Sunday, October 29, 2017

పోతన రామాయణం - 23

9-301-క.
నీ చేసిన పాపములకు
నీచాత్మక! యముఁడు వలదు నేఁడిట నా నా
రాచముల ద్రుంచి వైచెద
ఖేచర భూచరులు గూడి క్రీడం జూడన్."
9-302-వ.
అని పలికి.
9-303-మ.
బలువింటన్ గుణటంకృతంబు నిగుడన్ బ్రహ్మాండ భీమంబుగా
బ్రళయోగ్రానలసన్నిభం బగు మహాబాణంబు సంధించి రా
జలలాముండగు రాముఁడేసె ఖరభాషాశ్రావణున్ దేవతా
బలవిద్రావణు వైరిదారజనగర్భస్రావణున్ రావణున్.

భావము:
ఓ నీచ రావణా! నీవు చేసిన దోషాలకు యమధర్మరాజు అక్కరలేదు. ఖేచర భూచరులు అందరూ చూస్తుండగా ఇవాళ ఇక్కడే నా బాణాలతో నిన్ను సంహరిస్తాను." అని పలికి ఆ రాజలలాముడైన శ్రీరాముడు గొప్పదైన ధనుష్టంకారాలు చెలరేగగా, పరుషంగా మాట్లాడే వాడు, దేవతల సైన్యాన్ని పారదోలే వాడిని, శత్రురాజుల భార్యల గర్భస్రావకారణుడు అయిన రావణుని తన ప్రళయాగ్నిసమ భీకరమైన తన బాణాలు ప్రయోగించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=303

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: