9-306-సీ.
కొప్పులు బిగి వీడి కుసుమమాలికలతో;
నంసభాగంబుల నావరింప
సేసముత్యంబులు చెదరఁ గర్ణిక లూడఁ;
గంఠహారంబులు గ్రందుకొనఁగ
వదనపంకజములు వాడి వాతెఱ లెండఁ;
గన్నీళ్ళవఱద లంగములు దడుప
సన్నపు నడుములు జవ్వాడఁ బాలిండ్ల;
బరువులు నడుములఁ బ్రబ్బికొనఁగ
9-306.1-ఆ.
నెత్తి మోఁదికొనుచు నెఱిఁ బయ్యెదలు జాఱ
నట్టు నిట్టుఁ దప్పటడుగు లిడుచు
నసురసతులు వచ్చి రట భూతభేతాళ
సదనమునకు ఘోరకదనమునకు.
భావము:
భూతభేతాళాలు తిరుగుతున్న ఆ భీకర యుద్దభూమికి తప్పటడుగులు వేస్తూ రాక్షస స్త్రీలు వచ్చారు. వారి జుట్టుముళ్ళు వదులైపోయాయి, పూలహారాల మూపులపై పరచుకొన్నాయి, పాపటముత్యాలు చెదిరిపోయాయి, కర్ణాభరణాలు ఊడిపోయాయి, మెడలో హారాలు చిక్కుపడిపోయాయి, మోములు వాడిపోయాయి, పెదవులు ఎండిపోయాయి, కన్నీళ్ళు వరదలు కట్టాయి, స్తనాల బరువుకు సన్నటి నడుములు జవజవలాడాయి, పైటలు జారిపోయాయి. వారు తలబాదుకొంటూ దుఃఖిస్తున్నారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=306
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment