3-879-సీ.
పరికింపఁ గొందఱు భాగవతోత్తముల్;
ఘనత కెక్కిన పురాతనము లైన
చారు ప్రసన్న వక్త్రారుణలోచన;
ములు గల్గి వరదాన కలితములుగఁ
దనరు మద్దివ్యావతార వైభవములు;
మదినొప్పఁ దమ యోగమహిమఁ జేసి
యనుభవించుచుఁ దదీయాలాపములు సన్ను;
తించుచుఁ దివుటఁ దద్దివ్య విలస
3-879.1-తే.
దవయవోదార సుందర నవవిలాస
మందహాస మనోహర మధుర వచన
రచనచే నపహృత మనఃప్రాణు లగుచు
నెలమి నుందురు నిశ్శ్రేయసేచ్ఛ లేక.
భావము:
కొందరు భాగవతోత్తములు ప్రసిద్ధికెక్కిన నా పురాణ స్వరూపాలను స్మరిస్తూ ఉంటారు. అందాలు చిందే ముఖమూ, కరుణారసం విరజిమ్మే అరుణనేత్రాలూ కలిగి భక్తులకు వరాలను ప్రసాదించే నా దివ్యావతారాలనూ వాని వైభవవిశేషాలనూ మనస్సులో నిలుపుకుంటారు. తమ భక్తియోగ మహత్త్వంవల్ల అలనాటి నా సంలాపాలను స్మరించుకొని కొనియాడుతుంటారు. నవనవోన్మేషమైన నా అవయవ సౌభాగ్యాన్నీ, సుందరమైన నా మందహాసాన్నీ, మనోహరాలైన నా మధురవాక్కులనూ మాటిమాటికీ మననం చేసుకుంటూ మనస్సూ, ప్రాణమూ పరవశింపగా మోక్షంమీద అపేక్ష లేకుండా ఉంటారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=46&padyam=879
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment