9-291-వ.
అంత నయ్యసురేంద్రుండు పంచినఁ గుంభ, నికుంభ, ధూమ్రాక్ష, విరూపాక్ష, సురాంతక, నరాంతక, దుర్ముఖ, ప్రహస్త, మహాకాయ ప్రముఖులగు దనుజవీరులు శర శరాసన తోమర గదాఖడ్గ శూల భిందిపాల పరశు పట్టిస ప్రాస ముసలాది సాధనంబులు ధరించి మాతంగ తురంగ స్యందన సందోహంబుతో బవరంబు చేయ సుగ్రీవ, పవనతనయ, పనస, గజ, గవయ, గంధమాదన, నీలాం గద, కుముద, జాంబవదాదు లా రక్కసుల నెక్కటి కయ్యంబు లందుఁ దరుల గిరులఁ గరాఘాతంబుల నుక్కడించి త్రుంచి; రంత.
9-292-క.
ఆ యెడ లక్ష్మణుఁ డుజ్జ్వల
సాయకములఁ ద్రుంచె శైలసమకాయు సురా
జేయు ననర్గళమాయో
పాయున్ నయగుణ విధేయు నయ్యతికాయున్.
భావము:
అంతట రావణుడు పంపించగా నికుంభుడు, ధూమ్రాక్షుడు, విరూపాక్షుడు, సురాంతకుడు, నరాంతకుడు, దుర్ముఖుడు, ప్రహస్తుడు, మహాకాయుడు మున్నగు రాక్షస వీరులు విల్లంబులు, కొరడాలు, గదలు, ఖడ్గాలు, శూలాలు, గుదియలు, గొడ్డళ్ళు, అడ్డకత్తులు, ఈటెలు, రోకళ్ళు మున్నగు ఆయుధాలు పట్టి ఏనుగులు, గుఱ్ఱాలు, రథాలు ఎక్కి వచ్చి యుద్ధం చేసారు. సుగ్రీవుడు, ఆంజనేయుడు, పనసుడు, గజుడు, గవయుడు, గంధమాదనుడు, నీలుడు, అంగదుడు, కుముదుడు, జాంబవంతుడు మున్నగు వీరులు; ఆ రాక్షసులను ద్వంద్వ యుద్దాలలో చెట్లు, కొండలు పిడికిటిపోట్లుతో కొట్టి సంహరించారు. అంతట. ఆ సమయంలో పర్వతసమ దేహుడు, దేవతలకు సైతం అజేయుడు, మాయోపాయుడు, నయగుణ విధేయుడూ అయిన అతికాయుడిని లక్ష్మణుడు ఉజ్జ్వలమైన బాణాలతో సంహరించాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=292
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment