Tuesday, November 29, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౧(691)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-77-వ.
అనిన విని యందుఁ గరభాజనుం డిట్లనియె; “ననేకావతారంబులు నానా రూపంబులును బహువిధ వర్ణంబులునుం గలిగి, రాక్షసులను సంహరించి, దుష్టజన నిగ్రహంబును శిష్టజన పరిపాలనంబునుం జేయుచుఁ గృతయుగంబున శుక్లవర్ణుండై చతుర్బాహుండై జటావల్కల కృష్ణాజినోత్తరీయ జపమాలికా దండ కమండలు ధరుండయి హరి నిర్మలతపోధ్యానానుష్ఠానగరిష్ఠు లైన పురుష శ్రేష్ఠులచేత హంసుండు, సువర్ణుండు, వైకుంఠుండు, ధర్ముం, డమలుండు, యోగేశ్వరుం, డీశ్వరుండు, పురుషుం, డవ్యక్తుండు, పరమాత్ముం డను దివ్యనామంబులం బ్రసిద్ధి వహించి గణుతింపంబడుఁ; ద్రేతాయుగంబున రక్తవర్ణుం డయి బాహుచతుష్క మేఖలాత్రయ విశిష్టుం డయి హిరణ్యకేశుండును, వేదత్రయస్వరూపుండును, స్రుక్‌ స్రువాద్యుపలక్షణ శోభితుండునయి విష్ణు, యజ్ఞ, పృశ్నిగర్భ, సర్వదేవోరుక్రమ, వృషాకపి, జయంతోరుగాయాఖ్యల బ్రహ్మవాదుల చేత నుతియింపంబడు; ద్వాపరంబున శ్యామలదేహుండును, పీతాంబరధరుండును, బాహుద్వయోపశోభితుండును, దివ్యాయుధధరుండును, శ్రీవత్స కౌస్తుభ వనమాలికా విరాజమానుండును, మహారాజోపలక్షణుండు నై జనార్దన, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్నానిరుద్ధ, నారాయణ, విశ్వరూప, సర్వభూతాత్మ కాది నామంబుల వెలసి, మూర్ధాభిషిక్తులచేత సన్నుతింపంబడు; కలియుగంబునఁ గృష్ణవర్ణుండును గృష్ణనామకుండునునై భక్తసంరక్షణార్థంబు పుండరీకాక్షుండు యజ్ఞ సంకీర్తనంబుల చేతం బ్రస్తుతింపబడు; హరి, రామ, నారాయణ, నృసింహ, కంసారి, నలినోదరాది బహువిధ నామంబులచే బ్రహ్మవాదులైన మునీంద్రులు నుతియింపుదురు; మఱియును.

భావము:
అని అడుగగా విని వారిలో కరభాజనుడనే ఋషి విదేహరాజుతో ఇలా అన్నాడు. ఎన్నో అవతారాలు; ఎన్నెన్నో రూపాలు; అనేక రకాల వర్ణాలు ధరించి రాక్షసులను సంహరించి; దుష్టశిక్షణం శిష్టరక్షణం కావించే శ్రీ మహవిష్ణువు…

కృతయుగంలో తెల్లని రంగుతో నాలుగుచేతులు కలిగి ఉంటాడు; జడలు నారచీరలు జింకచర్మం జపమాలిక దండం కమండలము దాల్చి నిర్మలమైన తపస్సు ధ్యానము అనుష్టానము గల మునిశ్రేష్ఠులచేత హంసుడు, సుపర్ణుడు, వైకుంఠుడు, ధర్ముడు, అమలుడు, యోగీశ్వరుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్ముడు అనే దివ్య నామాలతో ప్రశంసింపబడుతూ ప్రసిద్ధి చెందుతాడు.

త్రేతాయుగంలో ఎఱ్ఱనిరంగుతో, నాలుగుచేతులు బంగరురంగు జుట్టు కలిగి, మూడు పేటల మేఖలలు ధరించి, మూడువేదాల ఆకృతి ధరించి, స్రుక్కు స్రువము మొదలైన ఉపలక్షణాలతో శోభిల్లుతూ; విష్ణువు, యజ్ఞుడు, పృశ్నిగర్భుడు, సర్వదేవుడు, ఉరుక్రముడు, వృషాకపి, జయంతుడు, ఉరుగాయుడు అనే పేర్లతో బ్రహ్మవాదులచేత నుతింపబడతాడు.

ద్వాపరయుగంలో నీలవర్ణంతో, పసుపుపచ్చని బట్టలు కట్టుకుని, రెండు చేతులతో, దివ్యమైన ఆయుధాలు పట్టుకుని, శ్రీవత్సం కౌస్తుభం వనమాలికల ప్రకాశిస్తూ; మహారాజ లక్షణాలు కలిగి జనార్ధునుడు, వాసుదేవుడు, సంకర్షుణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, విశ్వరూపుడు, సర్వభూతాత్మకుడు మున్నగు పేర్లతో వెలసి చక్రవర్తులచేత సన్నుతించబడతాడు.

కలియుగంలో నల్లనిరంగుతో కృష్ణుడు అనుపేరు కలిగి, భక్తులను రక్షించడానికి పుండరీకాక్షుడు యజ్ఞములందు కీర్తించబడతాడు. అప్పుడు ఆయనను హరి, రాముడు, నారాయణుడు, నృసింహుడు, కంసారి, నళినోదరుడు మున్నగు పేర్లతో బ్రహ్మవాదులైన మునీంద్రులు స్తుతిస్తూంటారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=77

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Saturday, November 26, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౦(690)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-75-వ.
అట్లు గావున గృహ క్షేత్ర పుత్త్ర కళత్ర ధనధాన్యాదులందు మోహితుండయి ‘ముక్తిమార్గంబు లప్రత్యక్షంబు’ లని నిందించువాఁడును, హరి భక్తివిరహితుండును, దుర్గతిం గూలుదు” రని మునివరుం డానతిచ్చిన విదేహుం డిట్లనియె.
11-76-ఆ.
"ఏ యుగంబునందు నే రీతి వర్తించు?
నెట్టి రూపువాఁడు? నెవ్విధమున
మును నుతింపఁబడెను మునిదేవగణముచే
విష్ణుఁ డవ్యయుండు విశ్వవిభుఁడు?

భావము:
అందుచేత, ఇండ్లు పొలాలు, సంతానం, భార్య, ధనం, ధాన్యం మున్నగు వాటిమీద వ్యామోహంతో మోక్షం కంటికి కనపడేదికాదు. కనుక లేదని నిందించే వారు; హరిభక్తి లేనివారు దుర్గతిలో కూలిపోతారు.” అని మునిశ్రేష్ఠుడు అనగా విదేహుడు ఇలా అడిగాడు. “అవ్యయుడు, జగన్నాథుడు అయిన విష్ణుమూర్తి ఏ యుగంలో ఏ రీతిగా ఉన్నాడు? ఏ రూపం ధరించాడు? ఏ విధంగా మునులచేత, దేవతలచేత కీర్తించబడ్డాడు?”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=76

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

శ్రీకృష్ణ విజయము - ౬౮౯(689)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-73-వ.
ఇవ్విధంబునం బ్రవర్తిల్లిన శ్రీమన్నారాయణమూర్తి లీలావిలాసంబు లనంతంబులు గలవు; మనోవాక్కాయకర్మంబుల హరిపూజనంబు సేయక, విపరీత గతులం దిరుగుచుండు జడుల కెవ్విధం బగు గతిగలుగు?” ననిన నప్పు డప్పుడమిఱేఁ డప్పరమపురుషుం జూచి “యట్టి జడులు ముక్తి నొందు నుపాయం బెట్టు లంతయు నెఱింగింపుఁ” డనినఁ జమసుం డిట్లనియె.
11-74-సీ.
"హరిముఖ బాహూరు వరపదాబ్జములందు-
  వరుసఁ జతుర్వర్ణ వర్గసమితి
జనియించె; నందులో సతులును శూద్రులు-
  హరిఁ దలంతురు; కలిహాయనముల
వేదశాస్త్ర పురాణ విఖ్యాతులై కర్మ-
  కర్తలై విప్రులు గర్వ మెసఁగి
హరిభక్తపరులను హాస్యంబు సేయుచు -
  నిరయంబు నొందుట నిజము గాదె?
11-74.1-తే.
మృదుల పక్వాన్న భోజనములను మాని
జీవహింసకుఁ జనువానిఁ జెందు నఘము;
హరి నుతింపక స్త్రీలోలుఁ డైనఁవాడు
నరకవాసుండు నగుచుండు ననవరతము.

భావము:
ఇలా హరిస్తుతి చేసి ఇలా అన్నాడు. “ఈ విధంగా ప్రవర్తిల్లిన శ్రీమన్నారాయణమూర్తి లీలావిలాసములు లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. మనోవాక్కాయకర్మలా హరిపూజ చేయకుండా విపరీత మార్గాలలో తిరుగుతూ ఉండే మూఢులకు ఏవిధంగానూ సద్గతి కలుగదు.” అని మహాముని అనగా ఆ మహారాజు ఆ పరమపురుషులతో “అటువంటి మూర్ఖులు ముక్తిపొందే ఉపాయం తెలియ జెప్పండి.” అని అడిగాడు. వారిలో చమసుడనే మునిముఖ్యుడు విదేహుడితో ఇలా అన్నాడు. విష్ణుమూర్తి ముఖం బాహువులు తొడలు పాదములు వీటి యందు వరుసగా వర్ణములు నాలుగు పుట్టాయి. అందులో స్త్రీలు శూద్రులు హరిని తలుస్తారు. కలికాలంలో విప్రులు వేద శాస్త్ర పురాణాలందు ప్రసిద్ధులై, కర్మలుచేస్తూ గర్వంతో హరిభక్తులను అపహాస్యం చేస్తారు. వారు నరకానికి పోవటం ఖాయం. స్వచ్ఛమైన పక్వాన్నం భుజించుట మాని మాంసాహారులై జీవహింసకు పాల్పడేవాడికి పాపం తగులుతుంది. శ్రీహరిని నుతింపక స్త్రీలోలు డైనవాడికి ఎప్పుడూ నరకమే నివాసం.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=74

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Wednesday, November 23, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౮౮(688)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-72-ససీ.
నవ వికచ సరసిరుహ నయనయుగ! నిజచరణ-
  గగనచరనది జనిత! నిగమవినుత!
జలధిసుత కుచకలశ లలిత మృగమద రుచిర-
  పరిమళిత నిజహృదయ! ధరణిభరణ!
ద్రుహిణముఖ సురనికర విహిత నుతికలితగుణ!-
  కటిఘటిత రుచిరతర కనకవసన!
భుజగరిపు వరగమన! రజతగిరిపతివినుత!-
  సతతజపరత! నియమసరణి చరిత!
11-72.1-తే.
తిమి, కమఠ, కిటి, నృహరి, ముదిత బలి నిహి
త పద, పరశుధర, దశవదన విదళన,
మురదమన, కలికలుష సుముదపహరణ!
కరివరద! ముని నర సుర గరుడ వినుత!

భావము:
“నవవికసిత పద్మములవంటి కన్నుల జంట కలవాడ! హరి! పాదము మూలము లందు ఆకాశగంగ పుట్టినవాడ! వేదములచేత పొగడబడు వాడ! లక్ష్మీదేవి యొక్క కలశముల వంటి వక్షోజాలకు అలరుతుండెడి కస్తూరి పరిమళాలు అంటిన హృదయం కలవాడ! భూమిని మోసిన వాడ! బ్రహ్మదేవుడు మున్నగు దేవతలు సంస్తుతించు వాడ! నడుము నందు బంగారచేలము ధరించినవాడ! గరుత్మంతుడు వాహనముగా కలవాడ! కైలాసపతి శంకరునిచే నుతింపబడు వాడ! నిరంతర జపం చేసే వారి యందు ఆసక్తి కలవాడ! నియమబద్ధమైన చరిత్ర కలవాడ! మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, బలరామ, రామ, కృష్ణ, కల్కి అను దశావతారములను దాల్చినవాడ! గజేంద్రవరదా! మునులు నరులు సురలు గరుడులు మున్నగు వారిచే పొగడబడు వాడ!”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=72

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Monday, November 21, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౮౭(687)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-70-తే.
ఋషభునకు నాత్మయోగ మీ రీతిఁ జెప్పె;
నచ్యుతుఁడు భూమిభారము నడఁప నంత
సొరిది నవతారములు దాల్చి సొంపు మీఱ
రాత్రిచరులను జంపె నీరసముతోడ.
11-71-వ.
అట్టి పరమేశ్వరుని లీలాగృహీతంబులగు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామ రఘురామ రామ బుద్ధ కల్క్యాద్యవతారంబు లనేకంబులు గలవు; వాని నెఱిఁగి నుతియింప శేషభాషాపతులకైన నలవి గాదు; మఱియును.

భావము:
ఋషభునకు ఆత్మయోగాన్ని ఈ విధంగా ఉపదేశించిన అచ్యుతుడు విష్ణువు భూభారాన్ని అణచుటకు ఎన్నోఅవతారాలెత్తి పట్టుదలతో దుర్మార్గులు అయిన రాక్షసులను సంహరించాడు. అటువంటి పరమేశ్వరుడు లీలావిలాసంగా గ్రహించిన అవతారాలు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రఘురామ బలరామ బుద్ధ కల్కి అనే దశావతారాలే కాదు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని తెలిసి స్తుతించటం బ్రహ్మదేవుడికైనా, ఆదిశేషునికైనా అలవి కాదు.” అని పలికి శ్రీహరిని ఇలా స్తుతించాడు

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=71

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Sunday, November 20, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౮౬(686)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-69-వ.
అమ్మునీశ్వరుండు పరమాశ్చర్యవిధానంబుగా నిజతనూరుహంబుల వలనం ద్రికోటి కన్యకానివహంబుల నుద్భవింపం జేసిన, గంధర్వవిబుధకామినీ సముదయంబులు పరమాద్భుత భయంబులు మనంబులం బొడమ సన్నుతించి, యవ్విలాసినీసమూహంబులో నూర్వశియను దానిం గొనిచని, పాకశాసను సభాసదనంబునం బెట్టి తద్వృత్తాంతం బంతయు విన్నవించిన నాశ్చర్య యుక్త హృదయుండయి సునాసీరుం డూరకుండె; నట్టి నారాయణ మునీశ్వరుచరిత్రంబు వినువారలు పరమ కల్యాణగుణవంతు లగుదు" రని చెప్పిన.

భావము:
ఆ మునిశ్రేష్ఠుడు అందరూ ఆశ్చర్యపోయేలా తన రోమకూపాల నుండి మూడుకోట్ల కన్యకలను పుట్టించాడు. అది చూసిన ఆ అప్సరసలు అత్యంత ఆశ్చర్యంతో భయంతో ఆ మహర్షిని స్తుతించారు. ఆ అందగత్తెలలో నుండి ఊర్వశి అనే ఒక సుందరాంగిని తీసుకుని వెళ్ళి జరిగినదంతా ఇంద్రునికి చెప్పారు. మునిశక్తికి వెరగుపడిన ఇంద్రుడు మిన్నకున్నాడు. అటువంటి నారాయణముని చరిత్ర వినే వాళ్ళు మిక్కిలి శుభకరమైన గుణాలను పొందుతారు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=69

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : .

Saturday, November 19, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౮౫(685)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-68-సీ.
"దేవమునీంద్ర! నీ దివ్యచారిత్రంబు-
  నెఱిఁగి సన్నుతిసేయ నెవ్వఁడోపుఁ?
బుత్త్ర మిత్ర కళత్ర భోగాదులను మాని-
  తపము గావించు సద్ధర్ములకును
విఘ్నముల్‌ సెందునే? విశ్వేశుఁ గొల్చిన-
  యతనికి నంతరాయంబు గలదె?
కామంబుఁ గ్రోధంబుఁ గల తపస్వితపంబు-
  పల్వలోదకములభంగిఁ గాదె?
11-68.1-తే.
నిన్ను వర్ణింప నలవియే? నిర్మలాత్మ!
రమణ లోఁగొను మా యపరాధ" మనుచు
సన్నుతించిన నతఁడు ప్రసన్నుఁ డగుచుఁ
దనదు సామర్థ్య మెఱిఁగింపఁ దలఁచి యపుడు.

భావము:
“దేవమునీంద్రా! నీ దివ్యమైన చరిత్ర గ్రహించి స్తుతించటానికి ఎవరికి సాధ్యం అవుతుంది. పుత్రులు, మిత్రులు, భార్యలు మొదలైన భోగాలను వదలి తపస్సు చేసే సద్ధర్మ పరులకు విఘ్నాలు కలుగుతాయా? జగదీశ్వరుడిని కొలిచేవారికి ఆటంకాలు ఉంటాయా? కామం క్రోధం కలిగిన తాపసుల తపస్సు బురదగుంటలోని నీటి వంటిది కదా. ఓ నిర్మలాత్మా! నిన్ను వర్ణించడం మాతరం కాదు. మా తప్పులు క్షమించు.” అని నుంతించారు. అంత నారాయణమహర్షి ప్రసన్నుడై తన సామర్ధ్యాన్ని తెలియజేయాలని అనుకున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=68

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : .

Friday, November 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౮౪(684)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-66-చ.
మదనుని బాణజాలముల మగ్నతఁ బొందక ధైర్యవంతుఁ డై,
ముదితల వాఁడిచూపులకు మోహము నొందక నిశ్చలాత్ముఁడై,
హృదయమునందు నచ్యుతు రమేశు ననంతు జగన్నివాసునిన్‌
వదలక భక్తి నిల్పుకొని వారికి నిట్లనె మౌని పెంపునన్,
11-67-క.
"జంభారిపంపునను మీ
రంభోరుహవదనలార! యరుదెంచితి; రా
శుంభద్విహారవాంఛా
రంభంబునఁ దిరుగుఁ" డనిన లజ్జించి వెసన్‌.

భావము:
ఆ సమయంలో నారాయణఋషి మన్మథుని బాణాలకు లొంగ లేదు. ధైర్యము విడువలేదు. ఆ కాంతల వాడి చూపులకు మోహము పొంద లేదు. ఏమాత్రం చలించక తన హృదయంలో అచ్యుతుడు, అనంతుడు, జగన్నివాసుడు, రమేశుడు అయిన శ్రీహరిని నిశ్చలభక్తితో మనసున నిలుపుకుని ఉన్నాడు. ఆయన వారితో ఇలా అన్నాడు. “పద్మముఖులార! ఇంద్రుడు పంపగా మీరు వచ్చారు. ఇక్కడ విహరించాలనే కోరిక ఉంటే మీ ఇష్టంవచ్చినట్లు తిరగండి.” అనేటప్పటికి వాళ్ళంతా సిగ్గుపడి ఆ మహర్షితో ఇలా అన్నారు..

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=67

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : .

శ్రీకృష్ణ విజయము - ౬౮౩(683)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-65-వ.
వారు నారాయణాశ్రమంబునకు నతని తపోవిఘ్నంబు సేయ వచ్చునప్పు డవ్వనంబు సాల రసాల బిల్వ కదళీ ఖర్జూర జంబు జంబీర చందన వున్నాగ మందారాది వివిధ వృక్ష నిబిడంబును, పుష్ప ఫల భరిత శాఖావనమ్ర తరులతా బృందంబును, మాధవీ కుంజమంజరీ పుంజ మకరందపాన మత్తమధుకర నికర ఝంకారరవ ముఖరిత హరి దంతరంబును, గనక కమల కహ్లార విలసత్సరోవిహరమాణ చక్రవాక బక క్రౌంచ మరాళదంపతీ మండల మండితంబును, మృణాళ భోజనాసక్త సారసచయ చంచూపుట విపాటిత కమలముకుళకేసర విసర వితత ప్రశస్త సరోవరంబును నై వెలయు నవ్వనంబున నిందువదన లందంద మందగమనంబులం జెందు ఘర్మజలబిందుబృందంబులు నఖాంతంబుల నోసరింపుచు డాయంజను నప్పుడు.

భావము:
ఆ ప్రకారం వారు నారాయణాశ్రమానికి అతని తపస్సును భగ్నంచేయడానికి వచ్చారు. ఆ తపోవనం మామిడి, మద్ది, మారేడు, అరటి, ఖర్జూరం, నేరేడు, నిమ్మ, చందనం, సురపొన్న, మందారం మొదలైన అనేక వృక్షాలతో నిండి ఉన్నది. పూలతో, పండ్లతో కొమ్మలు క్రిందికి వంగి ఉన్నాయి. గురువింద పొదల పూలగుత్తుల మకరందం త్రాగి మదించిన తుమ్మెదలు చేసే ఝంకారాలతో దిక్కులు నిండిపోతున్నాయి. బంగారు పద్మాలు, కలువలు, ప్రకాశించే సరస్సులలో జక్కవలు, కొంగలు, క్రౌంచ పక్షులు, హంసలు జంటజంటలుగా విహరిస్తున్నాయి. తామరతూళ్ళను తినుటం కోసం సారసపక్షులు ముక్కులతో చీల్చబడిన తామర మొగ్గలలోని కేసరాలతో సరోవరాలు భాసిస్తూ ఉన్నాయి. అటువంటి తపోవనంలో ఆ చంద్రముఖులైన అప్సరసలు నెమ్మదిగా నడుస్తూ చెమట బిందువులను కొనగోళ్ళతో చిమ్ముకుంటూ నారాయణమహర్షిని సమీపించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=65

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, November 16, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౮౨(682)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-63-క.
ధర్ముండు దక్షపుత్త్రిక
నిర్మలమతిఁ బెండ్లియాడి నెఱిఁ బుత్త్రుని స
త్కర్ముని నారాయణ ఋషి
నర్మిలిఁ గనె నతఁడు బదరికాశ్రమ మందున్‌.
11-64-తే.
అట్టి నారాయణాహ్వయుం డైన మౌని
బదరికాశ్రమమందు నపార నిష్ఠఁ
దపముఁ గావింప బలభేది దలఁకి మదిని
మీనకేతను దివిజకామినులఁ బనిచె.

భావము:
బదరీకాశ్రమంలో ధర్ముడు దక్షపుత్రికను పెండ్లాడాడు. ఆ దంపతులకు సత్కర్ముడు పరిశుద్ధుడు ఐన నారాయణఋషి జన్మించాడు. ఆ నారాయణముని బదరికాశ్రమంలో అపారమైన నిష్ఠతో తపస్సు చేయసాగాడు ఆయన తపస్సుకు ఇంద్రుడు భయపడి తపోభంగం నిమిత్తం మన్మథుడిని అప్సరసలను పంపించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=64

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, November 15, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౮౧(681)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-61-క.
"తారల నెన్నఁగ వచ్చును;
భూరేణుల లెక్కవెట్టఁ బోలును ధాత్రిన్‌;
నారాయణగుణకథనము
లారయ వర్ణింపలేరు హర బ్రహ్మాదుల్‌.
11-62-వ.
అట్లు గావున నాత్మసృష్టంబైన పంచభూతనికరంబును పురం బొనరించి, యందు నిజాంశంబునం బ్రవేశించి, సగుణనిష్ఠుండై నారాయణాభిధానంబు గల ఋషీశ్వరుం డగు పరమేశ్వరుండు వెలుఁగొందె; నతని దశేంద్రియంబులచేఁ బాలితంబులైన దేహంబులు ధరించి, జగద్రక్షకత్వ సంహారకత్వాది గుణంబులు గలుగుటం జేసి గుణనిష్ఠుండయి రజస్సత్త్వతమో గుణంబుల బ్రహ్మ విష్ణు రుద్ర మూర్తులనం బరఁగి, త్రిగుణాత్మకుం డనంబడు నారాయణాఖ్యుని చరిత్రం బెఱింగించెద; నాకర్ణింపుము.

భావము:
"రాజా! ఆకాశంలోని చుక్కలను లెక్కపెట్టవచ్చు. భూమిపై గల ఇసుక రేణువులను కూడ లెక్కపెట్టవచ్చును. కానీ నారాయణుని గుణములు చరిత్రలను మాత్రం శివుడు బ్రహ్మ మొదలైనవారు కూడ వర్ణించ లేరు. భగవంతుడు తాను సృష్టించిన పంచభూతాలతో సంభూతమైన పురమును చేసి, దానిలో తన అంశతో ప్రవేశించి పిమ్మట సగుణనిష్ఠుడై నారాయణుడు అను పేరు కల ఋషీశ్వరుడుగా విరాజిల్లాడు. ఆయన పది ఇంద్రియాలతో నిర్మితాలైన శరీరాలను దాల్చి జగత్తును సృష్టించటం రక్షించటం సంహరించటం మొదలైన కార్యాలు చేయటం వలన రజస్సత్త్వతమోగుణాలతో బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అనే పేర్లతో ఒప్పుతుంటాడు. త్రిగుణాత్మకుడు అనబడే ఆ నారాయణుని చరిత్ర చెబుతాను విను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=12&Padyam=62

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

శ్రీకృష్ణ విజయము - ౬౮౦(680)

( ఆవిర్హోత్రుని భాషణ ) 

11-59-క.,
"పురుషుం డే యే కర్మము
పరువడిఁ గావించి పుణ్యపరుఁడై మనుఁ? దా
దురితములుఁ దొరఁగి మురరిపు
చరణయుగం బెట్లు సేరు? సన్మునివర్యా! "
11-60-వ.
అనిన విని యందావిర్హోత్రుం డిట్లనియెఁ; “గర్మాకర్మ వికర్మ ప్రతిపాదకంబు లగు శ్రుతివాదంబులలౌకికవర్ణితంబు; లట్టి యామ్నాయంబులు సర్వేశ్వరస్వరూపంబులు గాన విద్వాంసులు నెఱుంగ లే; రవి కర్మాచారంబు లనంబడు; మోక్షంబుకొఱకు నారాయణ భజనంబు పరమపావనంబు; వేదోక్తంబుల నాచరింపక ఫలంబులకు వాంఛ సేయువార లనేక జన్మాంతరంబులం బడయుదురు; మోక్షంబు నపేక్షించు వాఁడు విధిచోదిత మార్గంబున హరిం బూజింపవలయు; నట్టి పూజాప్రకారం బెట్లనినఁ, బవిత్రగాత్రుం డయి జనార్దను సన్నిధిం బూతచిత్తుండై, షోడశోపచారంబులఁ జక్రధరు నారాధించి, గంధ పుష్ప ధూప దీప నైవేద్యంబులు సమర్పించి, సాష్టాంగదండ ప్రణామంబు లాచరించి, భక్తిభావనా విశేషుండగు నతండు హరింజేరు” నని చెప్పిన విని విదేహుం డిట్లనియె; “నీశ్వరుం డేయే కర్మంబుల నాచరించె, నంతయు నెఱిగింపు” మనినఁ ద్రమిళుం డిట్లనియె.

భావము:
“మహర్షిపుంగవ! పురుషుడు ఏయే కర్మలను ఆచరిస్తే పుణ్యుడై పాపాలను పోగొట్టుకుని మురవైరి పాదాలను చేరుకోగలుగుతాడో చెప్పండి.” అలా అడుగగా ఆవిర్హోత్రుడనే మహాముని విదేహప్రభువుతో ఈ విధంగా చెప్పసాగాడు. “కర్మ అకర్మ వికర్మ వీటిని ప్రతిపాదించే శ్రుతివాదులు లౌకికులు చెప్పినవి కాదు. అటువంటి వేదాలు సర్వేశుని స్వరూపాలు వాటిని పండితులు కూడ తెలుసుకోలేరు. వాటిని కర్మాచారాలు అంటారు. మోక్షంకోసం నారాయణ భజనం అన్నిటి కంటే పవిత్రమైనది. వేదం చెప్పినట్లు చేయక ఫలాలు కోరేవారు ఎన్నో జన్మలు ఎత్తుతారు. మోక్షాన్ని కోరేవారు శాస్త్రం చెప్పినవిధంగా హరిని పూజించాలి. ఆ పూజావిధానం ఎటువంటిదంటే పరిశుద్ధమైన దేహంతో భగవంతుని సన్నిధిలో పవిత్రచిత్తుడై ప్రవర్తించాలి. షోడశోపచారాలతో చక్రధరుని ఆరాధించాలి. గంథం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అర్పించి సాష్టాంగదండప్రణామాలు చేయాలి. విశేషమైన భక్తిభావం మనసున నింపుకోవాలి. అట్టివాడు పరమాత్మను జేరుతాడు.” అని వివరించగా విని విదేహమహారాజు ఇలా అన్నాడు. “ఈశ్వరుడు ఏ లీలలు ఆచరించాడు. ఆ వివరం అంతా తెలుపవలసింది.” అనగా ద్రమిళుడనే మునివర్యుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=12&Padyam=60

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, November 14, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౯(679)

( పిప్పలాయన భాషణ ) 

11-58-వ.
దీనికిం బెక్కైనది పరమాత్మగా నెఱింగి కమలసంభవాదులు నుతియింతు; రిట్టి పరమాత్మ స్థావరజంగమంబుల నధిష్ఠించి వృద్ధి క్షయంబులం బొందక నిమిత్తమాత్రంబునం దరులతాదు లందు జీవంబు లేక తదంతరస్థుండై వర్తించు; నంత సర్వేంద్రియావృతం బైన యాకారంబు నష్టంబైన మనంబునుం బాసి శ్రుతివిరహితుం డై తిరుగుచుండు; నిర్మల జ్ఞానదృష్టి గలవానికి భానుప్రభాజాలంబు దోఁచిన క్రియను, సుజ్ఞానవంతుడు హరిభక్తిచేత గుణకర్మార్థంబులైన చిత్తదోషంబులు భంజించి భగవత్సదనంబు సేరు” ననిన విని రాజిట్లనియె.

భావము:
ఇందుకు అతీతమైన దాన్ని పరమాత్మగా తెలుసుకుని బ్రహ్మ మొదలైనవారు స్తుతిస్తారు. ఇటువంటి పరమాత్మ స్థావరజంగమాలను అధిష్టించి వృద్ధిక్షయాలు పొందక నిమిత్రమాత్రంగా చెట్లు తీగలు మొదలైనవాని లోపల వర్తిస్తుంటాడు. సర్వేంద్రియాలచే ఆవరించబడిన ఆకారము పోగా మనస్సును వదలి శ్రుతి విరహితుడై తిరుగుతుంటాడు. నిర్మలమైన జ్ఞానదృష్టి కలవాడు సూర్యుని కాంతి పుంజం దర్శించినట్లు. సుజ్ఞాని అయినవాడు హరిభక్తిచేత గుణకర్మార్థములైన చిత్త దోషాలను నశింపజేసి ఈశ్వరుని చేరుకోగలుగుతాడు.” అంటే విని విదేహుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=11&Padyam=58

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౬౭౮(678)

( పిప్పలాయన భాషణ ) 

11-57-సీ.
"నరవర! విను జగన్నాథుని చారిత్ర-
  మెఱిఁగింతు నీమది కింపు మిగుల
లసదుద్భవస్థితిలయ కారణంబయి-
  దేహేంద్రియాదులఁ దిరము గాఁగఁ
జొనుపు నెప్పుడు పరంజ్యోతిస్స్వరూపంబు-
  జ్వాలల ననలుండుఁ జనని పగిది
నింద్రియంబులు నాత్మ నెనయవు శబ్దంబు-
  పొరయక సుషిరంబుఁ బొందు, సత్య
11-57.1-తే.
మనఁగ సత్త్వరజస్తమోమయగుణంబు,
మహదహంకారరూపమై మహిమ వెలయు
చేతనత్వంబు గలదేని జీవ మందు,
రిదియ సదసత్స్వరూపమై యెన్నఁబడును.

భావము:
“రాజా! విను నీకింపు కలిగే విధంగా లోకేశ్వరుని చరిత్ర చెబుతాను. సృష్టి స్థితి లయాలకు కారణమైన పరంజ్యోతి స్వరూపం దేహేంద్రియాలలో స్థిరంగా ప్రవేశిస్తుంది మంటలు అగ్నిలోపల ప్రవేశింపలేనట్లు, ఇంద్రియాలు ఆత్మను ఆక్రమించలేవు. నాదం పిల్లనగ్రోవిని లోగొన లేదు కదా. సత్త్వము రజస్సు తమస్సు అనే గుణత్రయం మహదహంకార రూపమై చైతన్యంతో కలిస్తే జీవమంటారు. ఇదే సత్తు అసత్తు స్వరూపంగా ఎన్నబడుతుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=11&Padyam=57

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, November 11, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౭(677)

( ప్రబుద్ధుని సంభాషణ ) 

11-55-క.
"హరిదాసుల మిత్రత్వము
మురరిపుకథ లెన్నికొనుచు మోదముతోడన్‌
భరితాశ్రుపులకితుండై
పురుషుఁడు హరిమాయ గెల్చు భూపవరేణ్యా!"
11-56-వ.
అనిన రాజేంద్రుండు వారల కిట్లనియె; “భాగవతులారా! సకలలోకనాయకుం డగు నారాయణుం డనంబరఁగిన పరమాత్ముని ప్రభావంబు వినవలతు; నానతిం” డనినఁ బిప్పలాయనుం డిట్లనియె.

భావము:
మహారాజ! హరిభక్తులతో స్నేహంచేస్తూ హరిలీలలను తలచుకుంటూ కన్నులలో ఆనందబాష్పాలు నిండగా ఒళ్ళు పులకరిస్తుండగా మానవుడు హరిమాయను గెలుస్తాడు.” అనగా ఆ విదేహచక్రవర్తి వాళ్ళతోఇలాఅన్నాడు. “భాగవతులారా! సమస్త లోకాలకూ ప్రభువై నారాయణుడనే నామంతో అలరారే పరమాత్ముని ప్రభావాన్ని వినాలనుకుంటున్నాను ఆనతీయండి.” అంటే పిప్పలాయను డనే మునీంద్రుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=10&Padyam=56

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Thursday, November 10, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౭(677)

( అంతరిక్షు సంభాషణ ) 

11-54-వ.
“సూర్యోదయాస్తమయంబులం బ్రతిదినంబు నాయువు క్షీణంబు నొంద, దేహ కళత్ర మిత్ర భ్రాతృమమత్వ పాశబద్ధులై విడివడు నుపాయంబు గానక, సంసారాంధకారమగ్నులయి గతాగతకాలంబుల నెఱుంగక, దివాంధంబులగు జంతుజాలంబుల భంగి జన్మ జరా రోగ విపత్తి మరణంబు లందియు, శరీరంబ మేలనుచుఁ బ్రమోద మోహమదిరాపానమత్తులై, విషయాసక్తతం జిక్కి, తమ్ముఁ దారెఱుంగక యుండి, విరక్తిమార్గంబు దెలియక వర్తించు మూఢు లగు జనంబుల పొంతలఁ బోవక; కేవల నారాయణ భక్తి భావంబు గల సద్గురుం బ్రతిదినంబును భజియించి; సాత్త్వికంబును, భూతదయయును, హరికథామృతపానంబును, బ్రహ్మచర్యవ్రతంబును, విషయంబుల మనంబు సేరకుండుటయు, సాధు సంగంబును, సజ్జన మైత్రియు, వినయసంపత్తియు, శుచిత్వంబును, తపంబును, క్షమము, మౌనవ్రతంబును, వేదశాస్త్రాధ్యయన తదర్థానుష్ఠానంబులును, నహింసయు, సుఖదుఃఖాది ద్వంద్వసహిష్ణుతయు, నీశ్వరుని సర్వగతునింగా భావించుటయు, ముముక్షుత్వంబును, జనసంగ వర్జనంబును, వల్కలాది ధారణంబును, యదృచ్ఛాలాభ సంతుష్టియు, వేదాంతశాస్త్రార్థ జిజ్ఞాసయును, దేవతాంతరనిందా వర్జనంబును, గరణత్రయ శిక్షణంబును, సత్యవాక్యతయు, శమదమాదిగుణ విశిష్టత్వంబును, గృహారామ క్షేత్ర కళత్ర పుత్త్ర విత్తాదుల హరికర్పణంబు సేయుటయు, నితర దర్శన వర్జనంబు సేయుటయును భాగవతోత్తమధర్మంబు” లని చెప్పి యిట్లనియె.

భావము:
“ప్రతిదినము మానవుల ఆయువు, సూర్యుడు ఉదయించడం అస్తమించటంతో, క్షీణిస్తుంటుంది. దేహంపైనా, భార్యపైనా, స్నేహితులపైనా, సోదరులపైనా నాది, నావారు అనే మమకారంతో కట్టుబడిపోతారు. ఆ బంధం నుంచి విడివడే ఉపాయం కనపడక సంసార మనే చీకటిలో మునిగి భూత భవిష్యత్తులు తెలియక గుడ్లగూబల లాగా మానవులు పుట్టుక ముసలితనం రోగాలు ఆపదలు చావు పొందుతు కూడ శరీరమే మేలనుకుంటూ ఉంటారు. మోహాన్ని కలిగించే మద్యపానంతో మత్తులై ఇంద్రియవిషయ ఆసక్తులై తమ్ము తాము తెలుసుకోలేక విరక్తిమార్గం తెలియక నడయాడుతుంటారు అటువంటి మూఢులైన మానవుల సమీపానికి పోవలదు. కేవలం నారాయణుని పైన భక్తిభావం గల సద్గురువును నిత్యము భజించి ఉత్తమమైన భాగవతధర్మాలను అనుష్టించాలి. ఆ ధర్మాలు ఏవంటే:
1. మూఢుల పొంతల పోకపోవుట; 2, సద్గురు ప్రతిదిన భజనము; 3. సత్త్వగుణము కలిగి ఉండటం; 4. భూతదయ; 5. హరికథామృత పానం; 6. బ్రహ్మచర్య వ్రతం; 7. ఇంద్రియ సుఖాలందు మనస్సును చేరనీయ కుండటం; 8. సాధుసంగమం; 9. సజ్జనులతో స్నేహం; 10 వినయ సంపద; 11. శుచిగా ఉండటం; 12. తపస్సు; 13 క్షమ; 14. మౌనవ్రతం; 15. వేదశాస్త్రాలను చదవటం వాటి అర్ధాన్ని అనుష్ఠించటం; 16. అహింస; 17. సుఖాన్నిగాని దుఃఖాన్నిగానీ సహించటం; 18. ఈశ్వరుడు అంతటా ఉన్నట్లు భావించటం; 19. మోక్షం పొందాలనే కోరిక; 20. కుజనుల సంగతి వదలటం; 21. వల్కలాలు మొదలైనవి కట్టడం; 22. దానంతట అది లభించిన దానితో సంతుష్టి చెందటం; 23. వేదాంతశాస్త్రాల అర్ధాలను తెలుసుకోవా లనే కుతూహలం; 24. ఇతర దేవతలను నిందించకుండా ఉండటం; 25. త్రికరణసుద్ధి; 26. సత్యమే పలకటం; 27. శమం దమం మొదలైన గుణవిశేషాలు; 28. ఇల్లు తోటలు పొలాలు భార్య సంతానం ధనం మొదలైనవాటిని పరమేశ్వరార్పణం గాభావించటం; 29. భక్తులు కాని వారిని ఆశ్రయించకుండా ఉండటం.” అని చెప్పి పిమ్మట...

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=10&Padyam=54

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Wednesday, November 9, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౫(675)

( అంతరిక్షు సంభాషణ ) 

11-53-ఉ.
"జ్ఞానవిహీనులైన నరసంఘముఁ గానఁగరాని మాయఁ దా
లోన నడంచి యెట్లు హరిలోకముఁ జెందుదు? రంతయుం దగన్‌
భూనుత! సత్యవాక్యగుణభూషణ! యిక్కథ వేడ్కతోడుతం
బూనికఁ జెప్పు" మన్నను బ్రబుద్ధుఁడు నిట్లను గారవంబునన్‌.

భావము:
“మీరు లోకోత్తములు. సత్యవాక్య పరిపాలకులు. కనరాని మాయను లోపల అణచివేసి అజ్ఞానులు ఏ విధంగా వైకుంఠాన్ని చేరగలుగుతారు? ఈ విషయాన్ని దయతో చెప్పండి.” ఇలా అన్న విదేహునితో ప్రబుద్ధుడు అనే మహముని ఆదర పూర్వకంగా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=9&Padyam=53

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, November 6, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౪(674)

( అంతరిక్షు సంభాషణ ) 

11-49-క.
"గజరాజవరదు గుణములు
త్రిజగత్పావనము లగుటఁ దేటపడంగా
సుజనమనోరంజకముగ
విజితేంద్రియ! వినఁగ నాకు వేడుక పుట్టెన్‌. "
11-50-వ.
అనిన విని యంతరిక్షుం డను ఋషిశ్రేష్ఠుం డిట్లనియె.
11-51-క.
పరమబ్రహ్మ మనంగాఁ,
బరతత్త్వ మనంగఁ, బరమపద మనఁగను, నీ
శ్వరుఁ డనఁ, గృష్ణుఁ డన, జగ
ద్భరితుఁడు, నారాయణుండు దా వెలుఁగొందున్‌.


భావము:
“మహాత్ములారా! మీరు ఇంద్రియాలను జయంచిన మహానుభావులు. మూడులోకాలను పరమ పవిత్రం చేసే, గజరాజవరదుడు శ్రీహరి గుణవిశేషాలను మనోరంజకంగా మీనుండి వినాలని నాకు వేడుక పుట్టింది.” ఇలా పలికిన విదేహునితో అంతరిక్షుడు అనే మహర్షి ఇలా అన్నాడు. “పరబ్రహ్మ అన్నా; పరతత్వము అన్నా; పరమపదము అన్నా; ఈశ్వరుడు అన్నా; శ్రీకృష్ణుడు అన్నా; శ్రీమన్నారాయణుడే. ఆయనే జగద్భరితుడై ప్రకాశిస్తూ ఉంటాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=9&Padyam=51

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, November 5, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౩(673)

( హరిముని సంభాషణ ) 

11-48-వ.
ఇట్లు సర్వసంగపరిత్యక్తుండై, నిఖిలాంతరాత్ముండై, పరమేశ్వరు డరుణగభస్తి కిరణ సహస్రంబుల లోకత్రయంబుం బావనంబు సేయు చందంబునం దన చరణారవింద రజఃపుంజంబు చేతం బవిత్రంబు సేయుచు, సురాసురజేగీయమానసేవ్యం బైన జనార్దన పాదారవిందంబులకు వందనాభిలాషుఁడై, భక్తియు లవమాత్రంబునుం జలింపనీక సుధాకరోదయంబున దివాకరజనితతాపనివారణం బయిన భంగి నారాయణాంఘ్రినఖమణిచంద్రికా నిరస్త హృదయతాపుండై, యాత్మీయభక్తిరశనానుబంధబంధురంబైన వాసుదేవ చరణసరోరుహ ధ్యానానందపరవశుం డగు నతండు భాగవతప్రధానుం” డని యెఱింగించిన విని విదేహుం డిట్లనియె.

భావము:
భాగవతోత్తముడు ఈ విధంగా సకల బంధాలను త్రెంపుకుని అన్నింటిలో పరమాత్మను గుర్తించినవాడై మెలగుతాడు. మహాప్రభువైన సూర్యుడు తన సహస్ర కిరణాలచేత మల్లోకాలనూ పావనం చేయునట్లు, తన పాదధూళి చేత జగత్రయాన్నీ పవిత్రం చేస్తూ ఉంటాడు. దేవదానవులకు కూడా సేవింపదగిన జనార్ధునుని చరణారవిందాలకు నమస్కరించా లనే అభిలాష కలిగి ఉంటాడు. తన భక్తిని రవ్వంత కూడ చలించనీయక చంద్రుడు ఉదయించడంతో ఎండ బాధ పోయినట్లు నారాయణుని చరణకాంతుల వెన్నెలలచే భాగవతుడు హృదయతాపం పోగొట్టుకుంటాడు. ఉత్తమ భాగవతుడు తన భక్తి అనే బంధాలతో వాసుదేవుని చరణపద్మాలకు బంధించుకుని ధ్యానానందంలో పరవశిస్తూ ఉంటాడు.” ఈ విధంగా మహాముని తెలుపగా రాజు విదేహుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=8&Padyam=48

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, November 4, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౨(672)

( విదేహ హర్షభ సంభాషణ ) 

11-45-వ.
అనిన విదేహభూపాలుడు “భాగవతధర్మం బెద్ది? యే ప్రకారంబునం బ్రవర్తించు? వారల చిహ్నంబు లెవ్వి? యంతయు నెఱింగింప నీవ యర్హుండ” వనిన నందు హరి యను మహాత్ముం డిట్లనియ.
11-46-తే.
"సర్వభూతమయుండైన సరసిజాక్షుఁ
డతఁడె తన యాత్మయం దుండు ననెడువాఁడు,
శంఖచక్రధరుం డంచుఁ జనెడువాఁడు,
భక్తిభావాభిరతుఁడు వో భాగవతుఁడు.
11-47-క.
వర్ణాశ్రమధర్మంబుల
నిర్ణయకర్మములఁ జెడక నిఖిలజగత్సం
పూర్ణుఁడు హరి యను నాతఁడె
వర్ణింపఁగ భాగవతుఁడు వసుధాధీశా!

భావము:
అని మహాముని కవి చెప్పాడు. అంత, విదేహ రాజు ఇలా అడిగాడు. “భాగవతధర్మ మేది? అది ఏ ప్రకారంగా ప్రవర్తిస్తుంది? భాగవతుల గుర్తు లేమిటి? ఇవి చెప్పటానికి మీరే తగినవారు.” దానికి వారిలో హరి అనే మహాముని ఇలా చెప్పసాగాడు:
“భాగవతుడు అంటే ఆ హరి యందు భక్తీ ఆసక్తీ కలవాడు; సర్వభూతమయుడైన పద్మలోచనుడు శంఖం చక్రం దాల్చి తన ఆత్మలో ఉన్నాడనే విశ్వాసం కలవాడు. ఓ మహా రాజా విదేహ! భాగవంతుడు చతుర్వర్ణాలు చతురాశ్రమాలు వాటి ధర్మాలు కర్మలు అంటూ వీటిలో మునిగిపోకుండా, భక్తిమార్గాన్ని ఆశ్రయించి, శ్రీహరి విశ్వం అంతా నిండి ఉన్నాడు అంటాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=8&Padyam=47

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, November 3, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౧(671)

( విదేహ హర్షభ సంభాషణ ) 

11-44-సీ.
సంతతంబును గృష్ణ సంకీర్తనంబులు-
  వీనుల కింపుగ వినఁగవలయు,
హర్షంబుతోడుత హరినామకథనంబు-
  పాటలఁ నాటలఁ బరఁగవలయు,
నారాయణుని దివ్యనామాక్షరంబులు-
  హృద్వీథి సతతంబు నెన్నవలయుఁ,
గంజాక్షులీలలు కాంతారముల నైన-
  భక్తి యుక్తంబుగాఁ బాడవలయు,
11-44.1-తే.
వెఱ్ఱిమాడ్కిని లీలతో విశ్వమయుని
నొడువుచును లోకబాహ్యత నొందవలయు,
నింతయును విష్ణుమయ మని యెఱుఁగవలయు,
భేద మొనరింప వలవదు మేదినీశ!"

భావము:
ఓ రాజా! సదా శ్రీకృష్ణ సంకీర్తనలు వీనులవిందుగా వినాలి; హరినామ కథనాన్ని సంతోషంతో ఆడుతూ పాడుతూ చెయ్యాలి; నారాయణుని దివ్యమైన నామాలను హృదయంలో సదా స్మరిస్తూ ఉండాలి; కమలనయనుని లీలలను అడవులలో చరిస్తున్నా భక్తియుక్తంగా పాడాలి; విశ్వమయుడిని వెఱ్ఱిగా కీర్తిస్తూ లోకానికి అంటీ అంటకుండా ఉండాలి; ఈ సృష్టి మొత్తం విష్ణుమయ మని తెలుసుకోవాలి; భేదబుద్ధి ఏ మాత్రమూ చూపరాదు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=7&Padyam=44

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, November 2, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౦(670)

( విదేహ హర్షభ సంభాషణ ) 

11-42-క.
కరణత్రయంబు చేతను
నరుఁడే కర్మంబు సేయు నయ్యైవేళన్‌
హరి కర్పణ మని పలుకుట
పరువడి సుజ్ఞాన మండ్రు పరమమునీంద్రుల్‌.
11-43-వ.
జ్ఞానాజ్ఞానంబు లందు సంకలితుండైన స్మృతి విపర్యయంబు నొందు; నట్లుగావున గురుదేవతాత్మకుం డయి, బుద్ధిమంతుండైన మర్త్యుండు శ్రీ వల్లభు నుత్తమోత్తమునిఁగాఁ జిత్తంబునఁ జేర్చి సేవింపవలయు; స్వప్న మనోరథేచ్ఛాద్యవస్థలయందు సర్వసంకల్పనాశం బగుటంజేసి, వానిఁ గుదియం బట్టి నిరంతర హరిధ్యానపరుం డైనవానికిఁ గైవల్యంబు సులభముగఁ గరతలామలకంబై యుండు.

భావము:
త్రికరణశుద్ధిగా అనగా మనసుతో, వాక్కుతో, కాయంతో చేసే ప్రతీ కర్మా “కృష్ణార్పణం” అని మనస్ఫూర్తిగా పలకటమే సుజ్ఞానము అని మహామునీశ్వరులు అంటారు. జ్ఞాన, అజ్ఞానాలలో కలత చెందుతుంటే స్మృతి వ్యత్యస్తమవుతుంది. కాబట్టి, గురువునకు దేవుడికి అనుగుణంగా నడచే బుద్ధిమంతుడైన నరుడు లక్ష్మీపతి ఐన విష్ణుమూర్తిని ఉత్తమోత్తముడైన పురుషోత్తముడిగా చిత్తంలో చేర్చి సేవించాలి. కలల యందు, కోరికల యందు, వాంఛల యందు సర్వసంకల్పాలు నాశనం అవుతాయి. కనుక, ఎట్టి పూనిక గట్టిగా నిలుబడదు. అందుచేత, వాటిని అణచుకుని ఎప్పుడూ శ్రీహరిని ధ్యానిస్తూ ఉండే వాడికి కైవల్యం చేతిలో ఉసిరికాయలాగ సులభంగా ప్రాప్తిస్తుంది

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=7&Padyam=43

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, November 1, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౯(669)

( విదేహ హర్షభ సంభాషణ ) 

11-41-వ.
మఱియు సకలజంతుసంతానంబుకంటె మానుషాకారంబు నొందుట దుర్లభం; బంతకంటె నారాయణచరణయుగళస్మరణ పరాయణులగుట దుష్కరంబు; గావున నాత్యంతికంబగు క్షేమంబడుగ వలసెఁ; బరమేశ్వరుండు ప్రపత్తినిష్ఠులకు సారూప్యం బెట్లొసంగు నత్తెఱం గానతిం” డనిన విని విదేహభూపాలునకు హరికథామృత పానాతిపరవశులైన మునిసమాజంబునందుఁ గవి యను మహానుభావుం డిట్లని చెప్పం దొడంగె; “నరిషడ్వర్గంబునందు నీషణత్రయంబుచేతం దగులువడి మాత్సర్యయుక్త చిత్తుం డగు నట్టి వానికెవ్విధంబున నచ్యుత పాదారవింద భజనంబు సంభవించు? విశ్వంబును నాత్మయు వేఱుగా భావించు వానికి భీరుత్వం బెట్లు లే? దవిద్యాంధకారమగ్నులకు హరిచింతనంబెట్లు సిద్ధించు? నట్టి నరుండు తొంటికళేబరంబు విడిచి పరతత్త్వం బెబ్భంగిం జేరు? ముకుళీకృతనేత్రుండయిన నరుండు మార్గభ్రమణంబునఁ దొట్రుపాటువడి చను చందంబున విజ్ఞానవిమలహృదయభక్తిభావనా వశంబు లేకున్నఁ బరమపదంబు వీరికెవ్విధంబునం గలుగు? నని యడిగితివి; గావునఁ జెప్పెద; సావధానుండవై యాకర్ణింపుము.

భావము:
అంతేకాదు సకల రకాల జంతువుల జన్మల కంటె మానవ జన్మ శ్రేష్ఠమైనది, అది ప్రాప్తించటం కష్ట సాధ్యం. అందులోనూ శ్రీమన్నారాయణుని చరణయుగళ స్మరణంమీద ఆసక్తి కలగటం మరీ కష్టం. అందువలన, శాశ్వతమైన క్షేమాన్ని గురించి అడుగ వలసి వచ్చింది. ప్రపత్తి యందు నిష్ఠగల భక్తులకు పరమేశ్వరుడు శ్రీమహావిష్ణువు సారూప్యం ఎలా ఇస్తాడు, ఈ విషయం చెప్పండి.” అని అడిగిన విదేహరాజుతో శ్రీహరి కథామృతాన్ని త్రాగి పరవశులు ఐన ఆ మునులలో కవి అనే మహానుభావుడు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు.
“(1) అరిషడ్వర్గం అనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఆరింటిలోను; ఈషణత్రయం అనే దారేషణ ధనేషణ పుత్రేషణ మూడింటిలోనూ; చిక్కుకుని మాత్సర్యంతో కూడిన మనసు కల మానవుడికి శ్రీహరి పాదపద్మాలను భజించే భాగ్యం ఎలా ప్రాప్తిస్తుంది?
(2) విశ్వము వేరు, ఆత్మ వేరు అని భావించే వాడికి భయం ఎలా లేకుండా పోతుంది?
(3) అట్లు అవిద్యాంధకారంలో మునిగితేలే వాడికి విష్ణుభక్తి ఎలా అలవడుతుంది?
(4) అటువంటి నరుడు మొదటి శరీరాన్ని త్యజించి పరతత్వాన్ని ఏ విధంగా చేరుతాడు?
(5) కండ్లు మూసుకుని నడిచే మనిషి దోవలో తడబాటులు పడుతూ పోతున్నట్లుగా, విజ్ఞానంతో శుద్ధమైన హృదయంలో భక్తిభావన లేకుండా పోతే పరమపదం ఎలా సిద్ధిస్తుంది” అని అడిగావు. సమాధానాలు చెప్తాను శ్రద్ధగా విను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=7&Padyam=41

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :