Friday, April 26, 2019

కపిల దేవహూతి సంవాదం - 8



3-877-సీ.
"జనయిత్రి! విను మఱి సకల పదార్థప;
రిజ్ఞానతత్త్వపారీణ మైన
యామ్నాయ విహితకర్మాచారములు గల్గి;
తివుటమై వర్తించు దేవగణము
పూని నైసర్గికంబైన నిర్హేతుక;
మగు భగవత్సేవ మిగుల ముక్తి
కంటె గరిష్ఠంబు గావున నదియు భు;
క్తాన్నంబు జీర్ణంబు నందఁ జేయు
3-877.1-తే.
దీప్త జఠరాగ్నిగతి లింగదేహనాశ
కంబు గావించు నదియునుగాక విష్ణు
భక్తి వైభవములఁ దేటపఱతు వినుము
సద్గుణవ్రాత యోగలక్షణసమేత

భావము:
“అమ్మా! సద్గుణసమూహం, యోగలక్షణాలు కలదానా! విను. సకలపదార్థాలకూ సంబంధించిన యథార్థస్వరూపాన్ని పూర్తిగా తెలియజేసేవి వేదాలు. వేదసంబంధమైన సత్కర్మలకూ సదాచారాలకూ దేవతలు సంతృప్తులౌతారు. సహజమూ నిర్హేతుకమూ అయిన భగవంతుని సేవారూపమైన భక్తి ముక్తికంటె గొప్పది. జీర్ణాశయమందలి జఠరాగ్ని తిన్న అన్నాన్ని జీర్ణం చేసినట్లుగా భగవద్భక్తి జీవులు కావించిన కర్మలనూ కర్మఫలాలనూ లోగొంటుంది. అందువల్ల జీవుని లింగమయ శరీరం నశిస్తుంది. విష్ణుభక్తి విశేషాలను వివరిస్తాను విను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=46&padyam=877

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: