Monday, December 19, 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౨(702)

( అవధూత సంభాషణ ) 

11-94-వ.
అంత యదుప్రవరుండు “దేహి లోభమోహాదులవర్జించి జనార్దనుని నే విధంబునం జేరవచ్చు? నెఱింగింపు” మనిన నతం డిట్లనియె.
11-95-సీ.
"పరధన పరదార పరదూషణాదులఁ-
  బరవస్తుచింతదాఁ బరిహరించి
ముదిమిచే రోగము లుదయింప కటమున్న-
  తనువు చంచలతను దగులకుండ
బుద్ధిసంచలతచేఁ బొదలక యట మున్న-
  శ్లేష్మంబు గళమునఁ జేరకుండ
శక్తియుక్తుల మది సన్నగిల్లక మున్న-
  భక్తి భావనచేతఁ బ్రౌఢుఁ డగుచు
11-95.1-తే.
దైత్యభంజను దివ్యపాదారవింద
భజన నిజభక్తి భావనఁ బ్రాజ్ఞుఁ డగుచు
నవ్యయానందమును బొందు ననుదినంబు
నతఁడు కర్మవిముక్తుఁడౌ ననఘచరిత!

భావము:
దానికి యదురాజు “శరీరధారి లోభం మోహం మొదలగు వాటిని వదలి ఏవిధంగా విష్ణువును చేరగలడు. తెలియజెప్పండి.” అంటే, అవధూత ఇలా అన్నాడు. “ఓ సచ్చరిత్రా! విను. ఇతరులను నిందించకుండా, పరుల ధనాలను కాంతలను కోరకుండా, ఇతరుల వస్తువులు అపహరించే ఆలోచన లేకుండా జీవించాలి. ముసలితనం పైనపడి రోగాలు పుట్టక ముందే, శరీరంలో కంపం మొదలవక ముందే, బుద్ధి చంచలం కాక ముందే, గొంతులో శ్లేష్మం చేరక ముందే, శక్తియుక్తులు సన్నగిల్లక ముందే, ధృఢమైన భక్తిభావనతో దానవాంతకుని దివ్యమైన చరణపద్మాలను భజిస్తూ ఉండాలి. యుక్తాయుక్త ఙ్ఞానం కలిగి ఉండి, అవ్యయమైన ఆనందాన్ని అనుదినమూ పొందుతూ ఉండాలి. అట్టివాడు భవబంధ విముక్తుడు అవుతాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=95

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

No comments: