Tuesday, April 23, 2019

కపిల దేవహూతి సంవాదం - 1:



3-866-వ.
పరబ్రహ్మంబుఁ జిత్తంబున నిల్పి యహంకారంబు విడిచి మమత్వంబు నిరసించి దయాగుణంబునం జేసి సకల భూతంబు లందు సమత్వంబు భజియించి శాంతశేముషీ గరిష్ఠుం డగుచు నిస్తరంగం బగు వార్థి చందంబున ధీరుండై నిఖిల ప్రపంచంబును వాసుదేవమయంబుగా దలంచుచు భక్తియోగంబున భాగవత గతిం బొందె" అని చెప్పి; వెండియు, మైత్రేయుండు విదురునిం గనుంగొని "కర్దముండు వనంబునకుం జనిన యనంతరంబ మాతృవత్సలుం డయిన కపిలుండు బిందుసరంబున వసియించి యుండ దేవహూతి తత్త్వమార్గ ప్రదర్శకుం డైన సుతునిం గనుంగొని బ్రహ్మవచనంబులు దలంచుచు నిట్లనియె.

భావము:
కర్దముడు పరబ్రహ్మను చిత్తంలో నిల్పుకొని, అహంకారాన్ని విడిచి, మమకారాన్ని వదలి, దయామయ హృదయంతో సమస్త ప్రాణులను తనతో సమానంగా చూస్తూ, ప్రశాంత స్వభావం కలవాడై, అలలు లేని సముద్రం వలె ధీరుడై, సమస్త ప్రపంచాన్ని విష్ణుమయంగా భావిస్తూ, భక్తియోగంతో భాగవతులు పొందే పరమపదాన్ని అందుకున్నాడు - అని మైత్రేయుడు విదురునితో చెప్పి ఇంకా ఇలా అన్నాడు. “కర్దముడు అరణ్యానికి వెళ్ళిన తరువాత మాతృప్రేమ కలిగిన కపిలుడు బిందుసరోవరం దగ్గర నివసించి ఉండగా దేవహూతి తనకు తత్త్వమార్గాన్ని చూపగలిగే కుమారుని చూచి బ్రహ్మ చెప్పిన మాటలను తలచుకొంటూ ఇలా అన్నది.
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: