Tuesday, January 10, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౧౫(715)

( అవధూత సంభాషణ ) 

11-109-వ.
అని యుద్ధవుం డడగినం బ్రబుద్ధమనస్కుం డయిన పుండరీకాక్షుండు “నీ ప్రశ్నంబులు దుర్లభంబు లయినను వినుము; నియమ శమ దమాదులు దపంబును సుఖదుఃఖంబులు స్వర్గ నరకంబులుననం బరఁగినవి యెవ్వి, దరిద్రుం డెట్టివాఁ డీశ్వరుండెవ్వం, డని నీవు నన్నడిగిన యర్థంబు లెల్ల వేఱువేఱ వివరించెద; మౌనవ్రత బ్రహ్మచర్య క్షమా జప తపంబులును, నతిథిసత్కారంబును, బరహితంబును, జౌర్యాదిరహితత్వంబును ననునివి మొదలైనవి నియమంబు లనందగు; నింద్రియనిగ్రహంబును, శత్రుమిత్ర సమత్వంబును, శమం బనం బరఁగు; మూఢజనులకు జ్ఞానోపదేశంబును, గామ్యత్యాగంబును, సమదర్శనంబును, వైష్ణవ సమూహంబులతోడి భక్తియుఁ, బ్రాణాయామంబును, జిత్తశుద్ధియు నను నివి కలిమివిద్య యనంబడు; శమదమాది గుణరహితుండును, మద్భక్తి విరహితుండును నగుట యవిద్య యనందగుఁ; జిత్తశుద్ధి గలిగి నిత్యతృప్తుండౌట దమం; బిట్టి నియమాది గుణ సహితత్వంబును మద్భక్తియుక్తియు ననునదియే సుఖంబు; నన్నెఱుంగలేక తమోగుణంబునం బరఁగుటయె దుఃఖం బనంబడు; బంధు గురు జనంబుల యెడ భేదబుద్ధి నొంది, శరీరంబు నిజగృహంబుగా భావించినవాఁడె దరిద్రుం; డింద్రియ నిరసనుండును, గుణ సంగ విరక్తుండు నైనవాఁడె యీశ్వరుండు; నాయందుఁ దలంపు నిలిపి, కర్మయోగంబునందును, భక్తి యోగంబునందును వాత్సల్యంబు గలిగి జనకాదులు కైవల్యంబుఁ జెందిరి; భక్తియోగంబునం జేసి బలి ప్రహ్లాద ముచుకుందాదులు పరమ పదప్రాప్తులై; రది గావున నిది యెఱింగి నిరంతర భక్తియోగం బధికంబుగా నీ మనంబున నిలుపుము; మృణ్మయంబైన ఘటంబున జలంబులు జాలుగొను తెఱంగున దినదినంబునకు నాయువు క్షయం బై మృత్యువు సన్నిహితం బై వచ్చుఁ గావున నిది యెఱింగి నిరంతంరంబును నన్నేమఱక తలంచుచుండు నతండు నాకుం బ్రియుండు.

భావము:
ఇలా ఉద్ధవుడు అడుగగా జ్ఞానాత్మకుడైన శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. “ఉద్ధవా! నీ ప్రశ్నలు సామాన్య మైనవి కావు. అయినా విను, చెప్తాను. యమ నియమాలూ శమదమాలు మొదలైనవి ఏవి? తపమనగా ఏమి? సుఖదుఃఖాలు స్వర్గనరకాలూ ఏవి? దరిద్రుడు అంటే ఎట్టివాడు? ఈశ్వరు డంటే ఎవరు? అని నీవు అడిగిన విషయాలన్నీ విడివిడిగా వివరిస్తాను.

మౌనవ్రతము, బ్రహ్మచర్యము, ఓర్పు, జపము, తపము, అతిధులను సత్కరించుట, పరహితము, దొంగతనమూ మొదలైనవి లేకుండుట, ఇటువంటివి నియమాలు అనబడతాయి. ఇంద్రియాలను వశంలో ఉంచుకోవటం, శత్రువులందు మిత్రులందు సమభావంతో ఉండటం శమము. మూఢులకు జ్ఞానాన్ని ఉపదేశించటము, కోరికలను వదలటం, సమదర్సనం, వైష్ణవభక్తి, ప్రాణాయామం, మనోనిర్మలత్వం వీటిని విద్య అంటారు. శమదమాది గుణాలు లేకపోవటం, నామీద భక్తి లేకపోవటం, అవిద్య అంటారు, చిత్తశుద్ధి కలిగి ఎప్పుడు తృప్తిగా ఉండటం దమము. ఇటువంటి నియమాలు గుణాలు కలిగి, నామీద భక్తి కలిగి ఉండటమే సుఖము. నన్ను తెలుసుకోలేక తమోగుణముతో ఉండటమే దుఃఖము. బంధువులందు గురువులందు భేదబుద్ధి పొంది శరీరాన్ని తన ఇల్లుగా భావించేవాడే దరిద్రుడు. ఇంద్రియాలను జయించి గుణసంగములలో విరక్తుడైన వాడే ఈశ్వరుడు.

నా మీద మనసును నిలిపి కర్మయోగమందు, భక్తియోగమందు అభిమానం కలిగిన జనక మహారాజు మొదలైన వాళ్ళు మోక్షం పొందారు. భక్తియోగం సాధించి బలి, ప్రహ్లాదుడు, ముచుకుందుడు మున్నగువారు పరమపదాన్ని పొందారు. కనుక, ఈ విషయాల్ని తెలుసుకుని ఎప్పుడూ భక్తియోగాన్ని ఎక్కువగా నీ మనసులో నింపుకో. మట్టికుండకు చిల్లుపడితే నీళ్ళు కారిపోవునట్లు దినదినము ఆయువు తరిగిపోతూ చావు దగ్గరపడుతు ఉంటుంది. కాబట్టి, ఇది ఎరిగి ఎప్పుడూ ఏమరక నన్ను స్మరిస్తూ ఉండేవాడు, నాకు ప్రియుడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=109

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

No comments: