-ఆ.
"సీత సుద్దరాలు, చిత్తవాక్కర్మంబు
లందు సత్యమూర్తి యమలచరిత
పుణ్యసాధ్వి విడువఁ బోలదు చేకొను
రవికులాబ్దిచంద్ర! రామచంద్ర!"


భావము:
ఇలా అడిగిన శ్రీరామునితో వారు ఇలా అన్నారు. “మేము వాల్మీకి మనుమలం. శ్రీరాముని యాగం చూడ్డానికి వచ్చాం.” వారి పలుకులు విని మెల్లిగా నవ్వి, “రేపు ఉదయం మీ తండ్రిని తెలుసుకుందురు గాని, రండి.” అని సత్కరించి పంపించాడు. మరునాడు వాల్మీకిమహర్షి సీతను, కుశులవులను వెంటబెట్టుకొని వచ్చి శ్రీరాముని పెక్కువిధా స్తుతించి ఇలా అన్నాడు. “రామా! రవికులాబ్దిసోమా! సీతాదేవి పవిత్రురాలు (త్రికరణ శుద్ధిగా) మనోవాక్కాయకర్మలలోను సత్యనిష్ఠగల సాధ్వి, పరిశుద్ధ వర్తనురాలు, మహాపుణ్యాత్మురాలు, పతివ్రత. ఈమెను విడుచుట తగినపని కాదు. స్వీకరించు.”



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




No comments: