Tuesday, June 5, 2018

శ్రీకృష్ణ లీలలు - 22

10.1-327-సీ.
కలకంఠి! మా వాడ గరితల మెల్ల నీ; 
పట్టి రాఁగల డని పాలు పెరుగు
లిండ్లలోపల నిడి యే మెల్లఁ దన త్రోవఁ; 
జూచుచో నెప్పుడు చొచ్చినాఁడొ? 
తలుపుల ముద్రల తాళంబులును బెట్టి; 
యున్న చందంబున నున్న వరయ; 
నొక యింటిలోఁ బాడు నొక యింటిలో నాడు; 
నొక యింటిలో నవ్వు నొకటఁ దిట్టు;
10.1-327.1-ఆ.
నొకట వెక్కిరించు నొక్కొకచో మృగ
పక్షి ఘోషణములు పరఁగఁ జేయు
నిట్లు చేసి వెనుక నెక్కడఁ బోవునో
కాన రాఁడు రిత్త కడవ లుండు.

భావము:
ఓ యశోదమ్మా! మంజులవాణి! మీ వాడు వస్తాడని ఊహించాము. మా వీథిలోని గొల్ల భామలము అందరము తలుపులు అన్ని వేసేసి, గడియలకు తాళాలు బిగించాము. అతను వచ్చే దారిని కాపాలాగా చూస్తునే ఉన్నాం. తలుపులకు వేసిన గొళ్లేలు తాళాలు వేసినవి వేసినట్టే ఉన్నాయి. కాని ఇలా చూసేసరికి ఎలా వచ్చాడో ఎలా దూరాడో మరి ఒకరి ఇంట్లో పాటలు పాడుతున్నాడు. ఇంకొక ఇంటిలో గెంతుతున్నాడు. ఇంకో ఇంట్లో నవ్వుతున్నాడు. మరింకొక ఇంట్లోనేమో తిడుతున్నాడు. ఇంకొక చోటేమో ఎక్కిరిస్తున్నాడు. కొన్ని ఇళ్ళల్లో అయితే పక్షులలా కూతలు జంతువులలా కూతలు కూస్తున్నాడు.. ఇంతట్లోనే ఎలా వెళ్ళిపోతాడో చటుక్కున వెళ్ళిపొతాడు. చూస్తే ఖాళీ కడవలు ఉంటాయి తల్లీ.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=45&padyam=327

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: