Tuesday, June 5, 2018

శ్రీకృష్ణ లీలలు - 23

10.1-328-క.
కడు లచ్చి గలిగె నేనిం
గుడుతురు గట్టుదురు గాక కొడుకుల నగుచున్
బడుగుల వాడలపైఁ బడ
విడుతురె రాకాంత లెందు? విమలేందుముఖీ!
10.1-329-క.
ఓ యమ్మ! నీ కుమారుఁడు
మా యిండ్లను బాలు పెరుగు మననీ డమ్మా! 
పోయెద మెక్కడి కైనను
మా యన్నల సురభులాన మంజులవాణీ!” 


భావము:
నిర్మలమైన మోము గల ఓ యశోదాదేవి! ఎంత భాగ్యవంతులు అయితే మాత్రం. గొప్ప తిండి తింటారు, గొప్ప బట్టలు కట్టుకుంటారు. అంతేకాని రాజవంశపు స్త్రీలు ఎక్కడ అయినా ఇలా పిల్లలను ఊళ్ళోని పేదల మీద పడి పేదలను వేపుకు తిన మని చిరునవ్వులు నవ్వుతూ పంపుతారా? చెప్పు. ఓ యశోదమ్మ తల్లీ! నీ సుపుత్రుడు మా ఇళ్ళల్లో బాలుపెరుగు బతకనీయ డమ్మా. మెత్తని మాటల మామంచి దానివే కాని. సర్దిపుచ్చాలని చూడకు. మేం వినం. మా అన్న నందుల వారి గోవుల మీద ఒట్టు. ఈ వాడలో మేం ఉండలేం. ఊరు విడిచి పోతాం. మాకు మరో గతి లేదు.": : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments: