Tuesday, November 1, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౯(669)

( విదేహ హర్షభ సంభాషణ ) 

11-41-వ.
మఱియు సకలజంతుసంతానంబుకంటె మానుషాకారంబు నొందుట దుర్లభం; బంతకంటె నారాయణచరణయుగళస్మరణ పరాయణులగుట దుష్కరంబు; గావున నాత్యంతికంబగు క్షేమంబడుగ వలసెఁ; బరమేశ్వరుండు ప్రపత్తినిష్ఠులకు సారూప్యం బెట్లొసంగు నత్తెఱం గానతిం” డనిన విని విదేహభూపాలునకు హరికథామృత పానాతిపరవశులైన మునిసమాజంబునందుఁ గవి యను మహానుభావుం డిట్లని చెప్పం దొడంగె; “నరిషడ్వర్గంబునందు నీషణత్రయంబుచేతం దగులువడి మాత్సర్యయుక్త చిత్తుం డగు నట్టి వానికెవ్విధంబున నచ్యుత పాదారవింద భజనంబు సంభవించు? విశ్వంబును నాత్మయు వేఱుగా భావించు వానికి భీరుత్వం బెట్లు లే? దవిద్యాంధకారమగ్నులకు హరిచింతనంబెట్లు సిద్ధించు? నట్టి నరుండు తొంటికళేబరంబు విడిచి పరతత్త్వం బెబ్భంగిం జేరు? ముకుళీకృతనేత్రుండయిన నరుండు మార్గభ్రమణంబునఁ దొట్రుపాటువడి చను చందంబున విజ్ఞానవిమలహృదయభక్తిభావనా వశంబు లేకున్నఁ బరమపదంబు వీరికెవ్విధంబునం గలుగు? నని యడిగితివి; గావునఁ జెప్పెద; సావధానుండవై యాకర్ణింపుము.

భావము:
అంతేకాదు సకల రకాల జంతువుల జన్మల కంటె మానవ జన్మ శ్రేష్ఠమైనది, అది ప్రాప్తించటం కష్ట సాధ్యం. అందులోనూ శ్రీమన్నారాయణుని చరణయుగళ స్మరణంమీద ఆసక్తి కలగటం మరీ కష్టం. అందువలన, శాశ్వతమైన క్షేమాన్ని గురించి అడుగ వలసి వచ్చింది. ప్రపత్తి యందు నిష్ఠగల భక్తులకు పరమేశ్వరుడు శ్రీమహావిష్ణువు సారూప్యం ఎలా ఇస్తాడు, ఈ విషయం చెప్పండి.” అని అడిగిన విదేహరాజుతో శ్రీహరి కథామృతాన్ని త్రాగి పరవశులు ఐన ఆ మునులలో కవి అనే మహానుభావుడు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు.
“(1) అరిషడ్వర్గం అనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఆరింటిలోను; ఈషణత్రయం అనే దారేషణ ధనేషణ పుత్రేషణ మూడింటిలోనూ; చిక్కుకుని మాత్సర్యంతో కూడిన మనసు కల మానవుడికి శ్రీహరి పాదపద్మాలను భజించే భాగ్యం ఎలా ప్రాప్తిస్తుంది?
(2) విశ్వము వేరు, ఆత్మ వేరు అని భావించే వాడికి భయం ఎలా లేకుండా పోతుంది?
(3) అట్లు అవిద్యాంధకారంలో మునిగితేలే వాడికి విష్ణుభక్తి ఎలా అలవడుతుంది?
(4) అటువంటి నరుడు మొదటి శరీరాన్ని త్యజించి పరతత్వాన్ని ఏ విధంగా చేరుతాడు?
(5) కండ్లు మూసుకుని నడిచే మనిషి దోవలో తడబాటులు పడుతూ పోతున్నట్లుగా, విజ్ఞానంతో శుద్ధమైన హృదయంలో భక్తిభావన లేకుండా పోతే పరమపదం ఎలా సిద్ధిస్తుంది” అని అడిగావు. సమాధానాలు చెప్తాను శ్రద్ధగా విను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=7&Padyam=41

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: