Friday, June 15, 2018

శ్రీకృష్ణ లీలలు - 28

10.1-337-వ.
అని పలికిన ముగుదతల్లికి నెఱదంట యైన కొడు కిట్లనియె.
10.1-338-శా.
"అమ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో? 
నమ్మం జూడకు వీరి మాటలు మదిన్; న న్నీవు గొట్టంగ వీ
రి మ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాస్య గం
ధ మ్మాఘ్రాణము జేసి నా వచనముల్ దప్పైన దండింపవే."

భావము:
ఆ ముద్దరాలు అయిన తల్లి యశోదా దేవికి మాయలమారి కృష్ణబాలుడు సమాధానం చెప్తున్నాడు. " అమ్మా! మట్టి తినడానికి నేనేమైనా చంటిపిల్లాడినా చెప్పు. ఇప్పుడే కదా పాలు తాగాను ఇంకా ఆకలి ఎందుకు వేస్తుంది. లేకపోతే నేనేమైనా అంత వెర్రివాడినా ఏమిటి మట్టి తినడానికి. నువ్వు నన్ను కొట్టాలని వీళ్ళు కల్పించి చెప్తున్నారు అంతే. కావాలంటే నా నోరు వాసన చూడు. నే చెప్పింది అబద్ధమైతే కొట్టుదుగానిలే. వీళ్ళు చెప్పేమాటలు నమ్మవద్దు" అని చిన్నికృష్ణుడు. మట్టి ఎందుకు తింటున్నావని దెబ్బలాడుతున్న తల్లి యశోదమ్మకి సర్ది చెప్పి, నోరు తెరిచి చూపించబోతున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=48&padyam=338

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: