Friday, November 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౮౩(683)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-65-వ.
వారు నారాయణాశ్రమంబునకు నతని తపోవిఘ్నంబు సేయ వచ్చునప్పు డవ్వనంబు సాల రసాల బిల్వ కదళీ ఖర్జూర జంబు జంబీర చందన వున్నాగ మందారాది వివిధ వృక్ష నిబిడంబును, పుష్ప ఫల భరిత శాఖావనమ్ర తరులతా బృందంబును, మాధవీ కుంజమంజరీ పుంజ మకరందపాన మత్తమధుకర నికర ఝంకారరవ ముఖరిత హరి దంతరంబును, గనక కమల కహ్లార విలసత్సరోవిహరమాణ చక్రవాక బక క్రౌంచ మరాళదంపతీ మండల మండితంబును, మృణాళ భోజనాసక్త సారసచయ చంచూపుట విపాటిత కమలముకుళకేసర విసర వితత ప్రశస్త సరోవరంబును నై వెలయు నవ్వనంబున నిందువదన లందంద మందగమనంబులం జెందు ఘర్మజలబిందుబృందంబులు నఖాంతంబుల నోసరింపుచు డాయంజను నప్పుడు.

భావము:
ఆ ప్రకారం వారు నారాయణాశ్రమానికి అతని తపస్సును భగ్నంచేయడానికి వచ్చారు. ఆ తపోవనం మామిడి, మద్ది, మారేడు, అరటి, ఖర్జూరం, నేరేడు, నిమ్మ, చందనం, సురపొన్న, మందారం మొదలైన అనేక వృక్షాలతో నిండి ఉన్నది. పూలతో, పండ్లతో కొమ్మలు క్రిందికి వంగి ఉన్నాయి. గురువింద పొదల పూలగుత్తుల మకరందం త్రాగి మదించిన తుమ్మెదలు చేసే ఝంకారాలతో దిక్కులు నిండిపోతున్నాయి. బంగారు పద్మాలు, కలువలు, ప్రకాశించే సరస్సులలో జక్కవలు, కొంగలు, క్రౌంచ పక్షులు, హంసలు జంటజంటలుగా విహరిస్తున్నాయి. తామరతూళ్ళను తినుటం కోసం సారసపక్షులు ముక్కులతో చీల్చబడిన తామర మొగ్గలలోని కేసరాలతో సరోవరాలు భాసిస్తూ ఉన్నాయి. అటువంటి తపోవనంలో ఆ చంద్రముఖులైన అప్సరసలు నెమ్మదిగా నడుస్తూ చెమట బిందువులను కొనగోళ్ళతో చిమ్ముకుంటూ నారాయణమహర్షిని సమీపించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=65

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: